ఇద్దరు విపక్ష నేతలకు ఉరి
బంగ్లా అంతటా హై అలర్ట్
ఢాకా: బంగ్లాదేశ్లో ఇద్దరు విపక్ష పార్టీ కీలక నేతలకు ఉరి శిక్ష అమలు చేశారు. 1971లో బంగ్లాదేశ్ విముక్తి సందర్భంగా పాక్తో యుద్ధంలో దేశానికి వ్యతిరేకంగా వ్యవహరించినందుకు ఉరితీశారు. ఢాకా సెంట్రల్ జైలులో అర్ధరాత్రి 12.55 గంటలకు జమాతే ఇస్లామీ కార్యదర్శి అలీ అషన్ మహమ్మద్ ముజాహిద్ (67), విపక్ష బీఎన్పీ నాయకుడు సలాఉద్దీన్ ఖాదర్ చౌదురి (66)అను ఉరితీశారు. శనివారం సాయంత్రం వరకు తర్జనభర్జనలు జరిగినప్పటికీ రాష్ట్రపతి వీరి క్షమాభిక్షను తిరస్కరించటంతో శిక్ష అమలైంది. 1971 బంగ్లా విముక్తి యుద్ధం సందర్భంగా పెద్ద సంఖ్యలో మేధావుల ఊచకోత ఘటనకు ముజాహిద్ సూత్రధారి. మాజీ మంత్రి, ఆరుసార్లు ఎంపీగా గెలుపొందిన చౌధురి.. విపక్ష బీఎన్పీలో కీలక నేత.
ఈయన తండ్రి ఫైజుల్ ఖాదర్ చౌధురి పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ స్పీకర్గా.. బంగ్లాదేశ్ ఏర్పాటయ్యేంతవరకు ఈ ప్రాంతానికి అధ్యక్షుడిగా ఉన్నారు. చిట్టాగాంగ్ జిల్లాలో హిందువులను చంపించటంతోపాటు బంగ్లావిముక్తి యుద్ధంలో పాక్ సైన్యంతో చేతులు కలిపినట్లు ఆరోపణలున్నాయి. తాజా ఉరి ఘటనతో ఈ ఇద్దరి మద్దతుదారులు ఆందోళనకు పిలుపునిచ్చారు. దీంతో బంగ్లాదేశ్లో హై అలర్ట్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా పటిష్టమైన బందోబస్తును ఏర్పాటుచేశారు. చిట్టాగాంగ్లో గుర్తుతెలియని వ్యక్తులు ఓ టీవీచానల్ వాహనంపై కాల్పులు జరిపి.. సిబ్బందిని గాయపరిచినట్లు తెలిసింది.