బీఈఓ కార్యాలయానికి తాళాలు వేసి ధర్నా చేస్తున్న విద్యార్థినులు
సాక్షి, జయపురం : హాస్టల్ వార్డెన్‌ను వెంటనే బదిలీ చేయాలని డిమాండ్ చేస్తూ కొరాపుట్ జిల్లా బందుగాం సమితి కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం విద్యార్థినులు మంగళవారం ఆందోళనకు దిగారు. ఈ మేరకు బందుగాం సమితి విద్యాధికారి (బ్లాక్‌ఎడ్యుకేషన్ ఆఫీసర్) కార్యాలయానికి తాళాలు వేశారు. అంతేకాకుండా ఆ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఆ పాఠశాల వార్డెన్ లలిత బిశ్వాల్ అనేక సమయాలలో హాస్టల్‌లో తమపట్ల కఠినంగా వ్యవహరిస్తూ, తిడుతూ వేధింపులకు గురి చేస్తున్నారని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. తమపట్ల వార్డెన్ వ్యవహరిస్తున్న తీరు, వేధింపులపై పాఠశాల విద్యార్థినులు బ్లాక్ ఎడ్యుకేషన్ అధికారి(బీఈఓ)కార్యాలయంలో నాలుగు రోజుల క్రితం లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. కానీ బీఈఓ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో మరోమార్గం లేక బీఈఓ కార్యాలయానికి తీళాలు వేసి ఆందోళన చేపట్టినట్లు విద్యార్థినులు వెల్లడించారు. విద్యార్థినులు మూకుమ్మడిగా వచ్చి బీఈఓ కార్యాలయానికి తాళాలు వేసి అక్కడ బైఠాయించారు. వార్డెన్‌ను బదిలీ చేసేంత వరకు తాము ఆందోళన విరమించేంది లేదని ధర్నా కొనసాగిస్తామని హెచ్చరించారు.
డీపీసీ హామీతో ఆందోళన విరమణ
ఈ విషయం తెలిసిన డీపీసీ మహేష్ చంద్రనాయక్ జిల్లా కేంద్రం నుంచి హుటాహుటిన బందుగాం చేరుకుని ఆందోళన చేస్తున్న విద్యార్థినులతో చర్చలు జరిపారు. దాదాపు రెండుగంటల పాటు విద్యార్థినులతో చర్చించి వారి ఆరోపణలు తెలుసుకుని ఈ విషయంపై కలెక్టర్‌కు నివేదిస్తామని అంతేకాకుండా పది రోజుల్లో సమస్యను పరిష్కరించగలమని హామీ ఇచ్చారు. ఆయన ఇచ్చిన హామీతో విద్యార్థినులు శాంతించి సాయంత్రం 5 గంటల తరువాత ఆందోళన విరమించారు. అనంతరం ఆయన కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయానికి వెళ్లి విద్యార్థినుల ఆరోపణలపై ప్రధానోపాధ్యాయునితో చర్చించారు. అక్కడ కూడా వార్డెన్‌ను బదిలీ చేయాలని విద్యార్థినులు డిమాండ్ చేసినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment