బాల నేరస్తులను సక్రమ మార్గంలో తీసుకెళ్లాలి
విజయనగరం క్రైం: జువైనల్ జడ్జిమెంటు చట్టంపై పోలీసు అధికారులు, సిబ్బంది అవగాహన పెంచుకుని బాల నేరస్తులను సక్రమ మార్గం వైపు మళ్లించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా జడ్జి ఎం.లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. లీగల్ సర్వీసెస్ భవనంలో పోలీసు అధికారులు, సిబ్బందికి శనివారం నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాల నేరస్తుల చట్టంపై 2007లో కొన్ని సవరణలు జరిగాయని, సవరణలపై పోలీసులకు పూర్తి అవగాహన ఉండాలన్నారు.
ముఖ్యంగా బాల నేరస్తులను రెండురకాలుగా వర్గీకరించారన్నారు. చిన్నచిన్ననేరాలు చేసి పట్టుబడి శిక్షఅనుభవించే వారు ఒకరకమైతే, తల్లిదండ్రులు,ఎవరి సహా యం లేకుండా అనాథలుగా ఉన్నవారు కొందరన్నారు. వీరందరినీ సరైన మార్గంలో తీర్చిదిద్దడానికి చట్టాన్ని సమగ్రంగా రూపొందించారన్నారు. రెండవ రకానికి చెందిన పిల్లలను చేరదీసి చిల్డ్రన్ హోమ్‌లలో చేర్పించి వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దాలన్నారు. అటువంటి వారి సమాచారాన్ని అందజేయడానికి 1098ఫోన్ నంబర్ కు, జిల్లా న్యాయ సేవా సంఘానికి తెలియపరచాలన్నారు.
కార్యక్రమంలో ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవాల్ మాట్లాడుతూ పోలీసుశాఖలో కింది స్థాయి అధికారులకు అందరితో సత్సంబంధాలుంటాయని,వారికి చట్టాన్ని చక్కగా అమలు చేసే అవకాశం కల్పించాలని సూచించారు. పిల్లల చెడు ప్రవర్తనకు మూలాలు అన్వేషించి మూలాలను సరిదిద్దడానికి చర్యలు తీసుకోవాలన్నారు. తద్వారా ఆరాచక శక్తులుగా మారడాన్ని, వ్యభిచార కూపాలకు తరలించడాన్ని నిరోధించాలని చెప్పారు. పిల్లలకు సామాజిక భద్రత కల్పిం చడం పోలీసు విధుల్లో ముఖ్యమన్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి వెలమల నరేష్, ఫ్యామిలీకోర్టు జడ్జి బి.శ్రీనివాసరావు, జిల్లా ఎస్సీ,ఎస్టీ కోర్టు జడ్జి కె.వి.రమణరావు పాల్గొన్నారు.