kamareddy police
-
ఎస్ఐ గోవింద్‌పై సస్పెన్షన్ వేటు
సాక్షి, కామారెడ్డి : బెట్టింగ్ కేసులో అవినీతి ఆరోపణలతో మరో పోలీస్ అధికారిపై వేటు పడింది. ఈ కేసులో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన కామారెడ్డి పట్టణ ఎస్ఐ గోవింద్‌పై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ మేరకు నిజామాబాద్ రేంజ్ ఐజీ శివశంకర్ రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసులో ఇప్పటికే పట్టణ సీఐ జగదీశ్ కూడా సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. సీఐకి చెందిన లాకర్ నుంచి 34 లక్షల నగదు, తొమ్మిది లక్షల విలువైన బంగారాన్ని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మధ్యవర్తి సుజయ్ సైతం అరెస్ట్ అయ్యాడు. కామారెడ్డి పోలీసు శాఖను ఏసీబీ విచారణ పర్వం వారం రోజుల పాటు కుదిపేసింది. (కామారెడ్డి పోలీసుల్లో ఐపీఎల్ బెట్టింగ్ గుబులు!) స్పెషల్’.. నిద్రలోకి! సాక్షిప్రతినిధి, నిజామాబాద్: పోలీసు శాఖలో ‘ప్రత్యేక విభా గం’ పనితీరు ప్రశ్నార్థకంగా మారింది. స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ) విధులు మరిచి సేద తీరుతున్నట్లే కనిపిస్తోంది. ఎంతో కీలకమైన ఈ నిఘా వ్యవస్థ తరచూ విఫలమవుతోందా..? అవినీతి పోలీసుల సమాచార సేకరణలో అట్టర్ ఫ్లాప్ అవుతోందా..? అంటే అవుననే అంటున్నాయి పోలీసు వర్గా లు. ఓ సీఐ స్థాయి అధికారి.. ఎస్సైలు, ఏఎస్సైలు.. క్షేత్ర స్థాయిలో ప్రతి రెండు, మూడు పోలీస్స్టేషన్లకు ప్రత్యేకంగా కానిస్టేబుళ్లతో కూడిన ప్రత్యేక విభాగం పోలీస్ బాస్‌లకు మూడోకన్ను లాంటిది. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారి కదలికలు, పాస్‌పోర్టులు, జాబ్ ఎంక్వైయిరీ వంటి విధులతో పాటు జిల్లాలో పోలీసు అధికారుల అవినీతి, అక్రమాలపై ఎప్పటికప్పుడు పోలీసు బాస్‌లకు సమాచారం అందించే నిఘా వ్యవస్థ ఇది. ఇంతటి ప్రాధాన్యత ఉన్న స్పెషల్ బ్రాంచ్ పనితీరు ప్రశ్నార్థకంగా మారింది. నిఘా పెట్టట్లేదా? పోలీసు అధికారుల అవినీతి, అక్రమాలను ఈ విభాగం చూసీచూడనట్లుగా వ్యవహరిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో కొందరు పోలీసు అధికారులు విచ్చ లవిడిగా అవినీతికి పాల్పడుతున్నారు. సివిల్ తగాదాల్లో తలదూర్చి రూ.లక్షలు దండుకుంటున్నారు. స్టేషన్లనే సెటిల్మెంట్లకు అడ్డాలుగా చేసి, పెద్ద ఎత్తున వెనకేసుకుంటున్నారు. గుట్కా, మట్కా, ఇసుక, మొరం వంటి రెగ్యులర్ మామూళ్లతో పాటు స్టేషన్లలో నమోదవుతున్న కేసుల నుంచి కాసులు దండుకుంటున్నారు. అవినీతి నిరోధక శాఖ వల పన్ని పట్టుకుంటేనే ఈ అక్రమార్కుల వ్యవహారాలు వెలుగులోకి వస్తున్నాయే తప్ప.. పోలీసు శా ఖ అంతర్గత నిఘా వ్యవస్థ ద్వారా ఏ అధికారిపైనా చర్యలు తీసుకున్న దాఖలాలు లేకపోవడమే ఇందుకు నిదర్శనమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. (కామారెడ్డి సీఐ జగదీశ్ అరెస్టు) ఏసీబీ పట్టుకుంటేనే వెలుగులోకి.. అవినీతి నిరోధకశాఖ దృష్టి సారిస్తేనే అధికారుల అ వినీతి బాగోతం వెలుగులోకి వస్తోంది. నెల క్రితం రియల్ ఎస్టేట్ ప్లాటు తగాదాలో తలదూర్చిన బోధన్ సీఐ రాకేశ్, ఎస్ఐ మొగులయ్య రూ.50 వేలు, రూ.