ఎకరాకు రూ.10 లక్షల పరిహారమివ్వాలి
చవటపల్లి(కలువాయి): రిజర్వాయర్ నిర్మాణం కోసం సేకరించే భూములకు మార్కెట్ ధర ప్రకారం ఎకరాకు రూ.10 లక్షలు చెల్లించాలని ముంపు రైతులు అధికారులకు స్పష్టం చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు తెలుగుగంగ భూ సేకరణ విభాగ డిప్యూటీ తహసీల్దార్ రామకృష్ణ చవటపల్లిలో బుధవారం గ్రామసభను ఏర్పాటు చేశారు. రిజర్వాయర్ నిర్మాణంలో ముంపునకు గురయ్యే పట్టా పొలాలకు ప్రభుత్వం ఎకరాకు రూ.3.56 లక్షల పరిహారాన్ని ప్రకటించిందని, అనంతరం ఎకరాకు రూ.ఐదు లక్షలివ్వాలని ప్రభుత్వానికి కలెక్టర్ నివేదిక ఇచ్చారని వివరించారు. ఈ నేపథ్యంలో గ్రామంలోని రైతులకు పరిస్థితిని వివరించి, పరిహార విషయంలో వారి అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు గ్రామసభను ఏర్పాటు చేశారు. మార్కెట్ ధర ఎకరా రూ.10 లక్షలు ఉందని, 2012లోనే కేశమనేనిపల్లి రిజర్వాయర్ కింద ముంపునకు గురవుతున్న పొలాలకు రూ.4.4 లక్షలిచ్చారని, ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్ విలువ ప్రకారం రూ.పది లక్షలివ్వాలని రైతులు స్పష్టం చేశారు. తమ పొలాలకు పరిహారాన్ని మార్కెట్ ధర ప్రకారం నిర్ణయించి, పట్టా పొలాలతో పాటు అసైన్మెంట్ పొలాలకు కూడా పరిహారాన్ని చెల్లించాలని, అలా కాకపోతే పనులను జరగనీయమని రైతులు స్పష్టం చేశారు. రైతుల అభిప్రాయాలను లిఖితపూర్వకంగా తెలుసుకున్నామని, ఉన్నతాధికారులకు నివేదికిస్తామని డీటీ తెలిపారు.