justin beaber
-
వైరల్ వీడియో: ఇరగదీశాడు!
సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన ఒక్క వీడియోతో రణు మొండాల్ అనే మహిళ రాత్రికి రాత్రి సెలబ్రిటీ అయిపోయింది. ఆమెలోని ప్రతిభను ప్రపంచం ముందుంచి కొత్త జీవితాన్ని ప్రారంభించేలా చేయడంలో సోషల్ మీడియా ప్రధాన పాత్ర పోషించిందని చెప్పడం అతిశయోక్తి కాదు. తాజాగా కర్ణాటక రైతు ఒకరు పాడిన పాట ఇప్పుడు యూట్యూబ్‌లో హల్చల్ చేస్తోంది. ప్రఖ్యాత పాప్ సింగర్ జస్టిన్ బీబర్ 2009లో పాడిన ‘బేబి’ పాటను హావభావాలతో అచ్చం అలాగే పాడి అందరినీ ఆకట్టుకున్నాడు ఆ రైతు. ఎంఎస్ ఇసాయ్ పల్లి అనే వ్యక్తి యూట్యూబ్‌లో ఈ వీడియోను డిసెంబర్ 13న షేర్ చేశారు. 3 నిమిషాల 10 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియోకు లక్షకుపైగా వ్యూస్ వచ్చాయి. పొలంలో పని చేసుకుంటున్న రైతు దగ్గరికి వెళ్లి పాట పాడమని కన్నడంలో అడిగినట్టు వీడియోలో ఉంది. అతడి కోరిక మేరకు రైతు.. జస్టిన్ బీబర్ పాటను పాడాడు. రైతు పాడిన పాప్ సాంగ్‌కు వీక్షకులు ఫిదా అవుతున్నారు. బీబర్ పాటను దించేసిన రైతును మెచ్చుకుంటూ కామెంట్లు పెడుతున్నారు. బీబర్ పాటనే ఇంత బాగా ఆలపించాడంటే మిగతా పాటలు కూడా బాగా పాడగలడని అన్నారు. ఇప్పటికీ పదిసార్లుపైగా ఈ వీడియో చూశానని, మళ్లీమళ్లీ చూస్తున్నానని ఒకరు వెల్లడించారు. జస్టిన్ బీబర్ కంటే బాగా పాడాడని, అతడు కొత్త జతిన్ బీబర్ అని మరొకరు మెచ్చుకున్నారు. మన దేశంలో కాకుండా విదేశాల్లో ఉంటే అతడు చాలా పాపులర్ అయ్యేవాడని ఇంకొకరు అభిప్రాయపడ్డారు. ఇదంతా కట్టుకథలా ఉందని కొద్దిమంది అనుమానం వ్యక్తం చేశారు. సౌండ్.. ఆటో ట్యూన్లా ఉందని, ఫేక్ వీడియో అని పేర్కొన్నారు. -
పాపం ప్రేమికుడు
ప్రేమలో ఉన్నవాళ్లు వింతగా కనిపిస్తారు. ఎప్పుడెలా ఉంటారో ఎవ్వరికీ అర్థం కాదు. ప్రేమలో విఫలమైన వాళ్లూ అంతే! ఈ రెండింటికీ మధ్యన ఉండే వాళ్లతోనే అసలు సమస్య అంతా. వాళ్లకు ఏం జరుగుతోందో అర్థం కాదు. ఏం చేస్తున్నారో అంతకుమించి అర్థం కాదు. నవ్వుతారు. ఏడుస్తారు. ఇంకేదేదో చేస్తుంటారు. అచ్చం మన పాప్ సింగర్ జస్టిన్ బీబర్లాగా! జస్టిన్, సెలెనా గోమేజ్లది ఎనిమిదేళ్ల ప్రేమ. అలా అని ఎనిమిదేళ్లుగా కలిసే ఉంటున్నారా అంటే లేదు. కొన్నాళ్లు కలిసి