లక్షకు పైగా విలువైన సెల్‌ఫోన్‌ను లంచంగా తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. అంతకు ముందు బాన్సువాడ సీఐ టాటాబాబు కూడా ఓ కాంట్రాక్టర్ వద్ద లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. తాజాగా కామారెడ్డి సీఐ జగదీశ్ అవినీతి బా గోతం ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నిజామాబాద్ జిల్లాలో పని చేసిన ఆయ న లాకర్లలో రూ.34 లక్షల నగదు, స్థిరాస్తుల పేప ర్లు, బంగారు ఆభరణాలు బయటపడ్డాయి. ఏసీబీ వల పన్ని పట్టుకుంటేనే పోలీసు శాఖలోని అవినీతి అక్రమాలు వెలుగు చూస్తున్నాయే తప్ప తమ శాఖ ప్రతిష్టను మసకబార్చేలా వ్యవహరిస్తున్న అవినీతి అధికారులపై ఈ స్పెషల్ బ్రాంచ్ నిఘా కరువైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలీసు బాస్‌ల దృష్టికి తీసుకెళ్లడం లేదా..? విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్న పోలీసు అధికారుల వ్యవహారాలను ఎస్బీ అధికారులు పోలీసు బాస్ దృష్టికి తీసుకెళ్లడం లేదా..? లేక ఎస్బీ ఎప్పటికప్పుడు ఇస్తున్న నివేదికలు బుట్టదాఖలవుతున్నాయా..? అనే అంశం ఇప్పుడు తెరపైకి వస్తోంది. ఆయా నియోజకవర్గాల ప్రజాప్రతినిధుల అండదండలతో ‘ఆదాయ’ మార్గాలున్న స్టేషన్లలో విధులు నిర్వరిస్తున్న ఈ అవినీతి అధికారుల పట్ల ఉక్కుపాదం మోపడంలో పోలీసు బాస్‌లు కఠినంగా వ్యవహరించడం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. -
పోలీసుల్ని కుదిపేస్తున్న బెట్టింగ్ కేసు!
సాక్షి, కామారెడ్డి: ఐపీఎల్ బెట్టింగ్ వ్యవహారం జిల్లా పోలీస్ శాఖను కుదిపేస్తోంది. బెట్టింగ్ కేసులో నిందితుడికి స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు రూ.5 లక్షలు లంచం డిమాండ్ చేసిన కామారెడ్డి సీఐ జగదీశ్‌ను ఇప్పటికే ఏసీబీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించింది. రెండు రోజుల నుంచి అతని ఇంట్లో సోదాలు చేస్తోంది. నేడు కూడా సోదాలు కొనసాగే అవకాశం ఉంది. సీఐ సన్నిహితుల పాత్రపైనా ఏసీబీ అధికారులు ఆరాతీస్తున్నారు. ఇక బెట్టింగ్ రాయుళ్లకు మధ్యవర్తిగా వ్యవహరించిన సుజయ్ కూడా ఏసీబీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో సుజయ్ ద్వారా మామూళ్లు తీసుకున్న పోలీసుల వివరాలను ఏసీబీ సేకరిస్తున్నట్టు సమాచారం. మామూళ్ల విషయంలో ఎస్సైలు, డీఎస్పీ లక్ష్మీనారాయణ పాత్రతో పాటు కింది స్థాయి సిబ్బంది హస్తం ఉందని ఏసీబీ అనుమానం వ్యక్తం చేసింది. నిన్న రాత్రి నుంచి డీఎస్పీ కార్యాలయంతో పాటు ఇంట్లో కూడా ఏసీబీ సోదాలు చేస్తోంది. గత రాత్రి కామారెడ్డి డీఎస్పీని విచారించారు. ఇక మామూళ్ల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు ఎస్సైలలో ఒకరు సెలవులో ఉండగా.. మరొకరు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో బెట్టింగ్ రాయుళ్లతో చేతులు కలిపిన పోలీస్ అధికారుల్లో టెన్షన్ మొదలైంది. విచారణ అనంతరం పూర్తి వివరాలు ఏసీబీ అధికారులు తెలిపారు. (చదవండి: బెయిల్ కోసం కామారెడ్డి సీఐ చేతివాటం) -
పండుగ పూట పత్తాలాట!
