Justice Manmohan
-
‘సుప్రీం’ జడ్జిగా జస్టిస్ మన్మోహన్ ప్రమాణం
న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మన్మోహన్(61) గురువారం సుప్రీంకోర్టు జడ్జీగా ప్రమాణం చేశారు. సుప్రీంకోర్టు కాంప్లెక్స్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆయనతో ప్రమాణం చేయించారు. జస్టిస్ మన్మోహన్ చేరికతో సీజేఐతో కలిపి సుప్రీంకు మంజూరైన 34 మంది జడ్జీలకు గాను ప్రస్తుతం 33 మంది ఉన్నట్లయింది. జస్టిస్ మన్మోహన్‌ను అత్యున్నత న్యాయస్థానానికి నవంబర్ 28న కొలీజియం సిఫారసు చేయడం, డిసెంబర్ 3న ఆయన్ను రాష్ట్రపతి ముర్ము నియమించడం తెల్సిందే. ఆల్ ఇండియా హైకోర్టు జడ్జీల్లో సీనియారిటీ పరంగా జస్టిస్ మన్మోహన్ రెండో స్థానంలోనూ, ఢిల్లీ హైకోర్టులో సీనియర్ మోస్ట్ న్యాయమూర్తిగాను ఉన్నారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి లా పట్టా పుచ్చుకున్న ఈయన 1987లో న్యాయవాదిగా పేరు నమోదుచేసుకున్నారు. సుప్రీంకోర్టు జడ్జీల రిటైర్మెంట్ వయస్సు 65 ఏళ్లు కాగా, హైకోర్టు జడ్జీల విరమణ వయస్సు 62 ఏళ్లు. -
‘నర్సరీ’పై వయోపరిమితి అధికారం ఎవరిచ్చారు?
ఢిల్లీ సర్కారుకు హైకోర్టు ప్రశ్న న్యూఢిల్లీ: నర్సరీలో ప్రవేశాలకు నాలుగేళ్ల గరిష్ట వయోపరిమితిని నిర్ధారిస్తూ డిసెంబర్ 18న ఆప్ ప్రభుత్వం తీసుకొచ్చిన నోటిఫికేషన్‌పై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. ప్రైవేటు స్కూళ్లలో నర్సరీలో ప్రవేశానికి నాలుగేళ్ల గరిష్ట వయోపరిమితి అనే అంశం మునుపే ఉందని, అయినా ఇలాంటి నిర్ణయాలు చిన్నపిల్లల హక్కులను కాలరాయడమే అవుతుందని జస్టిస్ మన్మోహన్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం వ్యాఖ్యానించింది. ఈ విధంగా నాలుగేళ్ల గరిష్ట వయోపరిమితిని విధించే అధికారం మీకు ఎవరిచ్చారంటూ డెరైక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్‌ను గట్టిగా నిలదీసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 18కి వాయిదా వేసింది. -
గర్భిణీలు, పాలిచ్చే తల్లులకే నైట్‌షెల్టర్లు
ఆరోగ్యంగా ఉన్న వారి కోసం కాదన్న హైకోర్టు న్యూఢిల్లీ: నైట్ షెల్టర్లను తమ శాశ్వత ఆవాసాలుగా ఏర్పరచుకున్న వారిపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిరాశ్రయులైన గర్భిణీలు, పాలిచ్చే తల్లులకే వాటిలో ఆశ్రయం కల్పించాలని, ఆరోగ్యంగా ఉన్న వారి కోసం కాదని స్పష్టం చేసింది. నైట్‌షెల్టర్లను శాశ్వత ఆవాసాలుగా మార్చుకొనేందుకు వాటిని నిర్మించలేదని పేర్కొంది. ‘‘ఢిల్లీకి వచ్చే ప్రతి వారికి శాశ్వత నివాసం కల్పించడం ఎలా సాధ్యం? వాటిపై మీకు గుత్తాధిపత్యం ఎలా ఉంటుంది? ఈ నివాసాలు నిరాశ్రయులైన గర్భిణీలు, పాలిచ్చే తల్లులకు మాత్రమే’’ అని జస్టిస్ మన్మోహన్ నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఢిల్లీలో వేల సంఖ్యలో నిరాశ్రయులున్నారని, కేవలం అవసరమైన వారికి మాత్రమే నైట్‌షెల్టర్లలో ఆశ్రయం కల్పిస్తామని తెలిపింది. అవసరం తీరిన వారు నైట్‌షెల్టర్లను విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది. గర్భిణీలు, పాలిచ్చే తల్లులకు సదుపాయాలు కల్పించాలంటూ హైకోర్టు గతం లో ఇచ్చిన ఆదేశాలపై స్పష్టతనివ్వాలని కోరుతూ ఢిల్లీ ప్రభుత్వం దాఖలు చేసిన విజ్ఞప్తిపై ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది. ఇతర రాష్ట్రాలకు చెందిన అనేకులు సంవత్సరాలుగా ఈ నైట్‌షెల్టర్లలో నివాసం ఉంటున్నారని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. మోతియాఖాన్ నైట్‌షెల్టర్‌లో నివాసముంటున్న ప్రియా కాలే అంతకుముందు ఓ కోర్టు ధిక్కార పిటిషన్‌ను దాఖలు చేశారు. ఆ శిబిరంలో అపరిశుభ్ర వాతావరణం కారణంగా తాను తన రెండు నెలల శిశువును కోల్పోయానని ఆమె పేర్కొన్నారు. నైట్ షెల్టర్లలో మెరుగైన జీవన, వైద్య సదుపాయాలు కల్పించాలని ఆమె కోరారు. దీనిపై స్పందించిన హైకోర్టు గర్భిణీలకు, పాలిచ్చే తల్లులకు సదుపాయాలను కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.