మాట్లాడుతున్న చంద్రకుమార్
పంజగుట్ట: తెలంగాణ ప్రభుత్వం రైతుల పట్ల వివక్ష చూపుతోందని తెలంగాణ రైతు సంక్షేమ సమితి అధ్యక్షులు జస్టిస్ బి.చంద్రకుమార్ అన్నారు. రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం తీరా ఏటా రూ. 25 వేలు చెల్లించేందుకు నిర్ణయించిందని, వారిచ్చే మొత్తం వడ్డీలకు కూడా సరిపోవడం లేదన్నారు. పాత అప్పులు కట్టనందుకు బ్యాంకులు రైతులకు రుణాలివ్వడం లేదన్నారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో కరువు పరిస్థితిపైప్రభుత్వం కేంద్రానికి నివేదిక ఇవ్వడంలోనూ విఫలమైందని ఆరోపించారు.
రైతు సంక్షేమ సమితి ఆధ్వర్యంలో రైతులకు ఆర్ధికసాయం చేయడమేగాక, వారిలో ధైర్యం నింపేందుకు కృషి చేస్తున్నామన్నారు. రైతులను ఆదుకోవడానికి దాతలు ముందుకు రావాలని కోరారు. వివరాలకు 8978385151, 7801091111 నెంబర్‌లో సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో నైనాల గోవర్ధన్, శ్రీనివాస్ యాదవ్, మన్నారం నాగరాజు, రామనర్సయ్య, శ్రీనివాస్, భిక్షపతి పాల్గొన్నారు.