నా కూతురు పేరు జ్యోతిసింగ్
ఢిల్లీ గ్యాంగ్రేప్ ‘నిర్భయ’ తల్లి వెల్లడి
న్యూఢిల్లీ: దేశప్రజల మదిలో ‘నిర్భయ’గా నిలిచిపోయిన తన కూతురు పేరు జ్యోతిసింగ్ అని మూడేళ్లక్రితం ఢిల్లీలో గ్యాంగ్రేప్కు గురై ప్రాణాలుకోల్పోయిన యువతి తల్లి వెల్లడించింది. ఢిల్లీలో ‘నిర్భయ’ ఘటన జరిగి మూడేళ్లు గడిచిన సందర్భంగా బుధవారం ఢిల్లీలో మహిళా, పౌరసంఘాలు జంతర్మంత్ వద్ద నిర్వహించిన ‘నిర్భయ చేతన దివస్’ నివాళి కార్యక్రమంలో యువతి తల్లి ఆశాదేవి మాట్లాడారు. ‘నా కూతురు పేరు జ్యోతిసింగ్. నా కూతురు పేరు చెప్పడానికి నేనేం సిగ్గుపడట్లేదు. రేప్లాంటి అమానుషమైన నేరాలకు పాల్పడే వారిని బహిరంగంగా ఉరితీయాలి.’ అన్నారు.
మహిళాసమస్యలపై పార్టీలకతీతంగా ఎంపీలు ఏకం: మహిళాసమస్యలపై యువతలో అవగాహన కల్పించేందుకు పార్టీలకతీతంగా 20 మంది ఎంపీలు ఏకమయ్యారు. లోక్సభ, రాజ్యసభలకు చెందిన ఎంపీలు సుప్రియా సూలె(ఎన్సీపీ), గౌరవ్ గొగోయ్(కాంగ్రెస్), ప్రీతమ్ ముండే, శతాబ్ది రాయ్(టీఎంసీ)సహా 20 మంది ఎంపీలు ఒక్కతాటిపైకి వచ్చి లింగ సమానత, మహిళావిద్య, మహిళాసాధికారత వంటి అంశాలపై తమ తమ నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించారు. కాగా, డబ్బు లేని కారణంగా నిర్బంధంలో ఉన్న వారికి బెయిల్ మంజూరులో జాప్యం జరగడంపై పార్లమెంటరీ కమిటీ సభ్యుల బృందం ఆందోళన వ్యక్తం చేసింది. ఎన్నికైన ప్రజా ప్రతినిధులు జోక్యం చేసుకొని కేసు వాదనకు మంచి లాయర్లను వినియోగించాలని సూచించింది.