ఆమెకు ఏదైనా జరిగితే నాదే బాధ్యత!
తనకు పిల్లల భవిష్యత్ ముఖ్యమని కైకలూరు ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ స్పష్టం చేశారు. తన భార్య సునీత తనపై చేసిన ఆరోపణలు అవాస్తమని చెప్పారు. మానవత్వంతో ఆమె పొరపాట్లను సహిస్తున్నానని అన్నారు. తన నుంచి ప్రాణహాని ఉందని సునీత చేసిన ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. ఆమె ప్రాణాలకు ఆయన హామీయిచ్చారు. ఆమె ఏదీ జరిగినా తనదే పూచీ అన్నారు. ఆమెకు ఏదైనా జరిగితే కర్త, కర్మ, క్రియ తనదే అన్నారు. తనను కాపాడు కోవాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. కోటి రూపాయిలు ఇవ్వాలని సునీత బెదిరిస్తోందని వెల్లడించారు. డబ్బు కోసమే ఆమె ఇదంతా చేస్తోందని ఆరోపించారు. పిల్లల భవిష్యత్ కోసమే బతుకుతున్నానని చెప్పారు. పిల్లలను బాగు చేయాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు.
ఆమెకు తన ఆస్తే కావాలని వెంకటరమణ ఆరోపించారు. ఈ ఆస్తి కోసమే ఇంత చేశారన్నారు. ఆమె బ్లాక్ మెయిల్ చేయడం ప్రపంచమంతా చూస్తోందని అన్నారు. ఆమె సుఖంగా ఉంటుందంటే తన ఆస్తిని ఇచ్చేసేందుకు సిద్ధమన్నారు. తన భార్యతో కలిసివుందామని ఇప్పటికీ అనుకుంటున్నానని తెలిపారు. యముడునయితే పరిస్థితి వేరేగా ఉండేదన్నారు. హైకోర్టు ఆదేశించినా పిల్లలను పాఠశాలకు పంపకపోవడం కోర్టు ధిక్కారం అవుతుందన్నారు. పిల్లల భవిష్యత్ కాపాడుకోవాల్సిన సునీతపై ఉందన్నారు. పదే పదే కేసులు పెడితే వారి భవిష్యత్ ఏమవుతుందో ఆలోచించుకోవాలన్నారు. తనను చంపేసి సునీత జైలుకు వెళ్లినా, ఆమెను చంపేసి తాను జైలుకు వెళ్లినా పిల్లల భవిష్యత్ ఏంటని ప్రశ్నించారు.
అయితే వెంకట రమణ తనను పనిమనిషిగా కన్నా హీనంగా చూశారని సునీత ఆరోపించారు. ఈ రోజుకి కూడా తనకు మనిషిగా గుర్తించడం లేదన్నారు. రాజకీయంగా ఎదగడానికి తమను ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. తనను శారీరకంగా, మానసికంగా గాయపరిచారని వాపోయారు. అధికారం ఉందన్న గర్వంతో విర్రవీగుతున్నారని, ఆడవాళ్లంటే ఆయన చిన్నచూపు అని ధ్వజమెత్తారు. తన కుటుంబాన్ని నాశనం చేస్తానని బెదిరించారని చెప్పారు. 15 ఏళ్ల నుంచి నరకం అనుభవిస్తున్నానని చెప్పారు. ఈ నరకం ఇక చాలన్నారు. పిల్లలు పేరు చెప్పి తన భర్త తప్పించుకోవాలని చూస్తున్నారని అన్నారు. పిల్లలపై ప్రేమ ఉంటే తనను ఆరు నెలలు పుట్టింట్లో ఎందుకు వదిలేశారని ప్రశ్నించారు. పిల్లలకు జ్వరమొచ్చినా ఎందుకు పట్టించుకోలేదని నిలదీశారు. ఆయనపై తనకు నమ్మకం లేదన్నారు.
పిల్లల కోసమే బతుకుతున్నట్టు వెంకట రమణ కల్లబొల్లి మాటలు చెబుతున్నారని సునీత ఆరోపించారు. తన పిల్లలు ఆయన దగ్గర వుంటే తనకు దక్కరని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. తాను బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టు దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఎన్నో ఆస్తులు సంపాదించారని, వాటిని తన ముందు దాచి పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. పిల్లల భవిష్యత్ ఆలోచించే ఇన్నాళ్లు తన భర్తతోకాపురం చేశానని సునీత చెప్పారు. ఆయన మాటలకు, చేతలకు పొంతన ఉందని చెప్పారు. ఆయనతో కలిసివుండడం కుదరదని సునీత స్పష్టం చేశారు. పిల్లల భవిష్యత్ తనకు ముఖ్యమని వెంకట రమణ పునరుద్ఘాటించారు.