స్వతంత్రంగా వ్యవహరించటంలేదు
న్యాయవ్యవస్థపై మాజీ న్యాయమూర్తి అభయ్ తిప్సే ఆవేదన
హైదరాబాద్: దేశంలో న్యాయవ్యవస్థ స్వతంత్రంగా వ్యవహరించటం లేదని అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అభయ్ తిప్సే ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం సుందరయ్యవిజ్ఞానకేంద్రంలో భారత ప్రజా న్యాయవాదుల అసోసియేషన్ మహాసభల ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు. న్యాయ వ్యవస్థలో రాజకీయ జోక్యం పెరిగిపోయిందని.. న్యాయమూర్తులు సైతం స్వార్థ ప్రయోజనాల కోసం ప్రలోభాలకు గురవుతున్నారన్నారు. న్యాయ మూర్తుల నియామకాల్లో అవినీతి, బంధుప్రీతి ఏర్పడుతుందన్నారు.
అసోసి యేషన్ ఉపాధ్యక్షుడు ఎం.వెంకన్న మాట్లాడుతూ... ప్రజలకు న్యాయం అందించేందుకు, ప్రజాస్వామ్య పరిరక్షణకు తమ అసోసియేషన్ కృషి చేస్తుందన్నారు. క్రూర, నిర్బంధ చట్టాలైన యూఏపీఏ, ఏఎఫ్ఎస్పీఏ, సెక్షన్ 124ఎ, ఐపీసీలను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. రిటైర్డ్ జస్టిస్ హెచ్.సురేశ్, పర్వేజ్ ఇమ్రోజ్ తదితరులు పాల్గొన్నారు.
నూతన కార్యవర్గం ఎన్నిక: భారత ప్రజాన్యాయవాదుల అసోసియేషన్ అధ్యక్షుడిగా ముంబాయి హైకోర్టు మాజీ న్యాయమూర్తి హెచ్. సురేశ్, ఉపాధ్యక్షులుగా సుధా భరద్వాజ్, ఎం. వెంకన్న, ప్రధాన కార్యదర్శిగా సురేంద్ర గడ్లింగ్, సహాయ కార్యదర్శులుగా అంకిత్ గ్రేవెల్, సురేశ్ కుమార్, కోశాధికారిగా అరుణ్ ఫెర్రియా తదితరులు ఎన్నికయ్యారు.