ఉంటారు. కొన్నాళ్లకు విడిపోతారు. మళ్లీ ఎప్పటికో కలిసిపోతారు. ఇలా ఆన్ అండ్ ఆఫ్ ఉంటుంది జస్టిన్ – సెలెనా లవ్‌స్టోరీ. ఈమధ్యే వీళ్లిద్దరూ చెట్టాపట్టాలేసుకొని చక్కగా కనిపించారు. సెలెనా, జస్టిన్ కోసం తన తల్లితో కూడా గొడవ పడి బయటకొచ్చింది. ఇంత జరిగాక ఇంక ఈ లవ్‌స్టోరీ సక్సెస్ఫుల్ అవుతుంది అనుకుంటే, చిన్న ట్విస్ట్ వచ్చింది. ఆ ట్విస్ట్ పేరే బాస్కిన్ చాంపియన్. జస్టిన్ గత కొద్దికాలం క్రితం ప్రేమించిన అమ్మాయే బాస్కిన్. సెలెనా తిరిగొచ్చేశాక బాస్కిన్తో తెగతెంపులు చేసుకున్నాడు జస్టిన్. కాకపోతే ఇప్పుడు జస్టిన్, బాస్కిన్ ఎలా దగ్గరయ్యారో మళ్లీ దగ్గరయ్యారు. ఈ విషయం సెలెనాకు నచ్చలేదు. జస్టిన్ను వదిలేసి పోయింది. దీంతో ఎనిమిదేళ్ల ప్రేమకథ ఇప్పుడు ఇక్కడికొచ్చి ఆగింది. ఇదిక్కడే పూర్తిగా ఆగిపోతుందా? చూడాలి!! ఈ మొత్తం వ్యవహారంలో మాత్రం జస్టిన్ ఎప్పుడెలా ప్రవర్తిస్తున్నాడో అతనికే అర్థం కావట్లేదు పాపం! -
'ఇక నా ఆలోచనలు, ప్రార్థనలు నీకోసమే ఫ్రెండ్'
న్యూయార్క్: హాలీవుడ్ యువ పాప్ సింగర్ జస్టిన్ బీబర్ ఉగ్రవాదుల దాడిలో తన మిత్రుడి మరణంపట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. తన టీంలో అతడితో ఉన్న సంబంధాన్ని గుర్తుచేసుకున్నాడు. అలాంటి స్నేహితుడిని కోల్పోవడం చెప్పలేని లోటు అంటూ ట్వీట్ చేశాడు. ఫ్రాన్స్ లోని బెటక్లాన్ థియేటర్ పై ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు దాడులు జరపగా వందమందికి పైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ దాడిలో చనిపోయినవారిలో బీబర్ స్నేహితుడు థామస్ అయ్యద్ కూడా ఉన్నాడు. 'ఎన్నో ప్రశంసలు అందుకున్నావు. కానీ దూరమయ్యావు. ఈ సందర్భంగా నేనొకటి భావిస్తున్నాను. కొంతమందిని మనం కలిగి ఉన్నప్పుడు వారిపట్ల ప్రశంసా దోరణితో ఉండాలి' అంటూ ట్వీట్ చేశాడు. 'ప్యారిస్ దాడి గురించి ఆలోచిస్తున్నప్పుడల్లా నా మిత్రుడి విషాదం గుర్తుకొస్తుంది. ఎన్నో ఏళ్లుగా నా టీంలో కలిసి ఉన్నాడు. అతడికి ఇప్పటికే ఎన్నో సార్లు ధన్యవాదాలు తెలపాల్సి ఉంది. కానీ, అవకాశం లేకుండా పోయింది. అందుకే మనతో ఉన్నవారికి అప్పుడప్పుడు ధన్యవాదాలు చెప్పాలి. ప్రశంసించాలి. నా ఆలోచనలు, ప్రార్థనలు ఎప్పటికీ నీతోనే ఉంటాయి థామస్' అంటూ బీబర్ ట్వీట్ చేశాడు.