Kanwaljit Singh
-
కన్వల్జిత్‌సింగ్‌కు చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్: రంజీ మాజీ ఆటగాడు కన్వల్జిత్ సింగ్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. హైదరాబాద్ క్రికెట్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్ (హెచ్‌సీఏఈ) డెరైక్టర్ పదవి నుంచి తనను తప్పిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను నిలుపుదల చేయాలన్న అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. అలాగే కన్వల్జిత్ సింగ్, బీసీసీఐ ఉపాధ్యక్షుడు శివలాల్‌యాదవ్ సోదరుడు వీరేందర్ యాదవ్ మధ్య జరిగిన వివాదంపై నాలుగు వారాల్లో విచారణ పూర్తి చేయాలని ఈ వ్యవహారంపై ఏర్పాటైన కమిటీని ఆదేశించింది. నివేదిక ఆధారంగా బాధ్యులపై రెండు వారాల్లో చర్యలు తీసుకోవాలని జస్టిస్ విలాస్ అఫ్జల్ పుర్కర్‌లతో కూడిన ధర్మాసనం సంబంధిత అధికారులను ఆదేశించింది. హెచ్‌సీఏఈ డెరైక్టర్ పదవి నుంచి తనను తప్పిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయడంతో పాటు, హెచ్‌సీఏఈ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా హెచ్‌సీఏను ఆదేశించాలంటూ కన్వల్జిత్సింగ్ ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
కోర్టుకెక్కిన కన్వల్జిత్
సాక్షి, హైదరాబాద్: మాజీ క్రికెటర్, హైదరాబాద్ క్రికెట్ అకాడమీ డెరైక్టర్ కన్వల్జిత్ సింగ్ వివాదం మరో మలుపు తిరిగింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) తనపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని ఆయన హైకోర్టును ఆశ్రయించారు. రంగారెడ్డి జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడు వీరేందర్ యాదవ్‌పై దాడి చేసిన ఆరోపణలపై గత నెల 26న కన్వల్పై బేగంపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తదనంతర పరిణామాల్లో హెచ్‌సీఏ కన్వల్జిత్‌ను సస్పెండ్ చేసింది. అయితే తనపై సస్పెన్షన్ విధించడం అన్యాయమని ఈ మాజీ స్పిన్నర్ కోర్టుకెక్కారు. సస్పెన్షన్‌ను రద్దు చేయాలంటూ హైకోర్టులో ‘క్వాష్ పిటిషన్’ దాఖలు చేశారు. హెచ్‌సీఏ అధ్యక్షుడు జి. వినోద్‌తో పాటు ఎగ్జిక్యూటివ్ కమిటీ (ఈసీ) సభ్యులను కూడా ఇందులో ప్రతివాదులుగా చేర్చినట్లు సమాచారం. దీనిపై శుక్రవారం కోర్టులో వాదనలు జరిగాయి. సోమవారానికి కేసు వాయిదా పడింది. -
శివలాల్ సోదరుడిపై కన్వల్జిత్ దాడి!
బేగంపేట, న్యూస్‌లైన్: హెచ్‌సీఏ క్రికెట్ అకాడమీ డెరైక్టర్ కన్వల్జిత్ సింగ్ తనపై దాడి చేశారంటూ బీసీసీఐ ఉపాధ్యక్షుడు శివలాల్ యాదవ్ సోదరుడు వీరేందర్ యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరేందర్ ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు. వివరాల్లోకి వెళితే.. వీరేందర్ యాదవ్ (41) కుమారుడు అనిరుధ్ యాదవ్ టెన్నిస్ ఆటగాడు. జింఖానాలో వార్మప్ కోసం వచ్చిన అనిరుధ్‌ను అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా కన్వల్జిత్ సింగ్ చెప్పారు. దీంతో ఈ విషయాన్ని అతడు తన తండ్రి వీరేందర్‌కు చెప్పగా.. ఆయన గురువారం సాయంత్రం కన్వల్జిత్ దగ్గరికి వచ్చారు. ఈ సందర్భంగా మాటా మాటా పెరగడంతో కన్వల్జిత్.. వీరేం దర్‌పై దాడికి దిగారు. వివరాలు తెలుసుకునేందుకు వస్తే దురుసుగా ప్రవర్తిస్తూ మెడ పట్టి గెంటేశాడని, తనపై చేయి చేసుకున్నాడని... వీరేందర్ బేగంపేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన సోదరుడిపై దాడిని శివలాల్ తీవ్రంగా ఖండించారు. ఈ సంఘటనపై స్పందించేందుకు కన్వల్జిత్ నిరాకరించారు.