Jute fashion
-
Jute Jewellery: ఆకర్షణీయమైన అలంకరణకు ముచ్చటైన నారహారాలు..!
దేవీ నవరాత్రుల సందర్భంగా అతివలు తమ అలంకరణలో గ్రాండ్‌గా కనిపించే ఆభరణాలను మెడనిండుగా ధరించడాన్ని ఇష్టపడుతుంటారు. కొంత అడవి బిడ్డల ఆత్మీయత.. మరికొంత కోవెల ఆరాధన ఈ రెండింటినీ జత కలిపితే రూపొందిన డిజైన్లే జనపనార హారాలు, చోకర్లు. సంప్రదాయ చీరకట్టుకైనా, వెస్ట్రన్ డ్రెస్‌కైనా ఈ జనపనార ఆభరణం అందంగా ఆకట్టుకుంటుంది. జనపనారతో తయారు చేసిన దుస్తులు, తాళ్లు.. ఇతరత్రా వస్తువుల గురించి మనకు తెలిసిందే. కొంతవరకు జనపనార గొలుసుల మీదా ఆలోచన ఉండే ఉంటుంది. కానీ, సంప్రదాయ బంగారు పతకాన్ని గొలుసుకట్టుగా ఉండే హారానికి జత చేస్తే ఎంత అందంగా ఉంటుందో ఈ డిజైన్లను చూస్తే అర్థమైపోతుంది. రంగురంగులుగా వేసుకునే దుస్తుల మీదకు, ఈ తరహా ఫ్యూజన్ జ్యువెలరీ మరింత ఆకర్షణీయంగా కళ్లకు కడుతుంది. విడిగా నార గొలుసులను తీసుకొని వాటికి బంగారం లేదా వన్‌గ్రామ్ గోల్డ్ లేదా సిల్వర్ లేదా కలపతో తయారుచేసిన పెద్ద పెండెంట్‌ను జత చేస్తే చూడముచ్చటైన హారం అలంకరణకు సిద్ధంగా ఉంటుంది. ఈ హారానికి నప్పే చెవి హ్యాంగింగ్స్‌ను విడిగా తీసుకోవచ్చు. తక్కువ ధరలో కావాలో, వేలల్లో ఖర్చుపెట్టి తయారు చేయించుకోవాలో అది మన ఆసక్తిని బట్టి ఉంటుంది. ఎందుకంటే, వందల రూపాయల నుంచి వేల రూపాయల వరకు వీటి ఖరీదు ఉన్నాయి. విడివిడిగా కావల్సినవి సేకరించుకొని, ఇంట్లోనే ఈ హారాలను తయారు చేసుకోవచ్చు. జనపనార పోగులకు రంగులు అద్ది కూడా వీటికి భిన్నమైన డిజైన్లు తీసుకురావచ్చు. చదవండి: చర్మసౌందర్యానికి మరింత మేలు చేసే విటమిన్ ‘ఎ’ ఆహారం.. -
ఫ్యాషన్ జ్యూట్
బ్యాగులు మాత్రమే కాదు జనపనారతో తయారైన ఆభరణాలూ అలంకరణలో భాగమవడానికి సిద్ధమవుతున్నాయి. ఇవి తేలికగా ఉండటమే కాకుండా మన దేశీయతను చాటుతున్నాయి. ఇవి సాధారణ దుస్తుల మీదకు ధరించినా ఆకర్షణీయతను రెట్టింపు చేస్తాయి. విభిన్న రంగులు, డిజైన్లలో ఆకట్టుకుంటున్న ఇవి తక్కువ ధరలో లభించడమే కాకుండా ఎక్కువ కాలం మన్నుతాయి. పర్యావరణానికి అనుకూలమైనవి. పర్యావరణ ప్రేమికులకు ఈ ఆభరణాలు నేస్తాల్లాంటివి. ఫ్యాషన్‌కి చిరునామా: అందంగా కాదు అధునాతనంగా తయారవడానికి నేటి యువతరం ఆసక్తి చూపిస్తున్నారు. దేశీయ ఉత్పత్తులు ధరించడం వల్ల ఆకర్షణీయంగా కనిపించడంతో పాటు ఆధునికతకు కొత్త భాష్యం చెబుతున్నారు. అందుకే దేశీయ ఆభరణాలకు డిమాండ్ పెరుగుతోంది. జనపనారతో తయారైన ఈ ఆభరణాలే అందుకు నిదర్శనం. కాస్ట్యూమ్ జువెల్రీగా పేరొందిన జ్యూట్ ఆభరణాలు భిన్నమైన రంగులు, మోడల్స్‌లో లభిస్తున్నాయి. పర్యావరణ నేస్తాలు కూడా కావడంతో ఇవి చర్మానికి హాయినిస్తాయి. ఫ్యాషనబుల్‌గా, నాణ్యతగా రూపొందించడానికి తయారీదారులు మరింత శ్రద్ధ పెడుతున్నారు. లోహాలతో తయారైన ఆభరణాల డిమాండ్ ఎక్కువ ఉన్న ఈ కాలంలో దుస్తుల మ్యాచింగ్‌కి అధిక ప్రాధాన్య మిస్తున్నారు. నారతో తయారుచేసిన కేశాలంకరణ బ్యాండ్స్, క్లిప్పులు, గాజులు, హారాలు.. డ్రెస్‌లకు చక్కగా సరిపోలేవి లభిస్తున్నాయి. రూ.50 నుంచి లభించే ఈ ఆభరణాలు దుస్తుల రంగులకు తగినవి వీలైనన్ని ఎంపిక చేసుకోవచ్చు. షాపింగ్ మాల్స్, ఆన్లైన్ మార్కెట్ లోనూ విభిన్నంగా కనువిందుచేస్తున్న జ్యూట్ ఆభరణాల నుంచి వినియోగ దారుల దృష్టి మళ్లడం లేదు. మగువలకే కాదు మగవారికీ నప్పే జ్యూట్ డిజైన్లు ఎన్నో కొలువుదీరాయి.