KANAPUR
-
ఖానాపూర్ (ST) నియోజకవర్గం చరిత్ర...
ఖానాపూర్ నియోజకవర్గం ఖానాపూర్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ పక్షాన పోటీచేసిన రేఖా నాయక్ మరో సారి గెలిచారు. కాంగ్రెస్ ఐ అభ్యర్దిగా పోటీచేసిన మాజీ ఎమ్.పి, మాజీ ఎమ్మెల్యే రమేష్ రాధోడ్ పై ఈమె విజయం సాదించారు. రమేష్ గతంలో టిడిపిలో ఉండేవారు. తెలంగాణలో ఓటుకు నోటు కేసు తర్వాత టిడిపి బాగా దెబ్బతినిపోవడంతో ఆ పార్టీ నాయకులు కొందరు కాంగ్రెస్ ఐలోకి, మరికొందరు టిఆర్ఎస్ లోకి వెళ్లిపోయారు. రమేష్ మొదట టిఆర్ఎస్ లో ఉండి ఆ తర్వాత కాంగ్రెస్ ఐలో చేరి పోటీచేసినా ఫలితం దక్కలేదు. రేఖా నాయక్ కు 66974 ఓట్లు వస్తే, రమేష్ రాధోడ్‌కు 45928 ఓట్లు వచ్చాయి. రేఖా నాయక్‌కు 21046 ఓట్ల ఆధిక్యత వచ్చింది. కాగా బిజెపి అభ్యర్ధి సత్తా అశోక్‌కు 23656 ఓట్లు వచ్చి మూడోస్థానంలో ఉన్నారు. అనేక చోట్ల డిపాజిట్లు కోల్పాయినా, బిజెపికి ఇక్కడ గణనీయంగా ఓట్లు రావడం విశేషం. 2014లో ఖానాపూర్ రిజర్వుడ్ నియోజకవర్గంలో టిడిపి మాజీ ఎమ్మెల్యే సుమన్ రాదోడ్, ఆదిలాబాద్ మాజీ ఎమ్.పి రమేష్ రాదోడ్ల కుమారుడు అయిన రితేష్ రాధోడ్ పోటీచేసి ఓడిపోయారు. ఆజ్మీరా రేఖ 2014లో మొదటిసారి శాసనసభకు 38511 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. ఖానాపూర్‌లో టిడిపి పక్షాన సుమన్ రాధోడ్ రెండుసార్లు గెలిచారు. మరో నేత గోవిందనాయక్ ఈ నియో జకవర్గం నుంచి 1985లో ఇండిపెండెంటుగా, 1994లో టిడిపి పక్షాన, 2004లో టిఆర్ఎస్ తరుఫునగెలవగా, తెలంగాణ సాధనలో భాగంగా రాజీనామా చేసిన 16 మంది టిఆర్ఎస్ సభ్యులలో ఈయన ఒకరు. కాని 2008 ఉప ఎన్నికలో గెలుపొంద లేకపోయారు. ఖానాపూర్ 1978లో ఏర్పడగా, కాంగ్రెస్, కాంగ్రెస్ ఐలు మూడుసార్లు, టిడిపి నాలుగుసార్లు గెలుపొందగా, ఒకసారి ఇండిపెండెంటు, రెండుసార్లు టిఆర్ఎస్ ఇక్కడ గెలిచాయి. ఇక్కడ గెలిచిన కె.భీమ్రావు గతంలో పి.వి. చెన్నారెడ్డి, జనార్ధనరెడ్డి,కోట్ల విజయభాస్కరరెడ్డి మంత్రివర్గాలలో పనిచేసారు. భీమ్రావు ఇక్కడ ఒకసారి, మూడుసార్లు అసిఫాబాదులో గెలిచారు. ఇక్కడ రెండోసారి గెలిచిన సుమన్‌రాథోడ్ ఆదిలాబాద్ నుంచి లోక్‌సభకు ఎన్నికైన రమేష్రాధోడ్ భార్య, రమేష్ గతంలో ఎమ్మెల్యేగా కూడా ఒకసారి గెలుపొందారు. ఆయన జడ్పి చైర్మన్ పదవి కూడా నిర్వహించారు. ఖానాపూర్ ఎస్టిలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
ఖానాపూర్‌లో కోర్టు కొట్లాట!
