సాక్షి, ఖానాపూర్: నియోజకవర్గ కేంద్రమైన ఖానాపూర్ పట్టణంలో కోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక న్యాయవాదులు చేపట్టిన నిరవదిక రిలే నిరాహార దీక్షకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. పార్టీలకతీతంగా ప్రజలు, కుల సంఘాలు, యువజన సంఘాలు, విద్యార్థులు వెల్లువలా తరలివచ్చి బహిరంగ మద్దతు తెలుపుతూ కోర్టు ఏర్పాటులో జాప్యంపై ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు. కోర్టు ఏర్పాటు కోసం చేస్తున్న రీలే దీక్షకు మద్దతుగా శనివారం పట్టణంలో వ్యాపార సంస్థల సంపూర్ణ బంద్ పాటిస్తామని ఐక్య వ్యాపార కమిటీ అధ్యక్షుడు రాజేందర్ శుక్రవారం ప్రకటించారు. గురువారం జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో సభ్యులు కోర్టు కోసం ఏకగ్రీవ తీర్మానం చేశారు. శుక్రవారం ప్రత్యేక ప్రార్థనల అనంతరం పలువురు ముస్లీంలు, పలు మజీద్ కమిటీల పెద్దలు తరలివచ్చి న్యాయవాదులకు సాంప్రదాయ (ఇమామ్ జామీన్) దట్టికట్టి సంఘీబావం తెలిపారు. అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. పలు గ్రామాల సర్పంచ్‌లతో పాటు పలు పాఠశాలల విద్యార్థులు తరలివచ్చి దీక్ష స్థలి వద్ద మద్దతు ఇచ్చి బతుకమ్మ ఆటలు ఆడుతున్నారు.
స్పందించకుంటే ఆందోళన ఉదృతం చేస్తాం
శాంతియుతంగా చేస్తున్న రిలే నిరాహార దీక్షపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని లేని యెడల న్యాయవాదులు చేస్తున్న ఉద్యమం ప్రజల చేతుల్లోకి వచ్చి ఆందోళనలు ఉదృతం అయితే దానికి పూర్తి బాద్యత ప్రభుత్వమే వహించాలని వివిధ పార్టీలు, కులసంఘాలు పార్టీల నాయకులు హెచ్చరించారు. ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు రామయ్య దీక్షకు మద్దతుగా పట్టణంలో ర్యాలీ నిర్వహించి సంఘీబావం తెలిపి మాట్లాడారు. కోర్టు ఏర్పాటుకు సరిపడా వనరులు పట్టణంలో అందుబాటులో ఉండడంతో పాటు 1,500 పైగా కేసులు ఉన్నందుకు కోర్టు ఏర్పాటు అవశ్యకత ఎంతైనా ఉందన్నారు. పద్మశాలి సంఘం నాయకులు ర్యాలీగా వచ్చి మద్దతుగా బైఠాయించారు. శివాజీనగర్ యూత్, ఎస్‌ఆర్ విద్యాసంస్థల యజమాన్యం విద్యార్థులు మద్దతు తెలిపారు. విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం దీక్షను విరమింపజేశారు. కార్యక్రమంలో న్యాయవాదులు సురేశ్, వెంకట్‌మహేంద్ర, సత్యనారాయణ, ఆసిఫ్‌అలీ, రాజశేఖర్, కిశోర్‌నాయక్, రాజగంగన్న, రాఘవేంద్ర, వినయ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment