K. Swamy Goud
-
సంగారెడ్డిలో జగ్జీవన్ రామ్ భవన్
♦ నావాటాగా రూ.15 లక్షలు ♦ శాసనమండలి చైర్మన్ కె.స్వామిగౌడ్ ♦ ఘనంగా జగ్జీవన్‌రామ్ జయంతి వేడుకలు సంగారెడ్డి జోన్: జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో బాబూ జగ్జీవన్‌రామ్ భవన్ నిర్మాణానికి తనవంతుగా రూ.15 లక్షలు కేటాయిస్తున్నట్టు శాసన మండలి చైర్మన్ కె.స్వామిగౌడ్ ప్రకటించారు. అధికారులు వెంటనే స్థలాన్ని ఎంపిక చేయాలని సూచించారు. మంగళవారం సంగారెడ్డిలో బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి వేడుకలను నిర్వహించారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన ఈ సభకు మండలి చైర్మన్ స్వామిగౌడ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. జగ్జీవన్‌రామ్ విగ్రహానికి పూ లమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... బడీడు పిల్లలు బడిలో ఉండేలా చూడాలన్నారు. ప్రభుత్వం భూ పంపిణీ పథకాన్ని నిరంతర ప్రక్రియగా అమలు చేస్తోందన్నారు. ప్రభుత్వం అందించే ఉచిత శిక్షణను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలు పొందాలన్నారు. సంక్షేమ ఫలాలు అందరికి అందాలి. సంక్షేమ ఫలాలు ప్రతిఒక్కరికి అందాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. రాజ్యంగం కల్పించే హక్కులను సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడానికి చదువే ఆయుధమన్నారు. దేశం గర్వించదగ్గ నేత... జగ్జీవన్‌రామ్ దేశం గర్వించదగ మహానీయుడని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ కొనియాడారు. కరువు పరిస్థితుల్లో వ్యవసాయ శాఖ మంత్రిగా పని చేసి రైతులకు అండగా నిలిచారన్నారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ వివిధ సంఘాల కృషి ఫలితంగా సాధించుకున్న తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకునే బాధ్యత అందరిపై ఉందన్నారు. ఇన్చార్జి జేసీ, జెడ్పీ సీఈఓ వర్షిణి మాట్లాడుతూ.. రాజ్యాంగం కల్పించిన హక్కులతో అభివృద్ధి సాధించాలన్నారు. ఏజేసీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాలు, అంధులు, వృద్ధులకు సేవ చేయడం వల్ల ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తింపు వస్తుందన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి మాట్లాడుతూ జగ్జీవన్‌రామ్ ఆశయాలను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకొని సామాజిక అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ప్రభుత్వ వసతి గృహాల్లో ఉండి ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలతోపాటు రూ.5 వేల చొప్పున నగదు పారితోషికాన్ని మండలి చైర్మన్ అందించారు. స్వయం ఉపాధి కింద మంజూరైన రుణాలను ఇద్దరికి అందజేశారు. కార్యక్రమంలో వివిధ ప్రజాసంఘాలు, బడుగుబలహీన సంఘాల నాయకులు విజయ్‌కుమార్, విజయ్‌రావు, అడివయ్య, ప్రకాశ్, రాజు, అనంతయ్య, దర్శన్, నాగయ్య, రాంచంద్రనాయక్ తదితరులు ప్రసంగించారు. మహానేతకు నివాళి.. జగ్జీవన్‌రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రజాప్రతినిధులు, అధికారులు, అనధికారులు నివాళులర్పించారు. మండలి చైర్మన్‌తోపాటు ఎంపీలు బీబీ పాటిల్, కొత్త ప్రభాక ర్‌రెడ్డి, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, ఇన్చార్జి జేసీ, జెడ్పీ సీఈఓ వర్షిణి, ఏజేసీ వెంకటేశ్వర్లు, డీఆర్ఓ దయానంద్, సాంఘీక సంక్షేమ శాఖ ఉపసంచాకులు శ్రీనివాసరెడ్డి, చరణ్‌దాస్, ఐకేపీ పీడీ సత్యనారాయణరెడ్డి, ఆర్డీఓ మధుకర్‌రెడ్డి, ము న్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, దళిత సంఘా ల నాయకులు, వివిధ రాజకీయ నాయకులు ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. అంతకుముందు ఐబీ నుంచి కొత్తబస్టాండ్ వరకు ర్యాలీ కొనసాగింది. -
టీఆర్ఎస్ నాయకుడిపై ఎమ్మెల్యే దాడి
