Kamarajar Port
-
పోర్టుల్లో సరుకు రవాణా డీలా
న్యూఢిల్లీ: గత నెలలోనూ దేశీయంగా కేంద్ర ప్రభుత్వ నిర్వహణలోని ప్రధాన నౌకాశ్రయాలలో సరుకు రవాణా తగ్గింది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020–21) ఏప్రిల్– ఫిబ్రవరి మధ్య కాలంలో 12 ప్రధాన పోర్టులలో కార్గో ట్రాఫిక్ దాదాపు 7 శాతం క్షీణించింది. 600.6 మిలియన్ టన్నులకు పరిమితమైంది. గతేడాది ఇదే కాలంలో 643 ఎంటీకిపైగా సరుకు రవాణా నమోదైంది. దేశీ పోర్టుల అసోసియేషన్(ఐపీఏ) రూపొందించిన తాజా నివేదిక వెల్లడించిన వివరాలివి. పారదీప్, మార్మగోవా మినహా మిగిలిన పోర్టులన్నీ కార్గో ట్రాఫిక్‌లో వెనకడుగు వేశాయి. పారదీప్‌లో 0.3 శాతం పుంజుకుని దాదాపు 103 ఎంటీకీ చేరగా.. 31 శాతం వృద్ధితో మార్మగోవా 19.3 ఎంటీ సరుకును హ్యాండిల్ చేసింది. ప్రధానంగా ఎన్నోర్‌లోని కామరాజార్ పోర్ట్ సరుకు రవాణా 23.3 శాతం తక్కువగా 22.23 ఎంటీకి పరిమితంకాగా.. ముంబై, వీవో చిదంబరనార్‌లోనూ 12 శాతం చొప్పున ట్రాఫిక్ తగ్గింది. ఈ బాటలో కొచిన్, చెన్నై పోర్టు 10 శాతం వెనకడుగు వేయగా.. జేఎన్పీటీ 8 శాతం, దీన్‌దయాళ్(కాండ్లా) పోర్ట్, కోల్‌కతా(హాల్దియా) 6 శాతం చొప్పున క్షీణతను చవిచూశాయి. ఇదేవిధంగా న్యూమంగళూరు 5.3 శాతం, విశాఖపట్టణం 4.9 శాతం తక్కువగా కార్గోను హ్యాండిల్ చేశాయి. కాగా.. కోవిడ్–19 నేపథ్యంలో వరుసగా 11వ నెలలో అంటే ఫిబ్రవరిలో సైతం సరుకు రవాణా బలహీనపడినట్లు నివేదిక పేర్కొంది. గత 11 నెలల్లో ప్రధానంగా కంటెయినర్ల హ్యాండ్లింగ్ తగ్గిపోవడంతోపాటు.. పెట్రోలియం, ఆయిల్, లూబ్రికెంట్స్ తదితర కమోడిటీల కార్గో భారీగా క్షీణించినట్లు తెలియజేసింది. -
చెన్నై తీరం: తృటిలో తప్పిన పెను ప్రమాదం
- నిండా పెట్రోలియం ఉత్పత్తులతో రెండు నౌకలు ఢీ - అప్రమత్తమైన అధికారులు.. హెలికాప్టర్‌తో సర్వే చెన్నై: నిండా పెట్రోలియం ఉత్పత్తులను నింపుకొని ప్రయాణిస్తోన్న రెండు రవాణా నౌకలు ఒకదానినొకటి ఢీకొట్టుకున్నాయి. చెన్నైలోని కామరాజార్ పోర్టుకు అతిసమీపంలో శనివారం ఉదయం ఈ సంఘటన జరిగింది. లిక్విడ్ పెట్రోలియం గ్యాస్(ఎల్పీజీ) లోడుతో పోర్ట్ నుంచి బయటికి వెళుతోన్న ఎం.టి.బీడబ్ల్యూ. మేపిల్ రవాణా నౌక.. ఎదురుగా వచ్చిన ఎం.టి.డాన్ అనే నౌకను ఢీకొట్టిందని, డాన్ నౌక నిండా పెట్రోలియం ఆయిల్ లూబ్రికెంట్స(పీఓఎల్) ఉన్నాయని కామరాజార్ పోర్ట్ అథారిటీ చైర్మన్, ఎండీ ఎం.ఏ. భాస్కరాచార్ మీడియాకు తెలిపారు. ఒకవేళ పెట్రోల్ ఉత్పత్తులు లీకై ఉంటేగనుక తీరంలో పెను ఉపద్రవం సంభవించిఉండేది. వందలాది సముద్రజీవుల ప్రాణాలకు ముప్పు, రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడి ఉండేది. అయితే అదృష్టవశాత్తూ అలాంటి ప్రమాదమేదీ జరగలేదని పోర్ట్ ఎండీ భాస్కరాచార్ స్పష్టం చేశారు. ప్రమాదం సంగతి తెలిసిన వెంటనే సహాయక సిబ్బందిని పంపామని, రెండు నౌకలను తీరానికి తీసుకొచ్చి క్షుణ్నంగా పరిశీలించామని ఆయన వివరించారు. ఈ ప్రమాదంలో నౌకలు ధ్వంసం కావడంగానీ, సిబ్బంది ప్రాణాలు కోల్పోవడంగానీ, ఆయిల్ లేదా గ్యాస్ లీకేజీకానీ జరగలేదని పేర్కొన్నారు. కోస్ట్ గార్డుకు చెందిన హెలికాప్టర్ సైతం ఆ ప్రాంతంలో సర్వే చేసిందని చెప్పారు. ప్రస్తుతానికి పరిస్థితి తమ అదుపులోనే ఉందని కామరాజార్ పోర్టు ఎండీ తెలిపారు. ప్రమాదం ఎందుకు, ఎలా జరిగిందనేదానిపై దర్యాప్తునకు ఆదేశించామని చెప్పారు. కాగా, ఎం.టి.డాన్ నౌకలోని పెట్రోలియం ఉత్పత్తులను అధికారులు అన్లోడ్ చేయించారు. మేపిల్ నౌక మాత్రం యధావిధిగా తన మజిలీకి బయలుదేరింది.