Kasturba Gandhi Balika Schools
-
మా ప్రభుత్వం.. అంతా మా ఇష్టం!
సాక్షి, నంద్యాల: కస్తూర్బా బాలికల వసతి గృహాలు, మోడల్ పాఠశాలలకు నిత్యావసర సరుకుల సరఫరాకు సంబంధించిన టెండర్లలో అధికారులు నిబంధనలకు తిలోదకాలిచ్చారు. మా ప్రభుత్వం.. మా ఇష్టం.. అంటూ అధికార పార్టీ నేతలు ఒత్తిడి తేవడంతో వారు చెప్పిన వారికే టెండర్లు కట్టబెట్టారు. నంద్యాల జిల్లాలో 27 కస్తూర్బా బాలికల వసతి గృహాలు, 19 మోడల్ పాఠశాలల(మొత్తం 46)కు కిరాణా సరుకులు (ప్రొవిజన్స్), కూరగాయలు, గుడ్లు, పండ్లు, చికెన్ సరఫరా చేయడం కోసం సమగ్ర శిక్ష అభియాన్ అధికారులు గత డిసెంబర్ 21న టెండర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏడాదికి ప్రొవిజన్స్‌కు రూ.6.43 కోట్లు, కూరగాయలకు రూ.1.75 కోట్లు, పండ్లకు రూ.96.49 లక్షలు, ఎగ్స్‌కు రూ.96.49 లక్షలు, చికెన్‌కు రూ.75.68 లక్షలుగా టెండర్లో పేర్కొన్నారు. తక్కువ ధరకు కోట్ చేసిన వారికి కాంట్రాక్ట్ ఇస్తామని నోటిఫికేషన్లో తెలిపారు. టెండర్ వేయొద్దని అధికార పార్టీ నేతలు బెదిరింపులకు దిగినప్పటికీ తుదకు ఇద్దరు టీడీపీ నేతలు సహా తొమ్మిది మంది టెండర్లో పాల్గొని.. ఒక కేజీబీవీ వసతి గృహం, ఒక మోడల్ స్కూల్‌కు కలిపి (నెలకు) కోట్ చేశారు. గత నెల 31న టెండర్ ఓపెన్ చేసిన తర్వాత రూ.2,71,731 ధరను కోట్ చేసి శ్రీ శ్రీనివాస ట్రేడర్స్ ఎల్1గా నిలిచింది. అయితే తమ వారికి ఈ కాంట్రాక్టు రాకపోవడంతో జిల్లాకు చెందిన మంత్రులు రంగంలోకి దిగి అధికారులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో ఎల్1గా నిలిచిన శ్రీ శ్రీనివాస ట్రేడర్స్‌కు 16, ఎల్4 శ్రీసాయి ఎంటర్ ప్రైజెస్‌కు 15, ఎల్7 కేవీఆర్ ఆగ్రోస్‌కు 15 పాఠశాలల చొప్పున విభజించి కాంట్రాక్టు కేటాయించినట్లు జాయింట్ కలెక్టర్ ప్రకటించడం కలకలం రేపింది. జిల్లా పర్చేజింగ్ కమిటీ చైర్మన్ అయిన జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ అధికార పార్టీ నేతల ఒత్తిడికి తలొగ్గి, టెండర్ ప్రక్రియనే మార్చేశారని టెండర్లో పాల్గొన్న వారు ఆరోపిస్తున్నారు. చికెన్ టెండర్‌ను ఓపెన్ చేయకుండానే కేవీఆర్ ఆగ్రోస్‌కు కట్టబెట్టారని, అసలు ఆ సంస్థకు అర్హతే లేదని చెబుతున్నారు. ఇలా ఏకపక్షంగా కేటాయించాలనుకున్నప్పుడు ఎందుకు టెండర్లు పిలిచారని ప్రశ్నిస్తున్నారు. కాగా, శ్రీ శ్రీనివాస ట్రేడర్స్ మాత్రమే సరుకుల సరఫరా ప్రారంభించగా, మిగతా రెండు సంస్థలు ఇంకా మొదలు పెట్టలేదు. టెండర్లలో అవకతవకల విషయమై జేసీ విష్ణు చరణ్‌ను సంప్రదించగా.. ఎల్1 కోట్ చేసిన మొత్తానికే తాము కూడా ప్రొవిజన్స్ సరఫరా చేస్తామని ఎల్4, ఎల్7లు ముందుకు రావడంతో అందరికీ కలిపి కాంట్రాక్ట్ ఇచ్చామన్నారు. చికెన్ టెండర్లో మిగతా వారంతా రింగ్ అయినట్లు తెలియడంతో అలా చేశామన్నారు. -
5 నిమిషాల్లో 900 పంచ్‌లు
