టీఆర్‌ఎస్ నాయకుడిపై ఎమ్మెల్యే దాడి
కాటేదాన్: సాక్షాత్తూ తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ కె.స్వామిగౌడ్ ఎదుటే టీఆర్‌ఎస్ గ్రేటర్ ఉపాధ్యక్షుడు తోకల శ్రీశైలం రెడ్డిపై టీడీపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన పలువురిని విస్మయానికి గురి చేసింది. వివరాల్లోకి వెళితే... మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ పరిధిలో స్వామి గౌడ్ సమక్షంలో బుధవారం స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లో పర్యటించి సమస్యలు తెలుసుకున్న నాయకులు మొగల్స్ కాలనీలోకి చేరుకున్నారు. అక్కడ ఏళ్ల తరబడి దాసరి కులస్థులకు సంబంధించిన శ్మశాన వాటిక సమస్యను స్వామి గౌడ్‌కు ప్రజలు విన్నవించారు.
అప్పటికే టీడీపీ నాయకులు గ్రేటర్ ఉపాధ్యక్షుడు శ్రీశైలంరెడ్డిపై దాడికి వ్యూహం రచించారు.‘ఏ అర్హతతో నీవు ప్రజల నుంచి విన్నపాలు స్వీకరిస్తున్నా’వని ఆగ్రహం వ్యక్తం చేస్తూ శ్రీశైలం రెడ్డిని ఎమ్మెల్యే నె ట్టివేశారు. విషయాన్ని వెంటనే కార్యకర్తలు టీఆర్‌ఎస్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. అధిష్టానం ఆదేశాల మేరకు దాడికి పాల్పడిన ప్రకాశ్ గౌడ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏసీపీ గంగారెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా శ్రీశైలంరెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యలు తెలుసుకుంటున్న తమపై ఓ ఎమ్మెల్యే భౌతిక దాడులకు పాల్పడడం సిగ్గుచేటన్నారు. ప్రజలు స్వచ్ఛ హైదరాబాద్‌కు సంపూర్ణ మద్దతు తెలుపుతుంటే స్థానిక టీడీపీ నాయకులు ఉనికి కోల్పోతామనే భయంతో దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా... శ్రీశైలంరెడ్డి తమను దుర్భాషలాడారంటూ టీడీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.