చెన్నై తీరం: తృటిలో తప్పిన పెను ప్రమాదం
- నిండా పెట్రోలియం ఉత్పత్తులతో రెండు నౌకలు ఢీ
- అప్రమత్తమైన అధికారులు.. హెలికాప్టర్‌తో సర్వే
చెన్నై: నిండా పెట్రోలియం ఉత్పత్తులను నింపుకొని ప్రయాణిస్తోన్న రెండు రవాణా నౌకలు ఒకదానినొకటి ఢీకొట్టుకున్నాయి. చెన్నైలోని కామరాజార్ పోర్టుకు అతిసమీపంలో శనివారం ఉదయం ఈ సంఘటన జరిగింది. లిక్విడ్ పెట్రోలియం గ్యాస్(ఎల్పీజీ) లోడుతో పోర్ట్ నుంచి బయటికి వెళుతోన్న ఎం.టి.బీడబ్ల్యూ. మేపిల్ రవాణా నౌక.. ఎదురుగా వచ్చిన ఎం.టి.డాన్ అనే నౌకను ఢీకొట్టిందని, డాన్ నౌక నిండా పెట్రోలియం ఆయిల్ లూబ్రికెంట్స(పీఓఎల్) ఉన్నాయని కామరాజార్ పోర్ట్ అథారిటీ చైర్మన్, ఎండీ ఎం.ఏ. భాస్కరాచార్ మీడియాకు తెలిపారు.
ఒకవేళ పెట్రోల్ ఉత్పత్తులు లీకై ఉంటేగనుక తీరంలో పెను ఉపద్రవం సంభవించిఉండేది. వందలాది సముద్రజీవుల ప్రాణాలకు ముప్పు, రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడి ఉండేది. అయితే అదృష్టవశాత్తూ అలాంటి ప్రమాదమేదీ జరగలేదని పోర్ట్ ఎండీ భాస్కరాచార్ స్పష్టం చేశారు. ప్రమాదం సంగతి తెలిసిన వెంటనే సహాయక సిబ్బందిని పంపామని, రెండు నౌకలను తీరానికి తీసుకొచ్చి క్షుణ్నంగా పరిశీలించామని ఆయన వివరించారు. ఈ ప్రమాదంలో నౌకలు ధ్వంసం కావడంగానీ, సిబ్బంది ప్రాణాలు కోల్పోవడంగానీ, ఆయిల్ లేదా గ్యాస్ లీకేజీకానీ జరగలేదని పేర్కొన్నారు. కోస్ట్ గార్డుకు చెందిన హెలికాప్టర్ సైతం ఆ ప్రాంతంలో సర్వే చేసిందని చెప్పారు.
ప్రస్తుతానికి పరిస్థితి తమ అదుపులోనే ఉందని కామరాజార్ పోర్టు ఎండీ తెలిపారు. ప్రమాదం ఎందుకు, ఎలా జరిగిందనేదానిపై దర్యాప్తునకు ఆదేశించామని చెప్పారు. కాగా, ఎం.టి.డాన్ నౌకలోని పెట్రోలియం ఉత్పత్తులను అధికారులు అన్‌లోడ్ చేయించారు. మేపిల్ నౌక మాత్రం యధావిధిగా తన మజిలీకి బయలుదేరింది.