బిచ్కుంద(జుక్కల్): పండుగ పూట పత్తాలాట జోరందుకుంది..! ఇందుకోసం ప్రత్యేక స్థావరాలు వెలిశాయి. పండుగకు ముంద రోజు నుంచి మరుసటి రోజు వరకు రూ.లక్షల్లో నగదు చేతులు మారుతుంది.. వెలుగు జిలుగులు నింపే దీపావళి పండుగ వేళ పత్తాలాట కారణంగా కొందరు అప్పుల పాలవుతున్నారు. ఈ జూదం ఆడేవారు అత్యాశకు పోయి సర్వం కోల్పోతున్నారు. దీపావళి పండగ వస్తుందంటే కొందరు ప్రత్యేకంగా అడ్డాలు ఏర్పాటు చేసి, పేకాట నిర్వహిస్తున్నారు. పేకాటలో కీటీ పేరుతో డబ్బులు వసూలు చేస్తారు. జిల్లాలో ప్రధానంగా బిచ్కుంద, జుక్కల్, మద్నూర్, పెద్దకొడప్గల్, పిట్లం, బీర్కూర్, నస్రుల్లాబాద్, బాన్సువాడ, ఎల్లారెడ్డి తదితర మండలాల్లో దీపావళికి జోరుగా పేకాట ఆడతారు. రమ్మి, త్రీ కార్డు, పరేల్, కట్పత్తా (అందర్ బహర్) ఇలా పేర్లతో జూదం ఆడుతుంటారు. గతేడాది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 1900 మందిని పొలీసులు అరెస్టు చేసి రూ.38,69,705 నగదు స్వాధీనం చేసుకున్నారు. అయితే, కామారెడ్డి జిల్లాలో 250 కేసులు నమోదు కాగా, రూ.7,02,820 నగదును పట్టుకున్నారు. దీంతో ఇక్కడి పొలీసులు అంతగా పట్టించుకోరనే ధీమాతో మెదక్, కంగీ్ట, బిదర్, ఔరాద్, దెగ్లూర్, నర్సీ ప్రాంతాల నుంచి పేకాట ఆడడానికి వస్తారు. వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డ వారు కూడా స్వస్థలాలకు వచి్చ, పేకాట స్థావరాలకు వెళ్తుంటారు. జూదంలో మొదటి రోజు పోయిన డబ్బులను తిరిగి సంపాదించుకుందామని తర్వాతి రెండ్రోజులు పేకాడుతుంటారు. ఇలా సర్వం కోల్పోయిన వారెందరో ఉన్నారు. గతేడాది పెద్దకొడప్గల్, జుక్కల్, బీర్కూర్, బిచ్కుందలో రహస్యంగా పేకాట స్ధావరాలు వెలిశాయి. రూ.లక్షల్లో పేకాట సాగింది. పొలీసులు దాడులు చేయకుండా నిర్వాహకులు జూదారులకు అన్ని వసతులు కలి్పంచారు. ఈసారి కూడా ఆయా మండలాల్లో జూదం అడ్డాలు ఏర్పాటు చేస్తున్నారు. జుక్కల్ నియోజకవర్గం మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దులు ఉన్న గ్రామాల జూదరులకు అడ్డా నిర్వాహకులు ఫోన్లు చేసి పొలీసులు దాడులు చేయరని ధీమా ఇస్తున్నట్లు సమాచారం. పంటలు విక్రయించిన డబ్బులు.. ప్రస్తుతం వరి, సోయా, పెసర, మినుము పంటలు విక్రయించిన డబ్బులు రైతుల వద్ద ఉన్నాయి. ఈ నేపథ్యంలో వారిని ఆకర్షించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. పేకాట స్థావరాల వైపు పోలీసులు రాకుండా చూసుకుంటామని ప్రచారం చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు, పోలీసులు సైతం ఇలాంటి అడ్డాల వైపు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలున్నాయి. పేకాడితే కేసులు.. పేకాట ఆడితే కేసులు నమోదు చేస్తాం. పేకాట ని యంత్రించడానికి అన్ని చర్యలు తీసుకున్నాం. ఇందుకోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తున్నారు. గ్రామాల్లో నిరంతరం తనిఖీలు కొ నసాగుతాయి. అవసరాన్ని బట్టి ఆయా మండలాలకు ఎక్కువగా బృందాలను పం పిస్తాం. పేకాట ఆడితే గ్రామస్తులు పొలీసులకు సమాచారం ఇవ్వాలి. వారి పేర్లు గోప్యంగా ఉంచుతాం. – శ్వేత, కామారెడ్డి ఎస్పీ -