సాక్షి, అమ్రాబాద్ (అచ్చంపేట): పదర మండలం రాయలగండి కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయం విద్యార్థిని మహేశ్వరి కరాటేలో ఐదు నిమిషాల రెండు సెకన్లలో 900పంచ్‌లు కొట్టి ప్రపంచవండర్ బుక్ రికార్డు సాధించింది. విక్టరీ షోటోకాన్ ఆసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండలో వండర్బుక్ ఇంటర్నేషనల్ రికార్డు పోటీలు నిర్వహించారు. మొత్తం 200మంది బాలికలు పాల్గొన్నారు. అయితే, అందరూ కలిసి 5.2 నిమిషాల్లో ఒక లక్ష 50వేల పంచ్‌లు కొట్టగా.. మహేశ్వరీ అదే సమయానికి అత్యధికంగా 900 పంచ్‌లు కొట్టి వండర్బుక్ రికార్డు సాధించింది. ఈమేరకు వండర్బుక్ ఆఫ్ చీఫ్ ఇండియా కో–ఆర్డినేటర్ బింగి నరెందర్గౌడ్ చేతులమీదుగా రికార్డు నమోదు పత్రాన్ని అందుకుంది. ఈమేరకు సోమవారం కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయానికి వచ్చిన విద్యార్థిని మహేశ్వరిని ఎస్ఓ ఉమాదేవి, వెన్నెల, మాస్టర్ లవకుమార్‌తో పాటు, ఉపాధ్యాయులు, తోటివిద్యార్థులు అభినందించారు. ఒక్క కరాటేలోనే కాదు అన్నిరంగాల్లో పట్టుదలతో క్రమశిక్షణతో విద్యార్థులు ముందుకెళ్తూ విద్య కొనసాగించాలని ఈ సందర్భంగా ఎస్ఓ ఉమాదేవి ఆశాభావం వ్యక్తం చేశారు. -
బాలికల ఆందోళన
సాక్షి, జయపురం : హాస్టల్ వార్డెన్‌ను వెంటనే బదిలీ చేయాలని డిమాండ్ చేస్తూ కొరాపుట్ జిల్లా బందుగాం సమితి కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం విద్యార్థినులు మంగళవారం ఆందోళనకు దిగారు. ఈ మేరకు బందుగాం సమితి విద్యాధికారి (బ్లాక్‌ఎడ్యుకేషన్ ఆఫీసర్) కార్యాలయానికి తాళాలు వేశారు. అంతేకాకుండా ఆ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఆ పాఠశాల వార్డెన్ లలిత బిశ్వాల్ అనేక సమయాలలో హాస్టల్లో తమపట్ల కఠినంగా వ్యవహరిస్తూ, తిడుతూ వేధింపులకు గురి చేస్తున్నారని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. తమపట్ల వార్డెన్ వ్యవహరిస్తున్న తీరు, వేధింపులపై పాఠశాల విద్యార్థినులు బ్లాక్ ఎడ్యుకేషన్ అధికారి(బీఈఓ)కార్యాలయంలో నాలుగు రోజుల క్రితం లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. కానీ బీఈఓ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో మరోమార్గం లేక బీఈఓ కార్యాలయానికి తీళాలు వేసి ఆందోళన చేపట్టినట్లు విద్యార్థినులు వెల్లడించారు. విద్యార్థినులు మూకుమ్మడిగా వచ్చి బీఈఓ కార్యాలయానికి తాళాలు వేసి అక్కడ బైఠాయించారు. వార్డెన్‌ను బదిలీ చేసేంత వరకు తాము ఆందోళన విరమించేంది లేదని ధర్నా కొనసాగిస్తామని హెచ్చరించారు. డీపీసీ హామీతో ఆందోళన విరమణ ఈ విషయం తెలిసిన డీపీసీ మహేష్ చంద్రనాయక్ జిల్లా కేంద్రం నుంచి హుటాహుటిన బందుగాం చేరుకుని ఆందోళన చేస్తున్న విద్యార్థినులతో చర్చలు జరిపారు. దాదాపు రెండుగంటల పాటు విద్యార్థినులతో చర్చించి వారి ఆరోపణలు తెలుసుకుని ఈ విషయంపై కలెక్టర్‌కు నివేదిస్తామని అంతేకాకుండా పది రోజుల్లో సమస్యను పరిష్కరించగలమని హామీ ఇచ్చారు. ఆయన ఇచ్చిన హామీతో విద్యార్థినులు శాంతించి సాయంత్రం 5 గంటల తరువాత ఆందోళన విరమించారు. అనంతరం ఆయన కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయానికి వెళ్లి విద్యార్థినుల ఆరోపణలపై ప్రధానోపాధ్యాయునితో చర్చించారు. అక్కడ కూడా వార్డెన్‌ను బదిలీ చేయాలని విద్యార్థినులు డిమాండ్ చేసినట్లు తెలిసింది. -
ఆ ఐదుగురూ స్పెషల్
జిల్లాలో కీలక నేత హుకుం పాఠాలు చెప్పకున్నా ఎస్‌వోలుగా నియమించిన విద్యాశాఖ నిర్భీతిగా నిబంధనోల్లంఘన విశాఖపట్నం: ‘ఆ ఐదుగురు టీచర్లు మా వాళ్లు. పాఠాలు చెప్పరు. వారిని కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్లుగా నియమించండి. విద్యా హక్కు చట్టం అంటూ రూల్స్ చెప్పొద్దు...అవన్నీ మాకు అనవసరం. ఎస్‌వోలుగా పోస్టింగులు ఇవ్వాల్సిందే’. ఇదీ జిల్లాకు చెందిన ఓ కీలక నేత హుకుం. విద్యాహక్కు చట్టం అమలును పర్యవేక్షించాల్సిన కీలన నేత ఆయనే ఆ చట్టాన్ని అపహాస్యం పాలు చేశారు. విద్యాశాఖలో అప్రతిహాతంగా సాగుతున్న అవినీతిపర్వంలో మరో అంకం ఇది. ఐదుగురు ఉపాధ్యాయులను కేజీబీవీ ప్రత్యేక అధికారులుగా నియమిస్తూ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఏడాదిన్నగా పాఠాశాలకు వెళ్లకుండా కాలం వెళ్లదీస్తున్న ఆ ఐదుగురు ఉపాధ్యాయులు చివరికి అనుకున్నది సాధించారు. ఏం జరిగిందంటే..: 2013వరకు ప్రభుత్వ ఉపాధ్యాయులనే కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు(కేజీబీవీ)లలో ప్రత్యేక అధికారులుగా నియమించేవారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయులకు బోధనేతర విధులు అప్పగించవద్దని సుప్రీంకోర్టు 2013లో తీర్పునిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా కేజీబీవీ ప్రత్యేక అధికారులుగా ఉన్న ఉపాధ్యాయులను వారివారి పాఠశాలలకు పంపించి వేసింది. బీఈడీ చేసిన అభ్యర్థులను ప్రత్యేక పరీక్ష ద్వారా కాంట్రాక్టు విధానంలో ప్రత్యేక అధికారులుగా నియమించింది. జిల్లాలో కూడా 29మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు కేజీబీవీ ప్రత్యేక అధికారులు ఉండేవారు. వారిలో 24మంది ఉపాధ్యాయులుగా చేరిపోయారు. ఐదుగురు మాత్రం ప్రభుత్వ నిర్ణయంతో విభేదించారు. ప్రత్యేక అధికారులుగా కొనసాగించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇది విద్యాహక్కు చట్టానికి విరుద్ధమవుతుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. 2014 ఏప్రిల్‌లో ఓ తీర్పులో విద్యా సంవత్సరం ముగిసిన తరువాత కొత్తగా ప్రత్యేక అధికారులను నియమించాలని చెప్పింది. ఆ ప్రకారం 2014, ఏప్రిల్ 22 తరువాత ఆ ఐదుగురిని ప్రత్యేక అధికారులుగా కొనసాగించడానికి వీల్లేదు. కొత్తవారిని నియమించాలి. కానీ... అలా చేయలేదు. మా వాళ్లనే కొనసాగించండి ఆ ఐదుగురు ఉపాధ్యాయులు తాము పాఠశాలకు వెళ్లి విద్యాబోధన చేసేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. ఏడాదిన్నరగా ఇటు ప్రత్యేక అధికారులుగా లేరు... మరోవైపు ఉపాధ్యాయులుగా కాకుండా విధులు నిర్వర్తించడం లేదు. ఈ నేపథ్యంలో ఇటీవల ఆ ఐదుగురూ కీలక సమీప బంధువును సంప్రదించారు. ‘డీల్’ కుదురడంతో ఆయన కీలక నేత ద్వారా కథ నడిపారు. కీలక నేత హైదరాబాద్‌లోని విద్యాశాఖ ఉన్నతాధికారులకు హుకుం జారీ చేశారు. ఆ ఐదురుగిరినీ ప్రత్యేక అధికారులుగా కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. అది విద్యాహక్కు చట్టానికి విరద్ధమని చెప్పినా ఆయన వినిపించుకోలేదు.‘ వాళ్లు మా వాళ్లు. ఇప్పుడు పాఠాలు చెప్పరు. ప్రత్యేక అధికారులుగా ఉంటారని చెప్పేశారు. దాంతో వారు కేజీబీఎస్ ప్రత్యేక అధికారులుగా నియమిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.