మీరొచ్చినా...మేమువెళ్లం!
–రెగ్యులర్ సిబ్బంది వచ్చినా తమ స్థానాలకు వెళ్లని డిప్యూటేషన్ సిబ్బంది
–వారికి అధికారులు, టీడీపీ నేతల మద్దతు
– ఒకే పోస్టులో ఇద్దరు ప్రకారం జేవీఓలు
కర్నూలు(అగ్రికల్చర్): పశుసంవర్ధక శాఖలో సిబ్బంది కొరత ఒకవైపు తీవ్రంగా వేధిస్తోండగా మరోవైపు ఒకే గ్రామీణ పశువైద్యశాలలో ఒకే హోదా సిబ్బంది ఇద్దరు పనిచేస్తుండటం గమనార్హం. ఆళ్లగడ్డ డివిజన్‌కు చెందిన ఇద్దరు జూనియన్ వెటర్నరీ ఆఫీసర్లను గతంలో డిప్యూటేషన్‌పై కర్నూలు మండలంలోని గ్రామీణ పశువైద్యశాలకు జేవీఓలుగా నియమించారు. ఇటీవల వీటికి రెగ్యులర్ జేవీఓలను నియమించారు. డిప్యూటేషన్‌పై పనిచేస్తున్న వారు తమ రెగ్యులర్ పోస్టులకు వెళ్లాలి. అయితే, వారు ఆ స్థానాలను వదలడం లేదు. పైగా మేము ఇక్కడే పనిచే స్తాం. మీరు మరో చోటుకు వెళ్లండంటూ ఒత్తిడి తెస్తున్నారు. వీరికి ఒకవైపు అధికార తెలుగు దేశం నేతలు, మరోవైపు పశుసంవర్ధకశాఖ అధికారుల మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది. వెల్దుర్తి మండలంలోని రామళ్లకోటలో లైవ్‌స్టాక్ అసిస్టెంటుగా పనిచేస్తున్న రాజశేఖర్‌కు ఇటీవల జేవీఓ గా పదోన్నతి కల్పించి కర్నూలులోని బుధవారపేట పశువైద్యశాలకు బదిలీ చేశారు. గూడూరు మండలం పెంచికలపాడులో లైవ్‌స్టాక్ అసిస్టెంటుగా పనిచేస్తున్న గోవిందుకు జేవీఓగా పదోన్నతి ఇచ్చి కర్నూలు మండలం నిడ్జూరు గ్రామీణ పశువైద్యశాలకు బదిలీ చేశారు. గతంలో ఆళ్లగడ్డ మండలం కిష్టిపాడులో జేవీఓగా పనిచేస్తున్న మహేశ్వరమ్మను బుధవారపేట పశువైద్యశాలకు, ఆళ్లగడ్డ మండలం బత్తులేరులో పనిచేస్తున్న పద్మజను నిడ్జూరు కు రాజకీయ సిపారస్సుల మేరకు డిప్యూటేషన్‌పై నియమించారు. ఆయా ఆసుపత్రులకు పదోన్నతిపై రెగ్యులర్ జేవీఓలను నియమించడంతో డిప్యూటేషన్లపై పనిచేసే వారు తమ స్థానాలకు వెళ్లాలి.అయితే, వారెవరూ వెళ్లడం లేదు. మీరు వేరే పశువైద్యశాలలకు వెళ్లిపోవాలని రెగ్యులర్ జేవీఓలు గోవిందు, రాజశేఖర్లపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. అధికారులు సైతం డిప్యూటేషన్‌పై పనిచేస్తున్న వారికే వత్తాసు పలుకుతున్నట్లు స్పష్టమవుతోంది. అందుకే ఈ నెల 16 నుంచి ఒక్కో పశువైద్యశాలలో ఇద్దరు పనిచేస్తున్నా పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.