సాక్షి, ఖానాపూర్: నియోజకవర్గ కేంద్రమైన ఖానాపూర్ పట్టణంలో కోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక న్యాయవాదులు చేపట్టిన నిరవదిక రిలే నిరాహార దీక్షకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. పార్టీలకతీతంగా ప్రజలు, కుల సంఘాలు, యువజన సంఘాలు, విద్యార్థులు వెల్లువలా తరలివచ్చి బహిరంగ మద్దతు తెలుపుతూ కోర్టు ఏర్పాటులో జాప్యంపై ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు. కోర్టు ఏర్పాటు కోసం చేస్తున్న రీలే దీక్షకు మద్దతుగా శనివారం పట్టణంలో వ్యాపార సంస్థల సంపూర్ణ బంద్ పాటిస్తామని ఐక్య వ్యాపార కమిటీ అధ్యక్షుడు రాజేందర్ శుక్రవారం ప్రకటించారు. గురువారం జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో సభ్యులు కోర్టు కోసం ఏకగ్రీవ తీర్మానం చేశారు. శుక్రవారం ప్రత్యేక ప్రార్థనల అనంతరం పలువురు ముస్లీంలు, పలు మజీద్ కమిటీల పెద్దలు తరలివచ్చి న్యాయవాదులకు సాంప్రదాయ (ఇమామ్ జామీన్) దట్టికట్టి సంఘీబావం తెలిపారు. అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. పలు గ్రామాల సర్పంచ్‌లతో పాటు పలు పాఠశాలల విద్యార్థులు తరలివచ్చి దీక్ష స్థలి వద్ద మద్దతు ఇచ్చి బతుకమ్మ ఆటలు ఆడుతున్నారు. స్పందించకుంటే ఆందోళన ఉదృతం చేస్తాం శాంతియుతంగా చేస్తున్న రిలే నిరాహార దీక్షపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని లేని యెడల న్యాయవాదులు చేస్తున్న ఉద్యమం ప్రజల చేతుల్లోకి వచ్చి ఆందోళనలు ఉదృతం అయితే దానికి పూర్తి బాద్యత ప్రభుత్వమే వహించాలని వివిధ పార్టీలు, కులసంఘాలు పార్టీల నాయకులు హెచ్చరించారు. ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు రామయ్య దీక్షకు మద్దతుగా పట్టణంలో ర్యాలీ నిర్వహించి సంఘీబావం తెలిపి మాట్లాడారు. కోర్టు ఏర్పాటుకు సరిపడా వనరులు పట్టణంలో అందుబాటులో ఉండడంతో పాటు 1,500 పైగా కేసులు ఉన్నందుకు కోర్టు ఏర్పాటు అవశ్యకత ఎంతైనా ఉందన్నారు. పద్మశాలి సంఘం నాయకులు ర్యాలీగా వచ్చి మద్దతుగా బైఠాయించారు. శివాజీనగర్ యూత్, ఎస్ఆర్ విద్యాసంస్థల యజమాన్యం విద్యార్థులు మద్దతు తెలిపారు. విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం దీక్షను విరమింపజేశారు. కార్యక్రమంలో న్యాయవాదులు సురేశ్, వెంకట్మహేంద్ర, సత్యనారాయణ, ఆసిఫ్అలీ, రాజశేఖర్, కిశోర్‌నాయక్, రాజగంగన్న, రాఘవేంద్ర, వినయ్ తదితరులు పాల్గొన్నారు. -
అది బ్రాహ్మణ వ్యతిరేక సినిమా.. ఆపేయండి!