కాటేదాన్: సాక్షాత్తూ తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ కె.స్వామిగౌడ్ ఎదుటే టీఆర్ఎస్ గ్రేటర్ ఉపాధ్యక్షుడు తోకల శ్రీశైలం రెడ్డిపై టీడీపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన పలువురిని విస్మయానికి గురి చేసింది. వివరాల్లోకి వెళితే... మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ పరిధిలో స్వామి గౌడ్ సమక్షంలో బుధవారం స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లో పర్యటించి సమస్యలు తెలుసుకున్న నాయకులు మొగల్స్ కాలనీలోకి చేరుకున్నారు. అక్కడ ఏళ్ల తరబడి దాసరి కులస్థులకు సంబంధించిన శ్మశాన వాటిక సమస్యను స్వామి గౌడ్‌కు ప్రజలు విన్నవించారు. అప్పటికే టీడీపీ నాయకులు గ్రేటర్ ఉపాధ్యక్షుడు శ్రీశైలంరెడ్డిపై దాడికి వ్యూహం రచించారు.‘ఏ అర్హతతో నీవు ప్రజల నుంచి విన్నపాలు స్వీకరిస్తున్నా’వని ఆగ్రహం వ్యక్తం చేస్తూ శ్రీశైలం రెడ్డిని ఎమ్మెల్యే నె ట్టివేశారు. విషయాన్ని వెంటనే కార్యకర్తలు టీఆర్ఎస్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. అధిష్టానం ఆదేశాల మేరకు దాడికి పాల్పడిన ప్రకాశ్ గౌడ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏసీపీ గంగారెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా శ్రీశైలంరెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యలు తెలుసుకుంటున్న తమపై ఓ ఎమ్మెల్యే భౌతిక దాడులకు పాల్పడడం సిగ్గుచేటన్నారు. ప్రజలు స్వచ్ఛ హైదరాబాద్‌కు సంపూర్ణ మద్దతు తెలుపుతుంటే స్థానిక టీడీపీ నాయకులు ఉనికి కోల్పోతామనే భయంతో దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా... శ్రీశైలంరెడ్డి తమను దుర్భాషలాడారంటూ టీడీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
మనోడే ‘పెద్ద’
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ‘పెద్దల సభ’లో జిల్లాకు అరుదైన గౌరవం దక్కింది. శాసనమండలి చైర్మన్‌గా జిల్లావాసి కె.స్వామిగౌడ్‌కు అవకాశం లభించింది. కరీంనగర్ ఎమ్మెల్సీ స్థానం నుంచి మండలికి ఎంపికైన స్వామిగౌడ్ స్వగ్రామం రాజేంద్రనగర్ మండలంలోని కిస్మత్పూర్. పంచాయతీ సేవక్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన ఆయన.. ఉద్యోగసంఘం నేతగా ఎదిగారు. టీఎన్జీఓ సారథ్య బాధ్యతలు చేపట్టి తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించారు. వివిధ ఉద్యోగ సంఘాలను ఏకతాటిమీదకు తేవడం ద్వారా ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో ప్రధానపాత్ర వహించారు. స్వామిగౌడ్ ఉద్యమస్ఫూర్తి, పోరాట పటిమను గుర్తించిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఆయనకు పదవీవిరమణ అనంతరం ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. ఒకప్పుడు చిరుద్యోగిగా ప్రస్తానాన్ని ప్రారంభించిన స్వామిగౌడ్.. ఇప్పుడు ‘పెద్దల సభ’కు పెద్దమనిషిగా వ్యవహరించనున్నారు. బుధవారం కౌన్సిల్ చైర్మన్‌కు జరిగిన ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. తెలంగాణ ప్రభుత్వంలో తొలి శాసనమండలి అధ్యక్షుడిగా గెలుపొందిన గౌడ్సాబ్.. ఇక నుంచి జిల్లా రాజకీయాల్లోనూ తనదైన ముద్రవేయనున్నారు. మంత్రివర్గంలో స్వామిగౌడ్‌కు అవకాశం కల్పిస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చిన ప్పటికీ, సామాజిక సమీకరణలు, సమతుల్యత నేపథ్యంలో ఆయనకు ఛాన్స్ రాలేదు. ఈ క్రమంలోనే స్వామిగౌడ్‌కు కీలక పదవి కట్టబెట్టాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు టీఆర్ఎస్కు సంఖ్యాబలం లేనప్పటికీ, ఇతర పార్టీల సభ్యులను ఆకర్షించడంతో కౌన్సిల్ చైర్మన్ పదవి దక్కించుకునేందుకు మార్గం సుగమం చేశారు. ముగ్గురి ఓట్లు టీఆర్ఎస్కే! శాసనమండలి ఎన్నిక ల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. సొంత పార్టీలు జారీ చేసిన విప్‌లను ధిక్కరించి ఇద్దరు ఎమ్మెల్సీలు టీఆర్ఎస్కు అండగా నిలిచారు. తెలుగుదేశం తరుఫున కౌన్సిల్‌కు ఎన్నికైన పట్నం నరేందర్‌రెడ్డి సాధారణ ఎన్నికలకు ముందు కారెక్కారు. సాంకేతికంగా టీడీపీ సభ్యుడిగా ఉన్న నరేందర్.. ఆ పార్టీ జారీచేసిన విప్‌ను ఉల్లంఘించి స్వామిగౌడ్‌కు ఓటేశారు. అలాగే కాంగ్రెస్ ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్న యాదవరెడ్డి వ్యూహాత్మకంగా టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు పలికారు. వీరేకాకుండా ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జనార్దన్ రెడ్డి ఇటీవల గులాబీ గూటికి చేరారు. ఆయన కూడా టీఆర్ఎస్కు అనుకూలంగా నడుచుకున్నారు. ఎమ్మెల్సీ నాగేశ్వర్ కూడా స్వామిగౌడ్‌కు మద్దతు పలికారు.