వార్డెన్ కొట్టడంతో గాయపడిన విద్యార్థి మనీష్
అల్లరి చేస్తున్నాడని విద్యార్థిపై దారుణం
Published Sat, Sep 17 2016 11:33 PM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM
హయత్‌నగర్: అల్లరి చేస్తున్నాడని విద్యార్థిని హాస్టల్ వార్డెన్ చితకబాదాడు. కంటికి తీవ్రగాయమై చూపు కోల్పోయే ప్రమాదం ఏర్పడటంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన పోలీసులు, బాధితుల కథనం ప్రకారం... శంషాబాద్ సమీపంలోని చిన్న తూఫ్రాన్ పేటకు చెందిన దయాసాగర్ కుమారుడు మనీష్(13) హయత్‌నగర్‌లోని శ్రీ చైతన్య టెక్నో రెసిడెన్షియల్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు.
గురువారం రాత్రి అల్లరి చేస్తున్నాడనే కారణంగా వార్డెన్ లక్ష్మణ్ అతడిని చితకబాది, తలను బెంచీకేసి కొట్టాడు. దీంతో పెదవులతో పాటు కంటిలోపల గాయాలయ్యాయి. కంటిచూపు కోల్పోయే ప్రమాదం ఏర్పడటంతో విద్యార్థి తల్లిదండ్రులు శనివారం హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వార్డెన్ను కఠినంగా శిక్షించాలి: బాలల హక్కుల సంఘం
విద్యార్థిని చితకబాదిన వార్డెన్ను జువైనల్ యాక్ట్ ప్రకారం శిక్షించాలని బాలల హక్కుల సంఘం అధ్యక్షురాలు అనురాధరావు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఫీజుల రూపంలో వేలాది రూపాయలు వసూలు చేస్తున్న కార్పొరేట్ పాఠశాలలు విద్యార్థుల పట్ల దారుణంగా వ్యవహరిస్తూ, దాడులకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. విద్యార్థికి వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహించిన పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. మండల ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వార్డెన్పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Advertisement