ఇరుప్రాంతాలకు న్యాయం జరగాలి:శరద్‌యాదవ్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన జరిగితే ఇరు ప్రాంతాల ప్రజలకు న్యాయం జరగాల్సి ఉందని జెడియు అధినేత శరద్ యాదవ్ అభిప్రాయపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ నాయకత్వంలోని ఆ పార్టీ ప్రతినిధి బృందంతో శరద్ యాదవ్ సమావేశం ముగిసింది. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనంతరం సీమాంధ్రలో నెలకొన్న పరిస్థితులను వారు వివరించినట్లు తెలిపారు. రాష్ట్ర విభజన జరిగింది కానీ ఇరు ప్రాంతాల ప్రజలకు న్యాయం జరుగలేదని చెప్పారన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న తరువాతే నిర్ణయం తీసుకోవాలన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. తొందరపడి నిర్ణయం తీసుకోవడం మంచిదికాదన్నారు.
రాష్ట్ర విభజన అనంతరం సీమాంధ్రలో నెలకొన్న పరిస్థితులను శరద్ యాదవ్‌కు వివరించినట్లు వైఎస్ విజయమ్మ చెప్పారు.
వైఎస్ఆర్ సిపి నేతల బృందం ఈ ఉదయం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని, ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌ను కలిసి రాష్ట్రంలో పరిస్థితిని వివరించారు.