చైనాకోకచిలుక
‘లేస్తే మనిషిని కాను... ఎగిరే సీతాకోక చిలుకన్నేను...’ అంటూ కాంగ్నింగ్ చేసిన విన్యాసాలకు చైనా ప్రజలు ఆనందభరితులయ్యారు. కాన్వాస్‌పై చేయి తిరిగిన చిత్రకారిణి అయిన కాంగ్నింగ్... కాలుష్యానికి వ్యతిరేక ప్రచారంలో భాగంగా కొత్త అవతారాలు ధరించడంలోనూ దిట్ట. తాజా న్యూ ఇయర్‌ను పురస్కరించుకుని ఈమె అచ్చంగా సీతాకోక చిలుక అవతారమెత్తింది. గత గురువారం బీజింగ్ నగర శివార్లలోని గ్రేట్‌వాల్ దగ్గర సీతాకోకచిలుకలా విన్యాసాలు ప్రదర్శించింది. ఏడాదిలోని 365 రోజులను ప్రతిబింబించే మాస్క్‌లను రెక్కలకు తొడిగి చూపరులను అబ్బురపరచింది. కొంగొత్త కోక అనుకోవద్దు... కొసరు సందేశం మరవద్దంటూన్న కాంగ్... 2015లో చైనాలో వాయుకాలుష్యాన్ని అరికట్టాలనే తన సందేశాన్ని అందిస్తోంది. కొత్త సంవత్సరంలో వాయు కాలుష్యాన్ని అరికట్టాల్సిన అవసరాన్ని చెప్పడానికే తాను ‘హ్యూవా డై’ (సీతాకోకచిలుకలా మారడం) అనే ఈ ఆర్ట్‌ను ప్రదర్శించానని ఆమె చెబుతోంది.
ఎగ్గు లేని జన్మ!
గుడ్డు ముందా పిల్ల ముందా? ఈ డౌట్ ఉన్నవాళ్లు తప్పనిసరిగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ఇండోనేసియాలోని సులవేసి ఐలాండ్ పరిసరాల్లో సంచరించే రెయిన్ ఫారెస్ట్‌లలో ఒక అరుదైన కప్ప... సిగ్గూ ‘ఎగ్గూ’ లేకుండా నేరుగా పిల్లలకి జన్మనిచ్చేస్తోందట. జంట అవసరమే లేని ఈ కప్పకు సిగ్గులూ ఎగ్గులతో పనేమీ లేదని, అయినా వాటి సంతాన సౌభాగ్యానికి ఇవేమీ అడ్డుకావడం లేదని సైంటిస్ట్‌లు వివరిస్తున్నారు. ఆడ-మగ కప్పలు కలవడం, ఆడ కప్ప గుడ్లు పెట్టడం, వాటిలో నుంచి పిల్లకప్పలు ఊపిరిపోసుకోవడం వంటి రెగ్యులర్ పద్ధతులను ఫాలో అవకుండా నేరుగా పిల్లల్ని కనే పొడవాటి దంతాలున్న కప్పల్ని కాలిఫోర్నియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కనిపెట్టారు. గతంలో గుర్తించిన దాదాపు 6 వేల రకాల కప్పలకు ఇవి భిన్నమైనవంటున్న వీరు వీటికి లిమనెక్ట్స్ లార్విపార్టస్ అని పేరు పెట్టారు. వీటిని గుర్తించడం ఆలస్యంగా జరిగినా.. నేరుగా పిల్లలని పుట్టించే వీటి వైరుధ్యపు మూలాన్ని మాత్రం త్వరలోనే తేలుస్తామంటున్నారు.