ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి
భీమారం, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకుని వరంగల్ రేంజ్ పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఐజీ కాంతారావు తెలిపారు. కాకతీయ యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలింగ్‌ను దృష్టిలో ఉంచుకుని రేంజ్ పరిధిలోని వరంగల్ అర్బన్, రూరల్‌తోపాటు ఖమ్మం జిల్లాలో 24,315 వేల మంది పోలీసు సిబ్బందిని నియమించినట్లు చెప్పారు. వరంగల్(అర్బన్)లో 3,648, వరంగల్(రూరల్)లో 6,580, ఖమ్మం జిల్లాలో 8,174 మంది పోలీస్ సిబ్బందితో పాటు 2,412 మంది హోంగార్డులు, 2,510 మంది ఇతర శాఖల సిబ్బంది, 991 మంది డీఎస్పీ, సీఐ స్థాయి అధికారులను నియమించామన్నారు.
వరంగల్ రేంజ్ పరిధిలో 22 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 5,298 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రతీ నియోజకవర్గంలో డీఎస్పీ స్థాయి అధికారితో పాటు నలుగురి నుంచి ఆరుగురు సీఐలు, ఎనిమిది నుంచి పన్నెండు మంది వరకు ఎస్సైలతో పాటు మరో 1,100 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తారని తెలిపారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద వరంగల్(అర్బన్), వరంగల్(రూరల్), ఖమ్మం పరిధిలో 362 కేసులు నమోదైనట్లు వివరించారు. అలాగే ఎన్నికల నిబంధనల మేరకు రేంజ్ పరిధిలో రూ.5.50కోట్లు పట్టుకున్నట్లు డీఐజీ తెలిపారు. అలాగే 989 ఫుల్‌బాటిళ్లు, 1,303 హాఫ్‌బాటిళ్లు, 26,945 క్వార్టర్లు, 4,884 బీర్లు, 113 హాఫ్‌బీర్లు, 1,343 (90ఎంఎల్ నిబ్స్)ను స్వాధీనం చేసుకున్నట్లు డీఐజీ తెలిపారు. వీటితోపాటు 12,574 లీటర్ల గుడుంబా, లక్ష కిలోల బెల్లం, 22.501 కిలోల పటిక, 2.77 కిలోల బం గారం, 4.5 కిలోల వెండిని పట్టుకున్నట్లు చెప్పారు.
23,241 మంది బైండోవర్...
ఎన్నికలను పురస్కరించుకుని ముందు జాగ్రత్త కింద 23,241 మందిని బైండోవర్ చేసినట్లు డీఐజీ వివరించారు. ఇందులో వరంగల్(రూరల్)లో 5,486 మంది, వరంగల్(అర్బన్)లో 4,312, ఖమ్మంలో 13,443 మందిని అదుపులోకి తీసుకుని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినట్లు వివరించారు. రాజ్యాంగం కల్పించిన ఓటుహక్కును ప్రజలు స్వేచ్ఛగా వినియోగించుకోవాలని సూచించారు. సమావేశంలో హన్మకొండ డీఎస్పీ దక్షిణామూర్తి, ట్రెయినీ డీఎస్పీ శీరిష రాఘవేంద్ర, సీఐలు దేవేందర్‌రెడ్డి, సదయ్య, ఎస్సై శ్రీనివాస్ పాల్గొన్నారు.