అయినా.. బుద్ధి మారలేదు
సాక్షి, కామారెడ్డి: దొంగతనాలకు పాల్పడి గతంలో పలుమార్లు జైలుకు వెళ్లాడు. శిక్ష అతడిలో ఎలాంటి పరివర్తన తీసుకురాలేకపోయింది. చోరీలకు పాల్పడి పోలీసులకు చిక్కి జైలుపాలవ్వడం.. విడుదల కాగానే మళ్లీ చోరీలకు పాల్పడడం.. అలవాటుగా మారిపోయింది. ఇలా చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని కామారెడ్డి పోలీసులు మళ్లీ పట్టుకుని కటకటాల వెనక్కిపంపారు. జల్సాల కోసం చోరీలను ఎంచుకున్నాడు. ఇప్పటికే చాలాసార్లు పట్టుబడి జైలుకు వెళ్లివచ్చాడు. అయినా అతడి బుద్ధి మారలేదు. జైలు నుంచి విడుదలైన రోజే చోరీలు మళ్లీ ప్రారంభించాడు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో తాళం వేసిన ఇండ్లను టార్గెట్ చేస్తూ చోరీలకు పాల్పడుతున్న ఓ కరుడుగట్టిన నిందితుడిని బుధవారం కామారెడ్డి పోలీసులు అరెస్టు చేశారు. పట్టణ పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ లక్ష్మీనారాయణ విలేకరులకు వివరాలు వెల్లడించారు. ట్టణంలోని పిట్ల గల్లీలోని శివాజీ రోడ్ లో ఉన్న తోకల నర్సింలు కుటుంబం గత నెల 21న ఇంటికి తాళం వేసి బంధువుల ఇంట్లో శుభకార్యం ఉందని వెళ్లారు. అదే రోజు రాత్రి తాళం పగులగొట్టిన గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోని రెండు తులాల బంగారం, పదితులాల వెండి, రూ.2 లక్షల 9 వేల నగదును చోరీ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాలనీలోని సీసీ కెమెరాలను పరిశీలించగా చోరీ చేసిన వ్యక్తిని గుర్తించారు. ఇందిరానగర్ కాలనీకి చెందిన మహ్మద్ షాహిద్‌గా గుర్తించి అతడి కోసం గాలించారు. రెండు బృందాలుగా పోలీసులు పాత నేరస్తుడైన షాహిద్ కోసం గాలిస్తున్నారు. బుధవారం సిరిసిల్లా రోడ్‌లోని క్లాసిక్ ఫంక్షన్ హాల్ వద్ద పట్టణ పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తుండగా నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి రెండు తులాల బంగారం, పది తులాల వెండి, రూ.35,550 నగదును, అతడు చోరీ చేసిన ఓ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. జల్సాల కోసమే చోరీలు... పిట్లగల్లీలో జరిగిన చోరీ కేసులో పోలీసులు గుర్తించిన మహ్మద్ షాహిద్ పాత నేరస్తుడు. అతడిపై నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో ఇప్పటికే 30 కేసులు ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుడు కరడుగట్టిన నేరస్తుడని చెప్పారు. ఇప్పటికే చాలాసార్లు జైలుకు వెళ్లివచ్చిన అతనిలో మార్పు రాలేదన్నారు. జైలు నుంచి వచ్చిన ప్రతీసారి చోరీలు చేయడమే పనిగా మారినట్లు తెలిపారు. గతనెల 18నే జైలు నుంచి విడుదలైన అతను అదే రోజున అయ్యప్పనగర్‌లో