మిర్చిఘాటుతో ఎన్నికల సిబ్బంది పరుగులు!
వరంగల్: ఎన్నికల సిబ్బందికి ప్రభుత్వ అధికారులు మిర్చి ఘాటును గట్టిగానే చూపించారు. మిర్చి ఘాటుకు తట్టుకోలేక ఎన్నికల సిబ్బంది నానా కష్టాలు పడ్డారు. అంతేకాకుండా ఆ ప్రదేశం నుంచి ఈవీఎంలను వదిలేసి బయటకు పరుగుతీసినట్టు సమాచారం.
ఏప్రిల్ 30న జరిగే ఎన్నికల కోసం సిబ్బందికి వరంగల్ లోని ఎనుమాముల మార్కెట్ ను ఈవీఎంల పంపిణీ కేంద్రంగా ఎంపిక చేశారు. అయితే మిర్చి సీజన్ కావడంతో పెద్ద ఎత్తున పంట మార్కెట్ వచ్చింది.
వ్యాపారవేత్తలు, రైతులు భారీగా మిర్చిని ఎనుమాముల మార్కెట్ లో నిల్వ చేశారు. మార్కెట్ చుట్టూ ఉన్న సమీప ప్రాంతాలకు మిర్చి ఘాటు పెద్ద ఎత్తున వ్యాపించినట్టు స్థానికులు కూడా ఫిర్యాదు చేశారు. అయితే అదే ప్రాంతాన్ని ఎన్నికల సిబ్బందికి ఈవీఎంలు పంపిణీ చేసే కేంద్రంగా ఎంచుకోవడంతో గందరగోళం నెలకొంది. మిర్చి ఘాటు తట్టుకునేందుకు చేతి రుమాల్లు, కండువాలను సిబ్బంది వాడాల్సిన పరిస్థితి ఏర్పడింది.