kala utsav
-
చికాగోలో ఘనంగా 'కళా ఉత్సవ్' వేడుకలు
చికాగో : కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 'కళా ఉత్సవ్' ఐదో సాంస్కృతిక వార్షికోత్సవ వేడుకలు చికాగోలో ఘనంగా జరిగాయి. 205 ఈస్ట్ రాన్‌డాల్ఫ్ వీధిలోని హారిస్ థియేటర్లో భారతీయ వారసత్వ కళలు, సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా కళా ఉత్సవ్ కార్యక్రమం జరిగింది. అమెరికాలోని వివిధ ప్రాంతాల్లోని డ్యాన్స్ స్కూల్లకు చెందిన భారతీయ కళాకారులు తమ ప్రదర్శనలతో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ ఏడాది 'కుల్ జా సిమ్ సిమ్' థీమ్‌తో కళా ఉత్సవ్ కార్యక్రమం జరిగింది. ముఖ్యంగా మానవత్వ విలువలపై దృష్టిసారించారు. నిజాయితీ, ధైర్యం, నిజం, ప్రేమ, క్షమాగుణం, అధికారం, శాంతి, ఆనందం, గౌరవం, న్యాయం, సమానత్వం, స్వేచ్ఛల వంటి అంశాలు ఇతివృత్తంగా ప్రదర్శనలు ఇచ్చారు. కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా నీతా భూషణ్ కళా ఉత్సవ్ 2018 ని ప్రారంభించారు. ఛైర్మన్ ఆఫ్ ఢిల్లీ కమిటీ ఆఫ్ చికాగో సిస్టర్ సిటీస్ ఇంటర్నేషనల్ స్మితా షా, ఛైర్మన్ ఆఫ్ రెడ్ బెర్రీ ఫౌండేషన్ దీపక్ కాంత్ వ్యాస్, ఎఫ్ఐఏ వ్యవస్థాపక అధ్యక్షులు రోహిత్ జోషి, యూనైటెడ్ సీనియర్ పరివార్, కీర్తి రావూరిలతో పలువురు ఈ వేడుకలకు హాజరయ్యారు. హెల్త్ కన్సల్టింగ్ సంస్థ డైరెక్టర్ ఆఫ్ టెక్నాలజీ జిగర్ షా 2018 కళా ఉత్సవ్ కి కల్చరల్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఆయనతో పాటూ డా. ప్రేరణ ఆర్య వేడుకల సన్నదంలో తన వంతు కృషి చేశారు. ఈ కార్యక్రమంలో దాదాపు వేయి మందికి పైగా ఎన్‌ఆర్‌ఐలతోపాటూ అమెరికన్లు పాల్గొన్నారు. మొత్తం 19 గ్రూపులు పాల్గొన్న పోటీల్లో నాట్యా డ్యాన్స్ థియేటర్ వారి త్రిశక్తి భరతనాట్యం గ్రూప్ మొదటి బహుమతి, కళాపద్మ డ్యాన్స్ అకాడమీ వారి నిర్భయ కాళీ గ్రూప్‌కు రెండో బహుమతి, ఐ రాధా గ్రూప్, రాస్ గార్బా గ్రూప్‌కు మూడో బహుమతి దక్కింది. -
కళాఉత్సవ్‌లో జిల్లాకు రెండు ప్రథమాలు
కాకినాడ కల్చరల్ : రాష్ట్ర స్థాయి కళాఉత్సవ్–2016 పోటీలలో మన జిల్లా విద్యార్థులు విశేష ప్రతిభ కనబర్చారు. విజయవాడ బిషప్ గ్రేసీ ఉన్నత పాఠశాలలో బుధ, గురువారాల్లో జరిగిన విజువల్స్ ఆర్ట్స్ పోటీలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తూరంగిపేట విద్యార్థులు ప్రదర్శించిన ‘అమరావతి–ప్రజల రాజధాని–చారిత్రక విశిష్టత’ అంశం రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం పొందింది. థియేటర్ ఆర్ట్స్ అంశంలో మల్లాడి సత్యలింగనాయకర్ చారిటీస్ ఎయిడెడ్ ఉన్నత పాఠశాల (కాకినాడ) విద్యార్థులు ప్రదర్శించిన ‘విముక్తి నాటిక’ రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం పొందింది. రాష్ట్ర స్ధాయిలో ప్రథమస్థానం పొంది నవంబర్ 14 నుంచి 19 వరకు న్యూఢిల్లీలో జరుగనున్న జాతీయ కళాఉత్సవ్ – 2016 పోటీలకు ఎంపికైన ప్రాజెక్టులకు కృష్ణ, గుంటూరు జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ డా.ఎ.ఎస్.రామకృష్ణ , పట్టభద్రుల ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరావు బహుమతులు అందజేశారు. జాతీయ స్థాయి కళాఉత్సవ్–2016కు ఎంపికైన విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన ఉపాధ్యాయులు కందుకూరి పాల్‌రాజ్, శేషగిరిరావు, పి.కాంతాభిలాష, కేసరి శ్రీనివాసరావు, బి.నాగేశ్వరావులను విశేష ప్రతిభ కనబరిచిన విద్యార్థులను తూర్పుగోదావరి జిల్లా విద్యాశాఖాధికారి ఆర్.నరసింహారావు, కాకినాడ ఉప విద్యాశాఖాధికారి డి.వాడపల్లి, పిఠాపురం ఉప విద్యాశాఖాధికారి బి.నాగేశ్వరావు అభినందించారు. -
వేడుకగా కళాఉత్సవ్ పోటీలు
మెదక్‌రూరల్: మెదక్ మండలం హవేళిఘణాపూర్ గ్రామంలోని డైట్ కళాశాలలో గురువారం రెండోరోజు కళాఉత్సవ్ పోటీలు జరిగాయి. ఈ సందర్భంగా దృశ్య కళలు, నాటకీకరణ విభాగాల్లో జిల్లాస్థాయి పోటీలు నిర్వహించారు. పోటీల్లో జిల్లా వ్యాప్తంగా నాటకీకరణంలో 10 పాఠశాలలు, దృశ్యకళల పోటీల్లో 16 పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నట్లు ప్రిన్సినాల్ రమేష్‌బాబు తెలిపారు. కాగా నాటకీకరణ విభాగంలో సిద్దిపేటలోని గురుకుల పాఠశాల విద్యార్థులు ప్రథమ బహుమతి, మెదక్‌పట్టణంలోని టీఎస్డబ్య్లుఆర్ఎస్ విద్యార్థులు ద్వితీయ బహుమతి, మెదక్ పట్టణంలోని టీఎస్ఆర్ఎస్ బాలికల పాఠశాల తృతీయ బహుమతులు సాధించాయి. అలాగే దృశ్యకళల విభాగంలో లక్డారం జెడ్పీహెచ్ఎస్ ప్రథమ బహుమతి, సిద్దిపేటలోని టీఎస్ఆర్ఎస్ ద్వితీయ బహుమతి, మెదక్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల తృతీయ బహుమతి సాధించాయి. ఈ సందర్భంగా ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులను ప్రిన్సిపాల్ రమేష్‌బాబు అందజేశారు. -
సెప్టెంబర్ 7 నుంచి ‘కళా ఉత్సవ్’
విద్యారణ్యపురి : ఆర్‌ఎంఎస్‌ఏ ఆధ్వర్యంలో జిల్లాస్థాయిలో ‘కళా ఉత్సవ్’ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 7,8,9 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈమేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దీని నిర్వహణకు డీఈఓ కన్వీనర్‌గా, డైట్ కళాశాల ప్రిన్సిపాల్ నోడల్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తారు. మ్యూజిక్, డ్యాన్స్, థియేటర్ ఆర్ట్స్, డ్రాయింగ్, పెయింటింగ్, స్కల్ప్చర్, క్రాఫ్ట్ విభాగాల్లో విద్యార్థులు జట్లుగా పోటీల్లో పాల్గొనాలన్నారు. ప్రభుత్వ, ఎయిడెడ్, పాఠశాలలు, కళాశాలలకు చెందిన 9,10, ఇంటర్మీడియట్ విద్యార్థినీ,విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనొచ్చన్నారు. వీటిలో రాణించిన వారిని వచ్చే నెల 27,28 తేదీల్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తారన్నారు. అక్కడ కూడా ఎంపికైతే నవంబర్ 15 నుంచి 19 వరకు జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధిస్తారన్నారు. జాతీయ స్థాయి విజేతలకు మొదటి బహుమతిగా రూ.1.25 లక్షలు, ద్వితీయ బహుమతిగా రూ.75వేలు, తృతీయ బహుమతిగా రూ.50వేలు అందజేస్తారన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.