సాక్షి, తూర్పుగోదావరి : జిల్లాలో అర్చకుడి ఆత్మహత్య కలకలం రేపింది. మూడు దశాబ్దాలకు పైగా అర్చకత్వం చేస్తున్న గుడి నుంచి వెళ్లగొట్టారని ఆరోపిస్తూ మల్లిఖార్జున శర్మ మంగళవారం తన సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. పాలకమండలి సభ్యులు పగబట్టి తనను విధుల నుంచి తొలగించారని శర్మ తెలిపాడు. మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన శర్మ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మరణించారు. కోరుకొండ మండలంలోని కణపూరులో ఈ ఘటన జరిగింది. శర్మ శివాలయంలో అర్చకత్వం చేస్తున్నారు.
బాధ్యులపై చర్యలు తీసుకోండి..
తన ఆత్మహత్యకు బాధ్యులైన వారి పేర్లను సెల్ఫీ వీడియోలో వెల్లడించిన శర్మ... వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వేడుకున్నాడు. తన స్థానంలో వచ్చే మరో అర్చకుడికైనా ఇదే గతి పట్టొచ్చునని హెచ్చరించారు. గుప్త నిధులు తవ్వకాలు జరిపామని తనపై, తన కుంటుంబ సభ్యులపై నిందలు మోపిన వారిని విడిచిపెట్టొద్దని పేర్కొంటూ.. సూసైడ్ నోట్‌లో సైతం పలువురి పేర్లు వెల్లడించాడు.
అర్చకుల ధర్నా
విజయవాడ: అర్చకుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధర్నాచౌక్‌లో నవ్యాంధ్రప్రదేశ్ అర్చక సంక్షేమ సంఘం ధర్నా నిర్వహించింది. అర్చకులకు ట్రెజరీల ద్వారా జీతాలు చెల్లించాలని,
అర్చక సంక్షేమ నిధిని అమలు చేయాలని డిమాండ్ చేసింది. ఈనామ్ భూముల్లో అర్చకులను పాసుపుస్తకాల్లో అనుభవదారులుగా నమోదు చేయాలని సూచించింది. అర్చకులపై వేధింపులకు పాల్పడుతున్న వారిని శిక్షించాలని, మల్లిఖార్జున శర్మ ఆత్మహత్యకు కారణమైన వారిని చట్టం ముందు నిలబెట్టాలని డిమాండ్ చేసింది. అర్చకుల ఆందోళనకు వైఎస్సార్ సీపీ నేత మల్లాది విష్ణు, అఖిలభారత బ్రాహ్మణ సంఘం ఉపాధ్యక్షుడు చెరుకుమళ్ల రఘురామయ్య మద్దతు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment