BC Welfare Hostel
-
బీసీ బాలుల వసతిగృహంలో 13 మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు
-
పాముకాటుతో హాస్టల్ విద్యార్థి మృతి
నస్రుల్లాబాద్ (బాన్సువాడ)/ బాన్సువాడటౌన్: కామారెడ్డి జిల్లా బీర్కూర్‌లోని బీసీ వసతి గృహంలో విద్యార్థి పాముకాటుతో మృతిచెందాడు. నస్రు ల్లాబాద్ మండలం దుర్కి గ్రామానికి చెందిన సాయిరాజ్ బీర్కూర్ జిల్లా పరిషత్ స్కూల్లో ఐదో తరగతి చదువుతూ బీసీ హాస్టల్లో ఉంటున్నాడు. శుక్రవారం రాత్రి ఏదో కుట్టినట్లుగా అనిపించడంతో నిద్రలేచి మిగతా విద్యార్థులను అప్రమత్తం చేశాడు. అక్కడే ఓ పాము కనిపించడంతో అందరూ కలిసి దానిని చంపేశారు. సాయిరాజ్‌కు వాంతులు కావడంతో వెంటనే అతడిని పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అయితే, ఆరోగ్య సిబ్బంది కొద్దిసేపు పరిశీలించి లక్షణాల్లేవని చెప్పి, ప్రాథమిక చికిత్స చేయకుండానే విద్యార్థిని వెనక్కి పంపించేశారు. శనివారం ఉదయం 5 గంటల ప్రాంతంలో సాయిరాజ్ నోటి నుంచి నురుగులు రావడంతో భయానికి గురైన తోటి విద్యార్థులు నైట్ వాచ్‌మన్, వార్డెన్, కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. తల్లిదండ్రులు, గ్రామస్తులు హాస్టల్‌కు వచ్చేసరికి సాయిరాజ్ మృతి చెందాడు. వార్డెన్ వచ్చి సాయిరాజ్ మృతికి కారణం చెప్పాలని వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఘటన గురించి తెలుసుకున్న స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి కలెక్టర్ జితేష్‌వి పాటిల్‌తో మాట్లాడారు. దీంతో కలెక్టర్ వెంటనే వార్డెన్ ను సస్పెండ్ చేశారు. బాధిత కుటుంబానికి డబుల్ బెడ్రూం ఇల్లు, కుటుంబంలో ఒకరికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగం, ఎక్స్‌గ్రేషియా అందించేలా చూస్తామని స్పీకర్ ఫోన్లో బాధితులకు హామీనిచ్చారు. సాయిరాజ్ తల్లిదండ్రులు గంగామణి, మురళి కూలీలు. వీరికి మరో మూడేళ్ల పాప ఉంది. పారిశుధ్య కార్మికురాలికీ పాముకాటు విద్యార్థి మృతి అనంతరం అధికారుల ఆదేశాలతో శనివారం పరిసరాలను శుభ్రంచేస్తున్న గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికురాలు జ్యోతినీ ఓ పాము కాటు వేసింది. దీంతో వెంటనే ఆమెను బాన్సువా డ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. లక్షణాలు కనిపించలేదు: స్టాఫ్ నర్స్ వినోద, బీర్కూర్ పీహెచ్సీ సాయిరాజ్ అస్వస్థతకు గురై రాత్రి ఒంటి గంట సమయంలో పీహెచ్‌సీకి వచ్చాడు. ఎటువంటి లక్షణాలు కనబడకపోవడంతో వైద్యం చేయలేదు. వసతిగృహంలోకి పాము వచ్చిందని తెలపడంతో బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి అంబులెన్సులో పంపిస్తానన్నాను. అయితే, తనను పాము కరవలేదని, అక్కడికి వెళ్లబోనని సాయిరాజ్ చెప్పడంతో తిరిగి పంపించేశాను. -
హాస్టల్లో విద్యార్థుల బీర్ల విందు! వాట్సాప్ గ్రూపుల్లో ఫొటోలు వైరల్
