గోదావరిలో మునిగి ఏడూళ్ల బయ్యారం వాసి మృతి
♦ తూర్పుగోదావరి జిల్లాలో
♦ పుష్కరస్నానం చేస్తుండగా ప్రమాదం
పినపాక : ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలోని తూర్పుగోదావరి జిల్లా నెల్లిపాక మండలం గొల్లగూడెం గ్రామం వద్ద అనధికారిక పుష్కరఘాట్ వద్ద జరిగిన ప్రమాదంలో ఖమ్మం జిల్లా పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం గ్రామానికి చెందిన కాకర్ల రమేష్(25) మృతిచెందాడు. ఖమ్మం జిల్లా పినపాక మండలం ఏడూళ్లబయ్యారం గ్రామానికి చెందిన కాకర్ల రమేష్‌కు ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా నెల్లిపాక మండలం సీతాపురం గ్రామానికి చెందిన జ్యోతితో వివాహమైంది. తాపీమేస్త్రీగా పని చేస్తూ జీవిస్తున్న రమేష్ మహాపుష్కరాల సందర్భంగా పుష్కర స్నానం చేసేందుకు భార్య జ్యోతితో కలిసి అత్తగారింటికి వెళ్లాడు.
ఆ గ్రామంలో యువకులతో కలిసి కుటుంబ సమేతంగా గొల్లగూడెంలోగల అనధికారిక పుష్కరఘాట్ వద్దకు వెళ్లి పుష్కర స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తూ అతడు గోదావరిలో మునిగి పోయాడు. గమనించిన స్థా నికులు మునిగిపోయే వ్యక్తిని కాపాడే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకుండా పోయింది. గజఈతగాళ్లు సుమారు 2 గంటలపాటు గాలించిన అనంతరం మృతదేహం లభ్యమైంది. మృతుడికి భార్య జ్యోతి, 2 నెలల బాబు, మూడేళ్ల కుమారుడు కొడుకు ఉన్నారు. కుమారుడి మృతితో మృతుడి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.