ముంబై : ప్రముఖ బాలీవుడ్ దర్శకనిర్మాత అనుభవ్ సిన్హా.. ఆయుష్మాన్ ఖురానా హీరోగా నిర్మించిన ‘ఆర్టికల్–15’ మూవీపై వివాదం రేగుతోంది. ఈ సినిమాను థియేటర్లలో ప్రదర్శించవద్దని, ఈ సినిమా ప్రదర్శనను అడ్డుకోవాలని బ్రాహ్మణ సంఘలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు బ్రాహ్మణ సంఘాలు ఆదివారం ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌లోని పలు థియేటర్ల ఎదుట నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. సినిమా ప్రదర్శనను వెంటనే ఆపాలంటూ చిత్రయూనిట్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సినిమాలో బ్రాహ్మణ కులాన్ని కిరాతకంగా చూపించారని, దళితుల పట్ల బ్రాహ్మణులు వివక్ష చూపినట్లు ఈ సినిమాను తెరకెక్కించారని, ఇది సరికాదని అఖిల భారత బ్రాహ్మణ ఏక్తా పరిషత్ జనరల్ సెక్రటరీ హరి త్రిపాఠీ ఆరోపించారు. మరోవైపు ఈ సినిమా ప్రదర్శనకు ఇబ్బంది కలుగకుండా ప్రతి థియేటర్‌కు భద్రత కల్పిస్తామని, థియేటర్‌కు ఒక పోలీసు చొప్పున కేటాయిస్తామని స్థానిక పోలీసు అధికారి మనోజ్ గుప్తా తెలిపారు. ఈ సినిమా ప్రదర్శనను ఎవరైనా అడ్డుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పోలీసు ఉన్నతాధికారి అనంత్ డియో పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్ గ్రామంలో 2014లో దళితులైన ఇద్దరు అక్కా చెల్లెళ్లు చెట్టుకు ఉరివేసుకొని మరణించిన యథార్థ సంఘటన ఆధారంగా.. దళితులపై సమాజంలో నెలకొన్న వివక్ష నేపథ్యంతో ‘ఆర్టికల్–15’ తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఇద్దరు దళిత అక్కా చెల్లెళ్లు చెట్టుకు ఉరివేసుకుని చనిపోగా మరో సోదరి అదృశ్యమైన సంఘటనను దర్యాప్తు చేసే పోలీసు అధికారిగా ఆయుష్మాన్ ఖురానా నటించారు. -
అర్చకుడి సెల్ఫీ వీడియో కలకలం
సాక్షి, తూర్పుగోదావరి : జిల్లాలో అర్చకుడి ఆత్మహత్య కలకలం రేపింది. మూడు దశాబ్దాలకు పైగా అర్చకత్వం చేస్తున్న గుడి నుంచి వెళ్లగొట్టారని ఆరోపిస్తూ మల్లిఖార్జున శర్మ మంగళవారం తన సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. పాలకమండలి సభ్యులు పగబట్టి తనను విధుల నుంచి తొలగించారని శర్మ తెలిపాడు. మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన శర్మ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మరణించారు. కోరుకొండ మండలంలోని కణపూరులో ఈ ఘటన జరిగింది. శర్మ శివాలయంలో అర్చకత్వం చేస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోండి.. తన ఆత్మహత్యకు బాధ్యులైన వారి పేర్లను సెల్ఫీ వీడియోలో వెల్లడించిన శర్మ... వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వేడుకున్నాడు. తన స్థానంలో వచ్చే మరో అర్చకుడికైనా ఇదే గతి పట్టొచ్చునని హెచ్చరించారు. గుప్త నిధులు తవ్వకాలు జరిపామని తనపై, తన కుంటుంబ సభ్యులపై నిందలు మోపిన వారిని విడిచిపెట్టొద్దని పేర్కొంటూ.. సూసైడ్ నోట్లో సైతం పలువురి పేర్లు వెల్లడించాడు. అర్చకుల