సోలార్ పవర్ ప్లాంట్లతో పర్యావరణానికి మేలు
మొయినాబాద్, న్యూస్‌లైన్: వనరులు తరిగిపోతున్న నేపథ్యంలో సోలార్ పవర్ ప్లాంట్ల ఆవశ్యకత ఎంతో ఉందని ఏఐసీటీఈ సౌత్ సెంట్రల్ రీజియన్ చైర్మన్, జేఎన్టీయూ మాజీ వైస్‌చాన్సలర్ డాక్టర్ కె.రాజగోపాల్ అన్నారు. మండల పరిధిలోని హిమాయత్‌నగర్ రెవెన్యూలో ఉన్న అభినవ్ హైటెక్ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన 25 కేడబ్ల్యూ సోలార్ పవర్ ప్లాంట్‌ను సోమవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇంధన వనరులు ఉపయోగించి విద్యుత్ తయారు చేయడం వల్ల పర్యావరణం కలుషితమవుతుందని అన్నారు.
పర్యావరణాన్ని కాపాడేందుకు సోలార్ పవర్ప్లాంట్లు ఏర్పాటు అవసరమన్నారు. సూర్యరష్మిని ఉపయోగించి సోలార్ విద్యుత్ తయారు చేసుకోవడం ద్వారా వనరులను సైతం కాపాడినవారమవుతామన్నారు. విద్యార్థులు కొత్త ప్రాజెక్టుల రూపకల్పనకు శ్రీకారం చుట్టాలని సూచించారు. కార్యక్రమంలో ఐఎస్టీఈ ప్రెసిడెంట్ వి.రామారావు, కళాశాల కార్యదర్శి రాంరెడ్డి, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ కేవీఎస్ శర్మ, డెరైక్టర్ దర్గయ్య, ప్రిన్సిపాల్ చంద్రశేఖర్, హెచ్ఓడీ తహేర్హుస్సేన్, ఏఓ అనిల్‌కుమార్, ప్లేస్మెంట్ ఆఫీసర్ శ్రీనివాస్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.