కార్గిల్ విజయానికి 20 ఏళ్లు
న్యూఢిల్లీ: కార్గిల్ యుద్ధంలో భారత్ గెలిచి శుక్రవారానికి 20 ఏళ్లయిన సందర్భంగా రణభూమిలో అమరులైన భారత సైనికులకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ సహా పలువురు ఘనంగా నివాళుర్పించారు. 1999 మే 3 నుంచి జూలై 26 వరకు పాక్‌తో జరిగిన యుద్ధంలో చివరకు భారత్ విజయం సాధించింది. దాదాపు 500 మంది భారత సైనికులు ఈ యుద్ధంలో అమరులయ్యారు. ఆర్మీ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేస్తూ ‘జూలై 26 కార్గిల్ విజయదినోత్సవంగా ఎప్పటికీ నిలిచిపోతుంది. ద్రాస్, కక్సర్, బతాలిక్, టుర్టోక్ సెక్టార్లలో మన సైనికులు గొప్పగా పోరాడారు’ అని తెలిపింది. త్రివిధ దళాలైన ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ల చీఫ్‌లు వరుసగా జనరల్ బిపిన్ రావత్, అడ్మిరల్ కరమ్‌వీర్ సింగ్, బీఎస్ ధనోవా ద్రాస్‌లో ఉన్న కార్గిల్ యుద్ధ స్మారకం వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. నాడు యుద్ధంలో 17 స్క్వాడ్రన్‌కు కమాండింగ్ అధికారిగా పనిచేసిన ధనోవానే నేడు వాయుసేన చీఫ్‌గా ఉన్నారు.
ద్రాస్‌కు వెళ్లలేక పోయిన కోవింద్
ద్రాస్‌లోని యుద్ధ స్మారకం వద్ద జరిగే కార్యక్రమానికి త్రివిధ దళాధిపతులతోపాటు వారికి అధిపతి అయిన రాష్ట్రపతి కోవింద్ కూడా హాజరై నివాళి అర్పించాలన్నది ప్రణాళిక. అయితే వాతావరణం బాగాలేకపోవడంతో కోవింద్ వెళ్లలేకపోయారు. దీంతో ఆయన కశ్మీర్‌లోని బదామీ బాగ్ కంటోన్మెంట్లో ఆర్మీ 15 కార్ప్స్ ప్రధాన కార్యాలయంలో యుద్ధ స్మారకం వద్ద నివాళులర్పించారు.
యుద్ధక్షేత్రంలో తన ఫొటోలను పోస్ట్ చేసిన మోదీ
అమరవీరులకు ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా నివాళులర్పించారు. ‘భారత సైనికుల కోసం నేను విజయదినోత్సవం రోజున ప్రార్థిస్తున్నాను. మన సైనికులు ధైర్యం, సాహసం, అంకిత భావాన్ని ఈ రోజు గుర్తు చేస్తుంది. మాతృభూమిని కాపాడేందుకు సర్వస్వాన్ని అర్పించిన శక్తిమంతమైన యుద్ధ వీరులకు నివాళి’ అని పేర్కొన్నారు. యుద్ధం సమయంలోఅక్కడికి వెళ్లినప్పుడు తీసుకున్న ఫొటోలను కూడా మోదీ పోస్ట్ చేశారు.
పోరుకు దిగే సామర్థ్యం పాక్‌కు లేదు: రాజ్‌నాథ్
రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లోక్‌సభలో మాట్లాడుతూ సైనికుల చెక్కుచెదరని ధైర్యం, గొప్ప త్యాగం కారణంగానే నేడు మన దేశం సరిహద్దులు భద్రంగా, పవిత్రంగా ఉన్నాయన్నారు. ప్రస్తుతం భారత్‌తో పూర్తిస్థాయి లేదా పరిమిత కాలపు యుద్ధం చేసే సామర్థ్యం పాకిస్తాన్‌కు లేదని ఆయన పేర్కొన్నారు. ‘మన పొరుగుదేశం (పాకిస్తాన్) ఇప్పుడు మనతో నేరుగా యుద్ధం చేయలేక పరోక్ష యుద్ధానికి దిగుతోంది’ అని రాజ్‌నాథ్ చెప్పారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కార్గిల్ అమరవీరులకు నివాళి అర్పించారు. కార్గిల్ యుద్ధంపై చర్చ జరగాలని సభలో కాంగ్రెస్ పక్షనేత అధిర్ రంజన్ చౌధురి డిమాండ్ చేశారు. అటు రాజ్యసభలో చైర్మన్ వెంకయ్య నాయుడు సైనికులు ధైర్య సాహసాలను పొగిడారు. వారి త్యాగాన్ని దేశం ఎన్నటికీ మరువదన్నారు. సభ్యులు లేచి నిల్చొని మౌనం పాటించి అమర సైనికులకు నివాళి అర్పించారు.