విద్యుదాఘాతంతో మహిళ మృతి
కెరమెరి, న్యూస్‌లైన్: మండలంలోని సుర్దాపూర్ గ్రామ పంచాయతీ పరిధి నీంగూడ గ్రామానికి చెందిన కమలాబాయి(36) శుక్రవారం విద్యుదాఘాతంతో మృతిచెందింది.మృతురాలి భర్త చంద్రు తెలిపిన వివరాల ప్రకారం.. కమలాబాయి శుక్రవారం ఉదయం బట్టలు ఉతికి పక్కనే వెదురు కర్రలపై ఆరవేయబోయింది. కర్రల పక్కనే రేకులు ఉండగా.. వాటికి కోతకు గురైన సర్వీసు వైర్ల నుంచి కరెంటు సరఫరా జరిగింది. దీంతో ఆమె కరెంటు షాక్‌కు గురైంది. ఆమెను కుటుంబ సభ్యులు గమనించి ఎడ్లబండిపై పెద్దవాగు దాటించారు. అక్కడి నుంచి ఆటోలో ఆసిఫాబాద్ ఆస్పత్రికి తరలిస్తుండగా ధనోర వద్ద 108 ఎదురుగా వచ్చింది. సిబ్బంది పరీక్షించి కమలాబాయి మృతిచెందినట్లు నిర్దారించారు. ఆమెకు కూతుళ్లు శంకరాబాయి, బుదాబాయి, కుమారుడు పాండు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై లింగమూర్తి వివరించారు.
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం
కమలాబాయి మృతికి విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే కారణమని గ్రామస్తులు, సాయిబాబా యువజన సంఘం నాయకులు అశోక్, నారాయణ, అన్నారావు, ఆనంద్‌రావు ఆరోపించారు. కొంతకాలంగా గ్రామంలో విద్యుత్ సరఫరా అస్తవ్యస్తంగా మారిందని పేర్కొన్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కరెంటు సరఫరాలో హెచ్చుతగ్గుల కారణంగా గురువారం సోనేరావు, పాండు, అశోక్ ఇళ్లలో షాక్‌కు గురయ్యారని తెలిపారు. విద్యుత్ సరఫరాను సరిదిద్దాలని, షాక్ తగలకుండా చూడాలని కోరుతున్నారు.