యువరాజ్‌కు యమ క్రేజ్
ముషీరాబాద్: నగరంలో ప్రతిష్టాత్మకంగా జరిగే సదర్ సమ్మేళనానికి హర్యానా రాష్ట్రం అంబాల నుంచి తీసుకొచ్చిన ‘యువరాజ్’ అనే దున్నపోతును చూసేందుకు జనం ఎగబడ్డారు. అఖిల భారత యాదవ సంఘం ప్రధాన కార్యదర్శి ఎడ్ల హరిబాబు యాదవ్ ఈ దున్నను ముషీరాబాద్ ప్రధాన రహదారిలో గల సత్తర్‌బాగ్ లో ఉంచారు. ఈ విషయం తెలుసుకున్న జనం గురువారం పెద్ద ఎత్తున అక్కడకు వచ్చారు. యువరాజుతో సెల్ఫీలు, ఫొటోలు తీసుకునేందుకు ఎగబడ్డారు. 1600 కేజీల బరువు, 14 అడుగుల పొడవు, 6 అడుగుల ఎత్తు గల ఈ దున్న గంభీరంగా కనిపిస్తోంది.
ఏడు రోజులు వ్యయ ప్రయాసలకు ఓర్చి తీసుకువచ్చినట్టు దాని బాగోగులు చూసే గౌరవ్ కుమార్ తెలిపారు. దీనితో వాకింగ్, మాలిష్ చేయడం గౌరవ్ విధి. నున్నగా కనిపించేందుకు కటింగ్ చేయడం సుందర్ సింగ్ పని. వీరితో పాటు మరో నలుగురు పనివారురు. ప్రస్తుతం యువరాజు వయసు ఏడేళ్లు. యువరాజు తల్లి గంగ 17 ఏళ్లు, తండ్రి యోగరాజ్ 18 ఏళ్లు. ఇక తమ్ముళ్లు ధోని, భీంరాజ్‌లు కూడా ఉన్నారు. దీని యజమాని కరమ్ వీర్ సింగ్.