ఓ బైక్‌ను చోరీ చేసినట్లు తెలిపారు. ఆ మరుసటి రోజునే పిట్లగల్లీలో చోరీకి పాల్పడినట్లు వెల్లడించారు. నిందితుడు కేవలం జల్సాల కోసమే చోరీలను ఎంచుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. వచ్చిన డబ్బులతో ఢిల్లీ, అజ్మీర్, రాజస్థాన్, షిరిడీ, తిరుపతి ప్రాంతాల్లో తిరిగి దైవ దర్శనాలు, జల్సాలు చేసి వచ్చాడన్నారు. సిబ్బందికి అభినందనలు.. నిందితుడిని గుర్తించాక అతడిని పట్టుకునేందుకు బృందాలుగా ఏర్పడి కృషి చేసిన పట్టణ ఎస్ఐలు రవికుమార్, గోవింద్, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. కేసు చేదనలో సీసీ కెమెరాలు ప్రధాన పాత్ర వహించాయన్నారు. సీసీ కెమెరాల కారణంగానే చోరీకి పాల్పడింది పాత నేరస్తుడేనని 24 గంటల్లోగా గుర్తించగలిగామన్నారు. ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాల ప్రాధాన్యతను తెలుసుకోవాలన్నారు. ఎస్హెచ్ఓ రామక్రిష్ణ, ఎస్ఐలు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. -
గుట్టు విప్పిన మట్టి గుడ్డ
సాక్షి, కామారెడ్డి : సంఘటన స్థలంలో లభించిన చిన్న ఆధారం.. హత్య కేసు ఛేదనకు దోహదపడింది. రెండున్నరేళ్ల క్రితం కుటుంబ పెద్దను హత్య చేసిన కుటుంబ సభ్యులను కటకటాలపాలు చేసింది. ఈ ఘటన కామారెడ్డిలో చోటు చేసుకుంది. కేసుకు సంబంధించిన వివరాలను సోమవారం ఎస్పీ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. నవంబర్ 7 సాయంత్రం 6.30 గంటలు.. కామారెడ్డి జిల్లా దేవునిపల్లి పోలీస్ స్టేషన్‌కు ఓ ఫోన్ కాల్ వచ్చింది. ‘‘అడ్లూర్ శివారులో గుర్తు తెలియని వ్యక్తిని చంపి దహనం చేశారు’’ అని అవతలి వ్యక్తి సమాచారం ఇచ్చాడు. పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి వెళ్లి విచారణ ప్రారంభించారు. అయితే ఎలాంటి ఆనవాళ్లు లభించలేదు. చనిపోయింది ఎవరో తెలియదు. హత్య కు గురైంది ఆడో, మగో కూడా నిర్ధారించుకోలేని పరిస్థితి. ఎస్పీకి సమాచారం ఇచ్చారు. ఎస్పీ శ్వేతారెడ్డి, డీఎస్పీ భాస్కర్ సంఘట న స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. క్లూస్ టీంను రంగంలోకి దింపినా లాభం లేకపోయింది. హత్యకు గురైంది మహిళే అని వైద్యులు తెలిపారు. దీంతో హత్య కేసును తేల్చేందు కు ఎస్పీ ఆదేశాలతో డీఎస్పీ భాస్కర్ ఆధ్వర్యంలో పోలీసులు మూడు బృందాలు రంగంలోకి దిగారు. పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాలు, ఇరుగు పొరుగు జిల్లాల్లో మిస్సింగ్ కేసులను పరిశీలించారు. అదే ప్రాంతానికి చెందిన ఓ మహిళ అదృశ్యంపై కూపీలాగారు. ఆమె వాడిన సెల్‌ఫోన్ నంబర్ల ద్వారా విచారణ జరిపారు. ఆ ప్రాంతంలో దహనం అయిన రోజున సెల్‌టవర్ లొకేషన్లో తిరిగిన వ్యక్తులపై నిఘా పెట్టారు. ఎన్ని రకాలుగా వెతికినా ఎలాంటి క్లూ దొరకలేదు. పలుమార్లు సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులకు అక్కడ ఓ మట్టితో ఉన్న వస్త్రం