మారన్ బ్రదర్స్‌కు చుక్కెదురు
చెన్నై, సాక్షి ప్రతినిధి: టీవీ ప్రసారాలకు అవసరమైన ఎమ్‌ఎస్‌వో హక్కులను రద్దు చేస్తూ కేంద్ర కమ్యూనికేషన్లు, ప్రసార మంత్రిత్వశాఖ జారీచేసిన ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని కోరుతూ మారన్ సోదరులు మద్రాసు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌కు చుక్కెదురైంది. కేంద్రం తీసుకున్న నిర్ణయంపై తాము స్టే మంజూరు చేయలేమంటూ మారన్ బ్రదర్స్ గురువారం దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. సన్ గ్రూపు టీవీలకు సొంతమైన కల్ కేబుల్స్ సంస్థ డిజిటల్ హక్కులను రద్దు చేస్తూ కేంద్రం ఉత్తర్వులను జారీచేసింది.
దీనిని సవాల్ చేస్తూ ఆ సంస్థ డెరైక్టర్ సంపత్కుమరన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఉత్తర్వులు రద్దుకు సంబంధించి ముందుగా తమకు ఎటువంటి సమాచారం లేదని, అనుమతి రద్దుకు కారణాలు సైతం స్పష్టం చేయలేదని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. దేశ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని మారన్ బ్రదర్స్ నేతృత్వంలో నడుసున్న కేబుల్ టీవీ సంస్థకు భద్రత సర్టిఫికెట్‌ను జారీచేసేందుకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ నిరాకరించిందని పేర్కొంటూ అందుకు సంబంధించిన ఒక రహస్య పత్రాన్ని కేంద్ర ప్రభుత్వం తరపున న్యాయవాది హైకోర్టు న్యాయమూర్తికి గోప్యంగా అందజేశారు.
మారన్ బ్రదర్స్ స్వాధీనంలో ఉన్న ఎమ్‌ఎస్‌వో హక్కులను రద్దు చేస్తూ ఈనెల 20వ తేదీన సమాచార, మంత్రిత్వశాఖ ఆదేశాలు జారీచేసింది. ఈ ఉత్తర్వులను అనుసరించి 15 రోజుల్లోగా కేబుల్ టీవీ ప్రసారాలను నిలిపివేయాల్సిందిగానూ, ఇందుకు సంబంధించి వినియోగదారులకు ముందుగానే తెలియజేయాలని, వేర్వేరు ఎమ్‌ఎస్‌వోలకు మార్చుకోవాలని హక్కుల రద్దు ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ మారన్ బ్రదర్స్ తరపున కేబుల్ ఆపరేటర్లు మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. న్యాయమూర్తి వీ రామసుబ్రమణ్యం ముందు ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది పీఎస్ రామన్, ఏఆర్ఎల్ సుందరేశన్, కేంద్రం తరపున అదనపు సొలిసిటర్ జనరల్ వీ రాజగోపాలన్, ఎన్ రమేష్ వాదించారు.
న్యాయమూర్తి అక్షింతలు
కలానిధి మార న్ నేతృత్వంలోని కల్ కేబుల్స్ సంస్థ తీరును మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి రామసుబ్రమణ్యం తీవ్రంగా ఖండించారు. పిటిషన్‌దారుపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఁకేబుల్ టీవీ ప్రసారాల్లో మీరు ఏకఛత్రాధిపత్యం వహించేలా వ్యవహరించారు. ఇదే రంగంలో ఉన్న మిగతావారిని ఇబ్బందులకు గురిచేశారు, అరసు టీవీకి హక్కులు రాకుండా చేశారు. గతంలో కేంద్రంలో మీ ప్రభుత్వం ఉండగా, ఇపుడు కేంద్రంలో అధికారం మారింది, మీరు చేసిన ఖర్మ ఇంత త్వరగా మీకు చుట్టుకుంటుందని ఊహించారా అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.