ప్రసంగిస్తున్న జస్టిస్ చంద్రకుమార్
హిమాయత్‌నగర్: టీఆర్‌ఎస్ పార్టీ హామీలను విస్మరించి గత పార్టీలకు అనుగుణంగా పని చేస్తోందని జస్టిస్ చంద్రకుమార్ విమర్శించారు. ప్రతి ఇంటికీSఓ ఉద్యోగం, డబుల్‌బెడ్ రూమ్ ఇల్లు, ప్రతి ఇంటికి నల్లా, దళితులకు, ఆదివాసీలకు మూడెకరాల భూమిని ఇస్తామని చెప్పిన టీఆర్‌ఎస్ ‘420’ పార్టీగా పేరుగాంచిందని వ్యాఖ్యానించారు. మంగళవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో న్యాయవాది గొర్రె రమేష్ అధ్యక్షులుగా నూతనంగా ప్రారంభించిన ‘తెలంగాణ లేబర్ పార్టీ’ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది.
ముఖ్య అతిథిగా పాల్గొన్న జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ ప్రతి ఇంటికీ నీళ్లు అందిస్తామని చెప్పి డ్రైనేజీ, వర్షపు నీటిని అందించారని వ్యాఖ్యానించారు. ఏళ్ల తరబడి రాష్ట్రాన్ని కొన్ని రాజకీయ పార్టీలు భ్రష్టు పట్టించాయని...వాటికి ప్రత్యామ్నాయంగా ప్రజలు టీఆర్‌ఎస్‌ను ఎన్నుకుంటే...అది ప్రజలను మోసగిస్తోందన్నారు. ప్రతి ఇంటికో ఉద్యోగం అంటే యువత ఎంతో ఆనందించారని... అధికారం వచ్చాక వారి ఇంట్లోనే నలుగురూ ఉద్యోగాలు పొంది... ఇంటికో ఉద్యోగం అనే హామీని నెరవేర్చారని ఎద్దేవా చేశారు.
అధికారం ఉన్నందునే ఇతర పార్టీల నాయకులు ఆ పార్టీలోకి వెళ్తున్నారని వ్యాఖ్యానించారు. ‘తెలంగాణ లేబర్ పార్టీ’ రాష్ట్ర అధ్యక్షులు గొర్రె రమేష్ మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఈ పార్టీ ఆవిర్భవించిందన్నారు. బలహీన వర్గాలకు అధికారం వచ్చే వరకు పోరాడతామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు నాగుల శ్రీనివాస్ యాదవ్, సంపత్‌కుమార్, మురళీధర్, ముత్తయ్య పాల్గొన్నారు.