కనిపించింది. దాన్ని పరిశీలించిన పోలీసులు.. ఎక్కడో పాతిపెట్టిన శవాన్ని తెచ్చి దహనం చేసి ఉంటారని అనుమానించారు. కామారెడ్డి బీడీ వర్కర్స్ కాలనీ, డ్రైవర్స్ కాలనీ, గుమస్తా కాలనీ, బతుకమ్మకుంట కాలనీల్లో పోలీసులు ఇంటింటికీ తిరిగి.. ‘ఈ ప్రాంతంలో ఎవరైనా కనిపించకుండా పోయారా’ అని ఆరా తీశారు. గుమస్తా కాలనీకి చెందిన భూక్య శంకర్ (55) రెండున్నరేళ్లుగా కనిపించడం లేదని స్థానికులు తెలపడంతో.. పోలీసులు అతడి కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని విచారించారు. తీగలాగితే దొంక కదిలింది. హత్యకు గురైంది శంకర్ అని, అతడిని కుటుంబ సభ్యులే చంపారని తేలింది. మరుగుదొడ్డి నిర్మించుకునే క్రమంలో.. గుమస్తా కాలనీకి చెందిన శంకర్‌కు భార్య గంగవ్వ, ఇద్దరు కూతు ళ్లు, కుమారుడు ఉన్నారు. శంకర్ రైస్‌మిల్లులో కార్మికుడిగా పనిచేసేవాడు. అతడికి మద్యంతో పాటు ఇతర దురలవాట్లున్నాయి. ఇంటి అవసరాలకు డబ్బులు ఇవ్వకుండా తాగుతూ, వివాహేతర సంబంధాలు నెరపడంతో పాటు, భార్య, పిల్లలను వేధించేవాడు. దీంతో శంకర్‌ను హతమార్చాలని భార్య, కుమారుడు, అ ల్లుడు పథకం పన్నారు. 2014 మార్చిలో ఓ రోజు అతిగా మద్యం తాగి ఇంటికి వచ్చిన శంకర్‌కు కుటుంబ సభ్యులు మళ్లీ మద్యం తాగించారు. నిషాలో ఉన్న శంకర్ తలపై కర్రలతో బాది చంపా రు. అనంతరం ఇంటి ఆవరణలో మరుగుదొడ్డి కోసం తవ్విన గుంతలో మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. శంకర్ కనిపించడం లేద ని ఎవరైనా అడిగితే దుబాయికి వెళ్లాడని చెప్పారు. అయితే ఇటీవల మరుగుదొడ్డి నిర్మించుకోవాలని భావించిన శంకర్ కుటుంబ సభ్యులు.. ఇంటి ఆవరణలో ఎక్కువ స్థలం లేకపోవడంతో మృ తదేహాన్ని పాతిపెట్టిన చోటనే మరుగుదొడ్డి నిర్మించుకోవాలని నిర్ణయించారు. అస్తిపంజరాన్ని వస్త్రంలో చుట్టి అడ్లూర్ శివారు ప్రాంతానికి తీసుకెళ్లి ఖాళీగా ఉన్న నీళ్ల కుండీలో వేసి కిరోసిన్ పోసి దహనం చేశారు. అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపిన పోలీసు లు.. సంఘటన స్థలంలో లభించిన మట్టి గుడ్డ ఆధారంగా ముం దుకెళ్లి కేసును ఛేదించారు. క్షణికావేశంలో చేసిన హత్య రెండున్నరేళ్ల తరువాత కూడా ఆ కుటుంబాన్ని జైలుపాలు చేసింది. నిందితులు.. శంకర్ హత్య కేసులో ఆయన భార్య గంగవ్వ(46), కొడు కు భూక్య అర్జున్(20), అల్లుడు గుగులోత్ కిషన్ (45)లపై కేసు న మోదు చేశామని, గంగవ్వ, కిషన్‌లను మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్టు ఎస్పీ వివరించారు. కేసును డీఎస్పీ భా స్కర్ ఆధ్వర్యంలో, సీఐ కోటేశ్వర్రావు, ఎస్సై సంతోష్‌కుమార్‌ల తో పాటు హెడ్ కానిస్టేబుల్ నరేందర్‌రెడ్డి, కానిస్టేబుళ్లు నర్స య్య, గణపతిలు ప్రత్యేక చొరవ తీసుకుని పరిశోధనలో పాల్గొన్నారని పేర్కొన్నారు. కేసును చేధించడంలో ప్రతిభ చూపిన కానిస్టేబుల్ గణపతికి ఎస్పీ నగదు బహుమతి అందజేశారు. -
మహిళలే అతడి టార్గెట్..
