పరిశ్రమలన్నింటినీ పరిరక్షిస్తాం: నాయిని
సిర్పూర్ కాగజ్‌నగర్ పేపర్ మిల్లును తెరిపిస్తాం: నాయిని
సికింద్రాబాద్: తెలంగాణలోని పరిశ్రమలన్నింటినీ పరిరక్షించే బాధ్యత తమ ప్రభుత్వంపైనే ఉందని, ఇటీవల మూతపడ్డ సిర్పూర్ కాగజ్‌నగర్ పేపర్ మిల్లును తెరిపించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి చెప్పారు. ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్‌నగర్ పేపర్‌మిల్లు మూసివేయడంతో సుమారు వెయ్యి మంది కార్మికులు శనివారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి నిరసన ప్రదర్శన చేస్తూ దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ కార్యాలయానికి చేరుకుని ఆందోళనకు దిగారు. కార్మికులతో మాట్లాడేందుకు వచ్చిన నాయిని కాన్వాయ్‌ని అడ్డుకుని ఆందోళకు దిగారు. వారిని శాంతింపజేసిన మంత్రి అరగంట పాటు వారితో చర్చలు జరిపారు.
ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ.. మిల్లు నష్టాలబాటలో ఉన్నందునే ప్రభుత్వం రూ. 6 కోట్లు కేటాయించిందని, ఇప్పటికే రూ. 3 కోట్లు విడుదల కాగా.. మరో రూ. 3 కోట్లు ఐడీబీఐ బ్యాంకుకు చేరాయన్నారు. కంపెనీ ఎండీ గుండెపోటుతో ఆస్పత్రిలో ఉన్నందున కార్మికుల సమస్యలకు ఇప్పటికిప్పుడు పరిష్కారం చూపలేమన్నారు. సోమవారం పరిశ్రమల మంత్రి కేటీఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మతో సమావేశమై కనీసం రెండు నెలల వేతనాన్ని ఇప్పించే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ప్రభుత్వానివి కంటితుడుపు హామీలని, సమస్యను పరి ష్కరించేలా లేవని కార్మికులు మళ్లీ నిరసనకు దిగారు. అసహనానికి గురైన నాయిని కార్మికులు శాంతియుత చర్చలకు వస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయని, ఆందోళనల ద్వారా కావని చెప్పారు. దీంతో ఆగ్రహించిన కార్మికులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం ప్రారంభించారు. పరిస్థితి చేయి దాటుతోందని గ్రహించిన పోలీసులు.. మంత్రిని అక్కడి నుంచి పంపేశారు.