దండేపల్లి (మంచిర్యాల): మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలోని బీసీ బాలుర వసతి గృహంలోని కొందరు విద్యార్థులు బీర్లు, చికెన్‌తో విందు చేసుకున్నారు. బీర్లు తాగుతూ దిగిన సెల్ఫీ ఫొటోలు వైరల్ కావడంతో జిల్లా బీసీ సంక్షేమ అధికారి బుధవారం విచారణకు ఆదేశించారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఘటనకు సంబధించిన వివరాలిలా ఉన్నాయి. బీసీ బాలుర వసతి గృహాంలో ఈ నెల 17న ఆదివారం విద్యార్థులకు చికెన్ వండారు. దీంతో కొందరు విద్యార్థులు రాత్రి భోజనాన్ని గదిలోకి తీసుకెళ్లారు. స్థానిక విద్యార్థుల సాయంతో బీరు బాటిళ్లు తెప్పించుకుని గదిలో వాటిని తాగుతూ సెల్ఫోన్లలో ఫొటోలు దిగారు. ఈ ఫొటోలు వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ కావడంతో కొందరు యువకులు కలెక్టర్, ఉన్నతాధికారులకు వాట్సా ప్తోపాటు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. విషయం తెలిసిన జిల్లా బీసీ సంక్షేమ అధికారి ఖాజా నజీం అలీ అఫ్సర్ ఈ ఘటనపై బుధవారం విచారణకు ఆదేశించగా.. అసిస్టెంట్ బీసీ డెవలప్మెంట్ అధికారి భాగ్యవతి హాస్టల్‌ను సందర్శించి వార్డెన్ మల్లేశ్‌తోపాటు సిబ్బందిని విచారించారు. నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తానని తెలిపారు. (చదవండి: ఏం చేస్తున్నావంటూ భార్యకు వాయిస్ మెసేజ్ పెట్టాడని..) ఇళ్ల మధ్యలో ఉండటంతోనే..? వసతిగృహానికి పక్కా భవనం లేకపోవడంతో గ్రామంలోని ఓ ప్రైవేటు పాఠశాలను అద్దెకు తీసుకుని అందులో నిర్వహిస్తున్నారు. ఇళ్ల మధ్యలో ఉండటంతో స్థానికంగా ఉండే తోటి విద్యార్థులు వీరికి బీరుబాటిళ్లు తెచ్చి ఇవ్వడంతోపాటు సిబ్బంది నిర్లక్ష్యంతోనే ఇలా జరిగిందనే చర్చ జరుగుతోంది. కాగా, వాచ్మెన్ పోస్టు ఖాళీగా ఉంది. వార్డెన్ లక్సెట్టిపేట నుంచి రాకపోకలు సాగిస్తుండటంతో వీరిపై పర్యవేక్షణ కరువైంది. ఆ రోజు సాయంత్రం వార్డెన్ త్వరగానే వెళ్లిపోయినట్లు తెలిసింది. (చదవండి: పీసీసీలో ‘పీకే’ ఫీవర్! అలా అయితే ఎలా?) -
హయత్‌నగర్‌లో విద్యార్థుల ఆందోళన.. ఉద్రిక్తత
హైదరాబాద్: హయత్‌నగర్ మండలం పసుమాములలో గురువారం ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. బీసీ సంక్షేమ హాస్టల్ వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు. హాస్టల్లో కలుషిత నీరు తాగి పదో తరగతి విద్యార్థి రాకేశ్ మృతిచెందాడు. రెండు రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నా.. రాకేష్ తల్లిదండ్రులకు హాస్టల్ వార్డెన్ సమాచారం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో విద్యార్థి రాకేశ్ మృతిచెందడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన హాస్టల్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. -
కూలిన హాస్టల్ పైకప్పు
మహబూబ్‌నగర్: మహబూబ్ నగర్ జిల్లా ఆత్మకూర్ మండల కేంద్రంలోని బాలుర బీసీ హాస్టల్ పైకప్పు ఆదివారం అర్ధరాత్రి కూలింది. విద్యార్థులు నిద్రపోయే స్థలం పక్కనే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అదృష్టవశాత్తూ విద్యార్థులెవరికీ గాయాలు కాలేదు. హాస్టల్ లో సరైన వసతులు లేవని , ఎప్పుడు ఏం జరుగుతుందో భయపడాల్సి వస్తోందని విద్యార్ధులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
అన్నమో ‘చంద్రశేఖరా’!