ఒంటరిగా ఉన్న మహిళలే అతడి టార్గెట్. భార్య సహాయంతో వారితో మాటలు కలుపుతాడు. తర్వాత కిడ్నాప్ చేస్తాడు. ఆభరణాలు దోచుకుని కొట్టి చంపేస్తాడు. తర్వాత ఆనవాళ్లు దొరక్కుండా ఉండేందుకు మృతదేహాన్ని దూరంగా తీసుకెళ్లి తగలబెట్టేస్తాడు. ఇలా ఐదు హత్యలు చేశాడు. పాపం పండింది. గుర్తుతెలియని మహిళల హత్యల మిస్టరీ వీడింది. హంతకుడు కటకటాల పాలయ్యాడు. కామారెడ్డి : సెప్టెంబర్ 30.. పూర్తిగా తెల్లవారకముందే నిజామాబాద్ జిల్లా కామారెడ్డి పోలీసులకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. జాతీయ రహదారి పక్కన టేక్రియాల శివారులో ఓ మహిళ మృతదేహం ఉందని కాల్ సారాంశం. వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లారు. హంతకులు హత్య చేసి పెట్రోల్ పోసి మృతదేహాన్ని తగలబెట్టారు. శవం పూర్తిగా కాలిపోయి ఉండడంతో గుర్తుపట్టడానికి వీలు కాలేదు. దీంతో హతురాలెవరో.. హంతకులెవరో తెలుసుకోవడం సవాల్‌గా మారింది. గుర్తు తెలియని మహిళ హత్యగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే హత్యకు గురైన వ్యక్తి వివరాలు తెలియకపోవడంతో దర్యాప్తు ముందుకు సాగలేదు. ఈ సంఘటన జరిగిన నెల రోజుల తర్వాత.. నవంబర్ 4వ తేదీన ఇదే రకంగా జాతీయ రహదారిపై దగ్గి చౌరస్తా వద్ద మరో మహిళ శవం పడిఉందని పోలీసులకు సమాచారం అందింది. టేక్రియాల వద్ద మహిళ మృతదేహం పూర్తిగా కాలిపోగా.. ఇక్కడ ముఖం కొంచెం గుర్తుపట్టే విధంగా ఉండడంతో పోలీసులు మృతదేహాన్ని ఫొటోలు తీయించి జిల్లాలోని పోలీసు స్టేషన్లతోపాటు పొరుగు జిల్లాలకు పంపించారు. అంతటితో ఆగకుండా ఆయా ప్రాంతాల్లో అదృశ్యం కేసులను పరిశీలించారు. కామారెడ్డి డీఎస్సీ ఏ.భాస్కర్ ఆధ్వర్యంలో కామారెడ్డి రూరల్ సీఐ కోటేశ్వర్రావు పరిశోధన మొదలుపెట్టారు. ఫోటో ఆధారంగా హతురాలి గుర్తింపు ఫొటో ఆధారంగా హతురాలెవరో తెలిసిపోయింది. హత్యకు గురైన మహిళను మెదక్ జిల్లా సిద్దిపేటకు చెందిన గౌరిశెట్టి పుష్ప(53)గా గుర్తించారు. ఆమె కుటుంబ సభ్యులు పోస్టుమార్టం గదిలో శవాన్ని పరిశీలించి, ఆమె పుష్ప అని నిర్ధారించారు. నవంబర్ 3న రాత్రి పుష్పకు ఎవరో ఫోన్ చేయడంతో ఇప్పుడే వస్తానంటూ ఇంటి నుంచి బయటకు వెళ్లి, తిరిగి రాలేదని వారు పోలీసులతో తెలిపారు. ఆమె ఫోన్ కాల్ లిస్ట్‌ను పోలీసులు పరిశీలించారు. చివరి కాల్స్ ఆధారంగా