ధర్నా విజయవాడ: అర్చకుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధర్నాచౌక్‌లో నవ్యాంధ్రప్రదేశ్ అర్చక సంక్షేమ సంఘం ధర్నా నిర్వహించింది. అర్చకులకు ట్రెజరీల ద్వారా జీతాలు చెల్లించాలని, అర్చక సంక్షేమ నిధిని అమలు చేయాలని డిమాండ్ చేసింది. ఈనామ్ భూముల్లో అర్చకులను పాసుపుస్తకాల్లో అనుభవదారులుగా నమోదు చేయాలని సూచించింది. అర్చకులపై వేధింపులకు పాల్పడుతున్న వారిని శిక్షించాలని, మల్లిఖార్జున శర్మ ఆత్మహత్యకు కారణమైన వారిని చట్టం ముందు నిలబెట్టాలని డిమాండ్ చేసింది. అర్చకుల ఆందోళనకు వైఎస్సార్ సీపీ నేత మల్లాది విష్ణు, అఖిలభారత బ్రాహ్మణ సంఘం ఉపాధ్యక్షుడు చెరుకుమళ్ల రఘురామయ్య మద్దతు ప్రకటించారు. -
గుండెపోటుతో మాజీ ఎంపీటీసీ మృతి
కానాపూర్: ఆదిలాబాద్ జిల్లా కానాపూర్ మండలం పాలఎల్లాపూర్ మాజీ ఎంపీటీసీ గుండెపోటుతో మృతి చెందారు. మంగళవారం మాజీ ఎంపీటీసీ విజయ(55)కు గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించారు. కాగా, ఆస్పత్రిలో ఆమెను పరిక్షీంచిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. విజయ భర్త ఎంపీటీసీగా ఉన్న సమయంలో మృతిచెందడంతో అతని స్థానంలో ఆమెను తిరిగి ఎన్నుకున్నారు. మృతురాలికి ఇద్దరు కుమారులున్నట్లు సమాచారం. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. -
చిన్ని గుండెకు ఆరోగ్యశ్రీ అండ
పథకం కింద శస్త్రచికిత్సకు అవకాశం హామీ ఇచ్చిన అధికారులు సత్తన్‌పల్లి(ఖానాపూర్), న్యూస్‌లైన్ : చిన్నారి రిషితకు ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా శస్త్రచికిత్స చేయిస్తామని వైద్యాధికారులు పేర్కొన్నారు. మండలంలోని సత్తన్‌పల్లికి చెందిన జక్కుల రజిత, శ్రీనివాస్ దంపతుల కుమార్తె 18 నెలల రిషిత గుండెకు రంధ్రం పడి అనారోగ్యంతో బాధపడుతోంది. పేద కుటుంబం కావడంతో శస్త్రచికిత్స చేయించే ఆర్థిక స్థోమతలేక తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. ఈ విషయమై ‘చిన్ని గుండెను ఆదుకోరూ’ శీర్షికన ఆదివారం సాక్షి దినపత్రికలో కథనం ప్రచురితమైంది. స్పందించిన ఆరోగ్యశ్రీ జిల్లా సమన్వయకర్త విజయ్‌కుమార్ ఆదేశాల మేరకు డివిజన్ టీం లీడర్ సల్ల భూమారెడ్డి, సిబ్బంది బాధిత కుటుంబాన్ని కలిశారు. వివరాలు సేకరించారు. ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా శస్త్రచికిత్స చేయిస్తామని ఆయన చెప్పారు. ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డు లేకపోయినా ప్రత్యేక కేసుగా పరిగణించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని, పాప బర్త్ సర్టిఫికెట్ ఆధారంగా ఆపరేషన్ చేయించే వీలుందని పేర్కొన్నారు. ఆపరేషన్‌కు అవసరమైన రక్తం కోసం ఏర్పాట్లు చేసుకోవాలని రిషిత తల్లిదండ్రులకు సూచించారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తమ బిడ్డ గుండె ఆపరేషన్‌కు మార్గం చూపిన ‘సాక్షి’కి రజిత, శ్రీనివాస్ దంపతులు కృతజ్ఞతలు తెలిపారు.