
ధర్నా చేస్తున్న శరణ్య
అన్నానగర్: భర్తతో కలపాలని కోరుతూ కోర్టు ఆవరణలో ధర్నాకు దిగిన మహిళా న్యాయవాదిని పోలీసులు అరెస్టు చేశారు. తంజావూరు శ్రీనివాసపురానికి చెందిన అన్భళగన్ (33). ఇతని భార్య శరణ్య (27) తంజావూరు కోర్టులో న్యాయవాదులుగా పని చేస్తున్నారు. కుటుంబ సమస్యల కారణంగా భార్య, భర్త విడిపోయి జీవిస్తున్నారు. ఈ స్థితిలె భార్య నుంచి విడాకులు కోరుతూ అన్భళగన్ తంజావూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఇలాఉండగా తనను భర్తతో కలపాలని కోరుతూ బుధవారం సాయంత్రం శరణ్య తంజావూరు కోర్టు ఆవరణలో ధర్నా చేపట్టింది.
రాత్రి 8 గంటల సమయంలో పోలీసులు ఆమెను బలవంతంగా వ్యాన్‌లో ఎక్కించి మహిళా పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి అర్ధరాత్రి ఆమెను ఇంట్లో వదిలిపెట్టారు. అనంతరం గురువారం శరణ్య మళ్లీ ధర్నాకు దిగింది. మధ్యాహ్నం ఆమెను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. గతంలో ఆమె ఇదేవిధంగా ధర్నా చేపట్టిన సమయంలో నమోదైన ప్రభుత్వ విధులకు ఆటకం కలిగించిన కేసు, ఆత్మహత్య బెదిరింపు కేసులను విచారించిన న్యాయమూర్తి తంగమణి, శరణ్యకు మే 10వతేదీ వరకు రిమాండ్ విధిస్తూ తిర్పునిచ్చారు. పోలీసులు ఆమెను తిరుచ్చి సెంట్రల్ జైలుకు పంపారు.