కమలనాథన్ కమిటీ ఏర్పాటు తప్పిదమే
రాష్ట్ర విభజన జరిగి ఏడాది దాటిపోయింది. కానీ ఉద్యోగుల విభజన ఇంకా ఒక కొలిక్కిరాలేదు. ఇంకో ఏడాది గడిచినా ఈ సమస్య ఒక కొలిక్కి వస్తుందన్న గ్యారెంటీ ఏదీలేదు. ప్రభుత్వ వాదోపవాదాలు, ఒక్కొక్క ఉద్యోగిది ఒక్కో ప్రత్యేక మైన నేపథ్యం, ప్రభుత్వ నిబంధనలు, ఉద్యోగ సంఘాల వైఖర్లతో సమస్యకు అంతిమ పరిష్కారం లభిస్తుందన్న నమ్మకం కలగడంలేదు. అసలు విభజన చట్టంలోనే లోపాలున్నాయి. హడావిడిగా ఆగమేఘాల మీద చేసి ఈ చట్టం అతి ముఖ్యమైన ఉద్యోగుల విభజనకు సంబంధించి దూరదృష్టితో వ్యవ హరించలేదు. తెలంగాణ ఉద్యమం బలపడటానికి నీళ్లు, నిధులతోపాటు నియామకాలలో జరిగిన వ్యత్యాసాలే కారణమన్నది తెలిసిందే. విభజన అనివార్యమైనప్పుడు జరిగిన హడావుడి, ఆందోళనల మధ్య భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలపై ఎవరూ పట్టించుకోలేదు.
విభజన బిల్లులో ఉద్యోగులకు సంబంధించిన అంశాలలో ఇరు ప్రాంతాలలోని ఏ ఒక్కరూ దృష్టి సారించలేదు. స్థానికత ఆధారంగానే ఉద్యోగుల పంపిణీ జరగాలన్నది తెలంగాణ ఉద్యోగుల వాదన. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం ఆప్షన్లను పరిగణనలోకి తీసుకోవా లన్నది సీమాంధ్ర ఉద్యోగుల వాదన. పరస్పరం ఇచ్చి పుచ్చుకునే ధోరణితో వ్యవ హరించాలన్నది కమలనాథన్ కమిటీ అభిప్రాయం. నిజానికి ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఇరుప్రాంతాల ఉద్యోగులకు ఉండి ఉంటే ఈ సమస్య ఇంత దూరం వచ్చి ఉండేది కాదు. అసలు కమలనాథన్ కమిటీ ఏర్పాటే పెద్ద తప్పు. దాని పరిధి చాలా చిన్నది. అది కేవలం సచివాలయం, కొన్ని డెరైక్టరేట్లకే పరిమితమైన కమి టీయే తప్ప యావత్ ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల విభజనకు సంబంధించిన కమిటీ కాదు. ఏడాదికి పైగా ఈ కమిటీ చేసిన పనేమిటంటే 56 వేల మంది రాష్ట్ర స్థాయి అధికారులలో ఇప్పటివరకు 15 వేలమంది ఉద్యోగులను మాత్రమే రాష్ట్రానికి కేటాయించింది. అతి ముఖ్యమైన శాఖలను మర్చిపోయింది. ఉద్యోగ కేటా యింపుల అనంతర చేదు పరిణామాల పట్ల కమిటీ మౌనం పాటించింది.
తెలంగాణ విషయానికి వస్తే రాష్ట్రం ఏర్పడినా కూడా ఆప్షన్ల పేరిట ఇక్కడ తెలంగాణేతరులు కొనసాగడం ఇక్కడి ఉద్యోగులు, నిరుద్యోగులకు నచ్చని అంశం. భవిష్యత్తులో మరిన్ని వైషమ్యాలు తలెత్తకుండా ఉండా లంటే ఏ ప్రాంతం వారు ఆ ప్రాంతంలో పని చేసుకుంటేనే బాగుంటుంది. అందుకే కేంద్ర ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకుని కమలనాథన్ కమిటీ పరిధి పెంచడమో, లేదా మరొక కమిటీని వెంటనే నియమించడమో చేసి, రెండు రాష్ట్రాల్లోని ఉద్యోగులలో ప్రాంతేతరులపై దృష్టి సారించాలి. అవసరమైతే సూపర్ న్యూమరరీ పోస్టులు సృష్టించి ఏ రాష్ట్రం వారు ఆ రాష్ట్రంలోనే పని చేసే విధంగా నిబంధనలు రూపొందించాలి. ఉద్యోగుల విభజన సమస్యలకు శాశ్వత పరిష్కా రం కనుగొనకుండా తాత్సారం వహిస్తే అది ఏ ఒక్కరికీ క్షేమకరం కాదు.
కాలేరు సురేష్ రాష్ట్ర సహాధ్యక్షులు
తెలంగాణ ఉద్యోగుల సంఘం.
మొబైల్: 9866174474.