అన్నమో ‘చంద్రశేఖరా’!
వంద మందికి నాలుగు అంటే నాలుగే స్నానపు గదులు., చదువుకునేందుకు సరైన చోటు కరువు., పసుపు, కారం కలిపిన నీళ్ల చారు, పిండి ముద్దలాంటి అన్నం., ఆకలితో అలమటిస్తూ కొందరు విద్యార్థుల సొమ్మసిల్లిపడిపోయిన ఘటనలు ఇక్కడ అనేకం. సోమ, మంగళవారాల్లో రామచంద్రాపురం బీసీ సంక్షేమ హాస్టల్ పరిస్థితులపై ‘సాక్షి’ పరిశీలనలో వెల్లడైన గుండెల్ని పిండేసే వాస్తవాలివి.
పటాన్‌చెరు: విద్యాసంవత్సరం మొదలైనా ఇప్పటికీ ఆ హాస్టల్లో మెనూ బోర్డును అతికించలేదు. హాస్టల్ వార్డెన్ (వసతి గృహ సంక్షేమాధికారి) స్థానికంగా ఉండడం లేదు. దాంతో విద్యార్థులకు ఆలనా పాలనా కరువైంది. రామచంద్రాపురం మండలంలో జాతీయ రహదారిపై బీసీ వెల్ఫేర్ హాస్టల్‌ను విద్యార్థుల స్కాలర్‌షిప్‌తో సెల్ఫ్ మెయింటేన్ హాస్టల్‌గా నిర్వహిస్తున్నారు. ఈ హాస్టల్‌కు చెందిన విద్యార్థులు ఇంటర్, బీటెక్, డిప్లొమాలు చదువుతున్నారు. నాలుగేళ్లుగా ఇక్కడ కొనసాగుతున్న ఈ హాస్టల్‌లో గత ఏడాది కంటే కూడా భోజనం అధ్వానంగా ఉంటోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యార్థుల గోడు వాళ్ల మాటల్లోనే..
నీళ్ల చారు, పిండిలాంటి తెల్లని అన్నం మాత్రమే పెడుతున్నారు. మూడు రోజులే గుడ్డు ఇస్తున్నారు.దాదాపు ప్రతి రోజు 80 మంది కంటే ఎక్కువ మందిమి ఈ హాస్టల్‌లో ఉండటం లేదు. వంట మాత్రం వంద మందికి వండుతున్నారని చెప్తున్నారు. చిన్న అరటి పండు అదీ బాగా నల్లబడి, పాడైన వాటినే ఇస్తున్నారు. కూరగాయ కూరలు అస్సలు పెట్టడంలేదు. ఉదయం అల్పాహారం ఇవ్వడంలేదు. ఉదయం పూటే అన్నం, చారు పెడుతున్నారు. కొందరు మధ్యాహ్నం పూట ఆకలితో సొమ్మసిల్లి పడిపోయిన ఘటనలూ ఉన్నాయి. వంట మనిషి పోస్టు ఖాళీగా ఉంది. డైనింగ్ హాల్ ఎప్పుడూ మురికి కూపంగానే ఉంటోంది.
100 మంది ఉండే హాస్టల్‌లో నాలుగే బాత్రూంలు. చేతులు కడుక్కునేందుకు కూడా నల్లాలో నీళ్లు రావు. అద్దె భవనంలో ఈ హాస్టల్ నడుస్తోంది. తాగునీరు లేదు. ఇంటి ఓనర్ నీళ్లు ఎక్కువ వాడుతున్నామంటూ మమ్మల్ని తిడుతున్నారు. సరిపడా వాడుక నీరు రావడంలేదు. హాస్టల్ వార్డెన్ ఇక్కడ అందుబాటులో లేకపోవడంతో ఓనర్ మాపై అరుస్తున్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడంలేదు. గత ఏడాదిలో హాస్టల్ బాగుంది. కాని ఇప్పుడు మూడు నెలలుగా అర్ధాకలితో అలమటిస్తున్నాం. మాకు న్యాయం చేయండి అని విద్యార్థులందరూ మొరపెట్టుకున్నారు.
హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ వివరణ:
మెనూ అమలు చేస్తాం. నేను స్థానికంగానే ఉంటున్నా. విద్యార్థుల మాటల్లో నిజం లేదు.