Kakatiya University Police
-
వరుస సస్పెన్షన్లు.. తర్వాత ఎవరు?!
సాక్షి ప్రతినిధి, వరంగల్ : వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో చోటు చేసుకుంటున్న వరుస ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఆరు నెలల కాలంలో శాఖలోని పలువురు అధికారులు, సిబ్బందిపై తీసుకున్న చర్చలు చర్చనీయాంశంగా మారాయి. పోలీసు కమిషనర్‌గా పి.ప్రమోద్‌కుమార్ బాధ్యతలు స్వీకరించాక శాఖ ప్రక్షాళనపై దృష్టి సారించారు. భూసెటిల్మెంట్లు, దందాల్లో జోక్యం చేసుకుంటున్న కొందరు అధికారులపై ఆయన అంతర్గత విచారణకు ఆదేశించారు. సమగ్ర విచారణ అనంతరం అనివార్యమని తేలిన పలువురిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈక్రమంలోనే పలువురు సీఐలు, ఎస్ఐలపై సస్పెన్షన్, బదిలీల వేటు వేస్తుండగా, ఓ డీసీపీ, ఏసీపీల బదిలీ జరిగింది. అయితే, ఆ తర్వాత వరుసలో ఎవరనే చర్చ పోలీసువర్గాల్లో సాగుతోంది. కేయూసీ ఇన్స్పెక్టర్పై వేటు ఆరోపణలు, ఫిర్యాదులు ఉన్న అధికారులపై వరుస చర్యలు పోలీసుశాఖలో హాట్‌టాపిక్‌గా మారగా, సోమవారం మరొకరిని హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్డ్ చేయడం గమనార్హం. కాకతీయ యూనివర్సిటీ పోలీసుస్టేషన్ ఎస్హెచ్ఓ డేవిడ్ రాజును ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ సీపీ ప్రమోద్‌కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో సైబర్ క్రైం విభాగం ఇన్స్పెక్టర్ జనార్దన్‌రెడ్డిని ఇన్చార్జిగా నియమించారు. ఇదిలా ఉండగా ఇప్పటికే ముగ్గురు ఎస్హెచ్ఓలు, నలుగురు సబ్ ఇన్స్పెక్టర్లు, ఆరుగురు కానిస్టేబుల్, హెడ్‌కానిస్టేబుళ్ల సస్పెన్షన్ వేటు పడింది. అలాగే, ముగ్గురిని క్రమశిక్షణ చర్యల కింద బదిలీ చేశారు. హన్మకొండ ఏసీపీ కార్యాలయంలో పరిధిలో హన్మకొండ, సుబేదారి, కాజీపేట ఏసీపీ కార్యాలయం పరిధిలో కమలాపూర్ ఎస్హెచ్ఓ సస్పెండైన వారిలో ఉండగా, వరంగల్, కాజీపేట కార్యాలయాల పరిధిలో మామూనూరు, ధర్మసాగర్ ఎస్హెచ్ఓలను వీఆర్‌కు అటాచ్డ్ అయ్యారు. తాజాగా హన్మకొండ ఏసీపీ కార్యాలయంలో పరిధిలోని కేయూ పోలీసుస్టేషన్ ఎస్హెచ్ఓ డేవిడ్ రాజును హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేశారు.(చదవండి: సొంత శాఖలో అక్రమార్కులపై పోలీసు కథాస్త్రం!) కేయూసీలో ఘటనపై ఆరా కాకతీయ యూనివర్సిటీలో ఆదివారం చోటుచేసుకున్న గొడవ అటు ప్రజాప్రతినిధులు, ఇటు పోలీసు ఉన్నతాధికారుల్లో చర్చకు దారి తీసినట్లు సమాచారం. సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన మంత్రి దయాకర్‌రావు, ప్రభుత్వ చీఫ్ వినయ్‌భాస్కర్ కాన్వాయిని ఏబీవీపీ సభ్యులు అడ్డుకోవడం.. ఆ తర్వాత ఉద్రిక్తతకు దారితీసిన పరిణామాలను సీరియస్‌గా తీసుకున్నట్లు చెబున్నారు. ఈ సందర్భంగా పరిస్థితిని ముందుగా అంచనా వేయడంలో నిఘావర్గాలు కూడా వైఫల్యం చెందాయనే చర్చ సాగుతోంది. ఇదే విషయమై ప్రజాప్రతినిధులు, పోలీసు ఉన్నతాధికారులు సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. కేయూ ఘటనపై హైదరాబాద్ నుంచి సైతం కీలక నేతలు, పోలీసు ఉన్నతాధికారులు ఆరా తీయగా, ఇది చినికిచినికి గాలివానగా మారిందని తెలుస్తోంది. -
ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి
భీమారం, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకుని వరంగల్ రేంజ్ పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఐజీ కాంతారావు తెలిపారు. కాకతీయ యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలింగ్‌ను దృష్టిలో ఉంచుకుని రేంజ్ పరిధిలోని వరంగల్ అర్బన్, రూరల్‌తోపాటు ఖమ్మం జిల్లాలో 24,315 వేల మంది పోలీసు సిబ్బందిని నియమించినట్లు చెప్పారు. వరంగల్(అర్బన్)లో 3,648, వరంగల్(రూరల్)లో 6,580, ఖమ్మం జిల్లాలో 8,174 మంది పోలీస్ సిబ్బందితో పాటు 2,412 మంది హోంగార్డులు, 2,510 మంది ఇతర శాఖల సిబ్బంది, 991 మంది డీఎస్పీ, సీఐ స్థాయి అధికారులను నియమించామన్నారు. వరంగల్ రేంజ్ పరిధిలో 22 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 5,298 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రతీ నియోజకవర్గంలో డీఎస్పీ స్థాయి అధికారితో పాటు నలుగురి నుంచి ఆరుగురు సీఐలు, ఎనిమిది నుంచి పన్నెండు మంది వరకు ఎస్సైలతో పాటు మరో 1,100 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తారని తెలిపారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద వరంగల్(అర్బన్), వరంగల్(రూరల్), ఖమ్మం పరిధిలో 362 కేసులు నమోదైనట్లు వివరించారు. అలాగే ఎన్నికల నిబంధనల మేరకు రేంజ్ పరిధిలో రూ.5.50కోట్లు పట్టుకున్నట్లు డీఐజీ తెలిపారు. అలాగే 989 ఫుల్‌బాటిళ్లు, 1,303 హాఫ్బాటిళ్లు, 26,945 క్వార్టర్లు, 4,884 బీర్లు, 113 హాఫ్బీర్లు, 1,343 (90ఎంఎల్ నిబ్స్)ను స్వాధీనం చేసుకున్నట్లు డీఐజీ తెలిపారు. వీటితోపాటు 12,574 లీటర్ల గుడుంబా, లక్ష కిలోల బెల్లం, 22.501 కిలోల పటిక, 2.77 కిలోల బం గారం, 4.5 కిలోల వెండిని పట్టుకున్నట్లు చెప్పారు. 23,241 మంది బైండోవర్... ఎన్నికలను పురస్కరించుకుని ముందు జాగ్రత్త కింద 23,241 మందిని బైండోవర్ చేసినట్లు డీఐజీ వివరించారు. ఇందులో వరంగల్(రూరల్)లో 5,486 మంది, వరంగల్(అర్బన్)లో 4,312, ఖమ్మంలో 13,443 మందిని అదుపులోకి తీసుకుని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినట్లు వివరించారు. రాజ్యాంగం కల్పించిన ఓటుహక్కును ప్రజలు స్వేచ్ఛగా వినియోగించుకోవాలని సూచించారు. సమావేశంలో హన్మకొండ డీఎస్పీ దక్షిణామూర్తి, ట్రెయినీ డీఎస్పీ శీరిష రాఘవేంద్ర, సీఐలు దేవేందర్‌రెడ్డి, సదయ్య, ఎస్సై శ్రీనివాస్ పాల్గొన్నారు.