ఫ్యాషన్ జ్యూట్
బ్యాగులు మాత్రమే కాదు జనపనారతో తయారైన ఆభరణాలూ అలంకరణలో భాగమవడానికి సిద్ధమవుతున్నాయి. ఇవి తేలికగా ఉండటమే కాకుండా మన దేశీయతను చాటుతున్నాయి. ఇవి సాధారణ దుస్తుల మీదకు ధరించినా ఆకర్షణీయతను రెట్టింపు చేస్తాయి. విభిన్న రంగులు, డిజైన్లలో ఆకట్టుకుంటున్న ఇవి తక్కువ ధరలో లభించడమే కాకుండా ఎక్కువ కాలం మన్నుతాయి. పర్యావరణానికి అనుకూలమైనవి. పర్యావరణ ప్రేమికులకు ఈ ఆభరణాలు నేస్తాల్లాంటివి.
ఫ్యాషన్‌కి చిరునామా:
అందంగా కాదు అధునాతనంగా తయారవడానికి నేటి యువతరం ఆసక్తి చూపిస్తున్నారు. దేశీయ ఉత్పత్తులు ధరించడం వల్ల ఆకర్షణీయంగా కనిపించడంతో పాటు ఆధునికతకు కొత్త భాష్యం చెబుతున్నారు. అందుకే దేశీయ ఆభరణాలకు డిమాండ్ పెరుగుతోంది. జనపనారతో తయారైన ఈ ఆభరణాలే అందుకు నిదర్శనం.
కాస్ట్యూమ్ జువెల్రీగా పేరొందిన జ్యూట్ ఆభరణాలు భిన్నమైన రంగులు, మోడల్స్‌లో లభిస్తున్నాయి. పర్యావరణ నేస్తాలు కూడా కావడంతో ఇవి చర్మానికి హాయినిస్తాయి. ఫ్యాషనబుల్‌గా, నాణ్యతగా రూపొందించడానికి తయారీదారులు మరింత శ్రద్ధ పెడుతున్నారు.
లోహాలతో తయారైన ఆభరణాల డిమాండ్ ఎక్కువ ఉన్న ఈ కాలంలో దుస్తుల మ్యాచింగ్‌కి అధిక ప్రాధాన్య మిస్తున్నారు. నారతో తయారుచేసిన కేశాలంకరణ బ్యాండ్స్, క్లిప్పులు, గాజులు, హారాలు.. డ్రెస్‌లకు చక్కగా సరిపోలేవి లభిస్తున్నాయి.
రూ.50 నుంచి లభించే ఈ ఆభరణాలు దుస్తుల రంగులకు తగినవి వీలైనన్ని ఎంపిక చేసుకోవచ్చు.
షాపింగ్ మాల్స్, ఆన్‌లైన్ మార్కెట్ లోనూ విభిన్నంగా కనువిందుచేస్తున్న జ్యూట్ ఆభరణాల నుంచి వినియోగ దారుల దృష్టి మళ్లడం లేదు. మగువలకే కాదు మగవారికీ నప్పే జ్యూట్ డిజైన్లు ఎన్నో కొలువుదీరాయి.