కేసు ఓ కొలిక్కి వచ్చింది. హతురాలు పుష్ప ఇంటి పనిమనిషి మల్లవ్వ నంబర్ నుంచి ఫోన్ రావడంతో బయటికి వెళ్లిందని గుర్తించిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించడంతో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. సిద్దిపేటకు సమీపంలోని నారాయణరావుపేటకు చెందిన మహ్మద్ అబ్దుల్ సలీం భార్య మల్లవ్వ. ఆమె పుష్ప ఇంట్లో పనిమనిషిగా ఉండేది. ఆమె ద్వారా సలీం పుష్పను ఇంటి నుంచి బయటకు రప్పించాడు. మాయమాటలు చెప్పి తన కారులో తీసుకెళ్లాడు. పుష్ప మెడలో ఉన్న ఐదు తులాల బంగారు ఆభరణాలను వారు దోచుకున్నారు. పుష్ప తలపై కర్రతో కొట్టడంతో ఆమె చనిపోయింది. అదే కారులో మృతదేహాన్ని తీసుకుని దగ్గి చౌరస్తా వద్దకు వచ్చి పెట్రోల్ పోసి తగలబెట్టారు. బంగారం కోసమే హత్య చేసినట్లు అంగీకరించారు. సిద్దిపేటకే చెందిన మరో మహిళ టేక్రియాల వద్ద మహిళను తగలబెట్టిందీ తామేనని నిందితులు అంగీకరించారు. హతురాలు సిద్దిపేటకు చెందిన గోదాం రాజవ్వ అని పేర్కొన్నారు. ‘సిద్దిపేటకు చెందిన గోదాం రాజవ్వ(60) సెప్టెంబర్ 29 వ తేదీ రాత్రి సిద్దిపేట బస్టాండ్‌లో మల్లవ్వ, సలీంలకు కనిపించింది. ఆమెకు మాయమాటలు చెప్పి కారులో ఎక్కించుకున్నారు. సిద్దిపేట దాటగానే రాజవ్వను చంపేసి, ఆమె మెడలోఉన్న రెండున్నర తులాల బంగారు ఆభరణాలను దోచుకున్నారు. అనంతరం శవాన్ని కారులో వేసుకుని, టేక్రియాల శివారులో తగలబెట్టారు. కరీంనగర్ జిల్లాలో.. సిద్దిపేట నుంచి వృద్ధ మహిళలను కిడ్నాప్ చేసి ఆభరణాలు దోచుకున్న తర్వాత కొట్టి చంపి తీసుకెళ్లి కామారెడ్డి ప్రాంతంలో పడేసి దహనం చేసిన హంతకుడు సలీం.. కరీంనగర్ జిల్లాలోనూ పలు హత్యలకు పాల్పడినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఆ జిల్లాలో ముగ్గురిని చంపినట్టు నిందితుడు ఒప్పుకున్నాడు. బంగారం కోసమే హత్యలకు పాల్పడుతున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. మాయమాటలతో మహిళలను కారులో ఎక్కించుకుని, ఆభరణాలు దోచుకుని, చంపి, తగలబెట్టడం సలీంకు అలవాటుగా మారింది. ఎక్కడా పోలీసులకు చిక్కకుండా సలీం జాగ్రత్తపడేవాడు. అయితే దగ్గి వద్ద దహనం చేసిన మహిళ ముఖం పూర్తిగా కాలకపోవడం వల్ల హతురాలిని గుర్తించడం సులువైంది. తద్వారా హంతకుడు పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు.