justies chandra kumar
-
మాట తప్పిన వ్యక్తి సీఎంగా అనర్హుడు
సుందరయ్యవిజ్ఞానకేంద్రం : తమ పార్టీ అధికారంలోకి రాగానే శ్రీశైలం ప్రాజెక్ట్ ముంపు గ్రామాల ప్రజలకు న్యాయం చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి మాట తప్పారని, మాట తప్పిన వారు ముఖ్యమంత్రి ఎలా అవుతారని తెలంగాణ ప్రజల పార్టీ అధ్యక్షులు, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి. చంద్రకుమార్ అన్నారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ప్రజల పార్టీ, తెలంగాణ రైతు సంక్షేమ సమితి ఆధ్వర్యంలో రైతు సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆత్మహత్య చేసుకున్న నలుగురు రైతు కుటుంబాలకు రూ.10 వేల చొప్పున చెక్కులను అందచేశారు. సభలో జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ.. జీఓలు 98, 67లను అనుసరించి నిర్వాసిత ప్రతి కుటుంబానికి వారసత్వ ఉద్యోగం ఇవ్వాలని, పునరావాసం కింద రూ.10 లక్షల నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో రైతు ఆత్మహత్యలను నివారించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఇంతవరకు ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు పూర్తిస్థాయి పరిహారం చెల్లించలేదన్నారు. కార్పొరేట్ విద్యను అరికడతామని, విద్య, వైద్యం అందిస్తామని చెప్పిన ప్రభుత్వం మాటలు నీటి మూటలయ్యాయని ఎద్దేవా చేశారు. రైతు పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, వాస్తవంగా సాగు చేస్తున్న రైతులకు సంక్షేమ పథకాలను అందచేయాలన్నారు. భూమిలేని దళిత గిరిజనులకు మూడెకరాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ప్రభాకరాచారి, తెలంగాణ ప్రజల పార్టీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సాంబశివగౌడ్, సదరా బేగం, సుతారి లచ్చన్న, ఎడవెల్లి మోహన్, వేద వికాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఆ పార్టీల బాటలోనే టీఆర్ఎస్
హిమాయత్‌నగర్: టీఆర్ఎస్ పార్టీ హామీలను విస్మరించి గత పార్టీలకు అనుగుణంగా పని చేస్తోందని జస్టిస్ చంద్రకుమార్ విమర్శించారు. ప్రతి ఇంటికీSఓ ఉద్యోగం, డబుల్‌బెడ్ రూమ్ ఇల్లు, ప్రతి ఇంటికి నల్లా, దళితులకు, ఆదివాసీలకు మూడెకరాల భూమిని ఇస్తామని చెప్పిన టీఆర్ఎస్ ‘420’ పార్టీగా పేరుగాంచిందని వ్యాఖ్యానించారు. మంగళవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో న్యాయవాది గొర్రె రమేష్ అధ్యక్షులుగా నూతనంగా ప్రారంభించిన ‘తెలంగాణ లేబర్ పార్టీ’ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ ప్రతి ఇంటికీ నీళ్లు అందిస్తామని చెప్పి డ్రైనేజీ, వర్షపు నీటిని అందించారని వ్యాఖ్యానించారు. ఏళ్ల తరబడి రాష్ట్రాన్ని కొన్ని రాజకీయ పార్టీలు భ్రష్టు పట్టించాయని...వాటికి ప్రత్యామ్నాయంగా ప్రజలు టీఆర్ఎస్ను ఎన్నుకుంటే...అది ప్రజలను మోసగిస్తోందన్నారు. ప్రతి ఇంటికో ఉద్యోగం అంటే యువత ఎంతో ఆనందించారని... అధికారం వచ్చాక వారి ఇంట్లోనే నలుగురూ ఉద్యోగాలు పొంది... ఇంటికో ఉద్యోగం అనే హామీని నెరవేర్చారని ఎద్దేవా చేశారు. అధికారం ఉన్నందునే ఇతర పార్టీల నాయకులు ఆ పార్టీలోకి వెళ్తున్నారని వ్యాఖ్యానించారు. ‘తెలంగాణ లేబర్ పార్టీ’ రాష్ట్ర అధ్యక్షులు గొర్రె రమేష్ మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఈ పార్టీ ఆవిర్భవించిందన్నారు. బలహీన వర్గాలకు అధికారం వచ్చే వరకు పోరాడతామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు నాగుల శ్రీనివాస్ యాదవ్, సంపత్‌కుమార్, మురళీధర్, ముత్తయ్య పాల్గొన్నారు. -
రైతులపై చిన్న చూపు తగదు
పంజగుట్ట: తెలంగాణ ప్రభుత్వం రైతుల పట్ల వివక్ష చూపుతోందని తెలంగాణ రైతు సంక్షేమ సమితి అధ్యక్షులు జస్టిస్ బి.చంద్రకుమార్ అన్నారు. రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం తీరా ఏటా రూ. 25 వేలు చెల్లించేందుకు నిర్ణయించిందని, వారిచ్చే మొత్తం వడ్డీలకు కూడా సరిపోవడం లేదన్నారు. పాత అప్పులు కట్టనందుకు బ్యాంకులు రైతులకు రుణాలివ్వడం లేదన్నారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో కరువు పరిస్థితిపైప్రభుత్వం కేంద్రానికి నివేదిక ఇవ్వడంలోనూ విఫలమైందని ఆరోపించారు. రైతు సంక్షేమ సమితి ఆధ్వర్యంలో రైతులకు ఆర్ధికసాయం చేయడమేగాక, వారిలో ధైర్యం నింపేందుకు కృషి చేస్తున్నామన్నారు. రైతులను ఆదుకోవడానికి దాతలు ముందుకు రావాలని కోరారు. వివరాలకు 8978385151, 7801091111 నెంబర్లో సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో నైనాల గోవర్ధన్, శ్రీనివాస్ యాదవ్, మన్నారం నాగరాజు, రామనర్సయ్య, శ్రీనివాస్, భిక్షపతి పాల్గొన్నారు.