వంద మందికి నాలుగు అంటే నాలుగే స్నానపు గదులు., చదువుకునేందుకు సరైన చోటు కరువు., పసుపు, కారం కలిపిన నీళ్ల చారు, పిండి ముద్దలాంటి అన్నం., ఆకలితో అలమటిస్తూ కొందరు విద్యార్థుల సొమ్మసిల్లిపడిపోయిన ఘటనలు ఇక్కడ అనేకం. సోమ, మంగళవారాల్లో రామచంద్రాపురం బీసీ సంక్షేమ హాస్టల్ పరిస్థితులపై ‘సాక్షి’ పరిశీలనలో వెల్లడైన గుండెల్ని పిండేసే వాస్తవాలివి. పటాన్చెరు: విద్యాసంవత్సరం మొదలైనా ఇప్పటికీ ఆ హాస్టల్లో మెనూ బోర్డును అతికించలేదు. హాస్టల్ వార్డెన్ (వసతి గృహ సంక్షేమాధికారి) స్థానికంగా ఉండడం లేదు. దాంతో విద్యార్థులకు ఆలనా పాలనా కరువైంది. రామచంద్రాపురం మండలంలో జాతీయ రహదారిపై బీసీ వెల్ఫేర్ హాస్టల్‌ను విద్యార్థుల స్కాలర్‌షిప్‌తో సెల్ఫ్ మెయింటేన్ హాస్టల్‌గా నిర్వహిస్తున్నారు. ఈ హాస్టల్‌కు చెందిన విద్యార్థులు ఇంటర్, బీటెక్, డిప్లొమాలు చదువుతున్నారు. నాలుగేళ్లుగా ఇక్కడ కొనసాగుతున్న ఈ హాస్టల్లో గత ఏడాది కంటే కూడా భోజనం అధ్వానంగా ఉంటోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల గోడు వాళ్ల మాటల్లోనే.. నీళ్ల చారు, పిండిలాంటి తెల్లని అన్నం మాత్రమే పెడుతున్నారు. మూడు రోజులే గుడ్డు ఇస్తున్నారు.దాదాపు ప్రతి రోజు 80 మంది కంటే ఎక్కువ మందిమి ఈ హాస్టల్లో ఉండటం లేదు. వంట మాత్రం వంద మందికి వండుతున్నారని చెప్తున్నారు. చిన్న అరటి పండు అదీ బాగా నల్లబడి, పాడైన వాటినే ఇస్తున్నారు. కూరగాయ కూరలు అస్సలు పెట్టడంలేదు. ఉదయం అల్పాహారం ఇవ్వడంలేదు. ఉదయం పూటే అన్నం, చారు పెడుతున్నారు. కొందరు మధ్యాహ్నం పూట ఆకలితో సొమ్మసిల్లి పడిపోయిన ఘటనలూ ఉన్నాయి. వంట మనిషి పోస్టు ఖాళీగా ఉంది. డైనింగ్ హాల్ ఎప్పుడూ మురికి కూపంగానే ఉంటోంది. 100 మంది ఉండే హాస్టల్లో నాలుగే బాత్రూంలు. చేతులు కడుక్కునేందుకు కూడా నల్లాలో నీళ్లు రావు. అద్దె భవనంలో ఈ హాస్టల్ నడుస్తోంది. తాగునీరు లేదు. ఇంటి ఓనర్ నీళ్లు ఎక్కువ వాడుతున్నామంటూ మమ్మల్ని తిడుతున్నారు. సరిపడా వాడుక నీరు రావడంలేదు. హాస్టల్ వార్డెన్ ఇక్కడ అందుబాటులో లేకపోవడంతో ఓనర్ మాపై అరుస్తున్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడంలేదు. గత ఏడాదిలో హాస్టల్ బాగుంది. కాని ఇప్పుడు మూడు నెలలుగా అర్ధాకలితో అలమటిస్తున్నాం. మాకు న్యాయం చేయండి అని విద్యార్థులందరూ మొరపెట్టుకున్నారు. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ వివరణ: మెనూ అమలు చేస్తాం. నేను స్థానికంగానే ఉంటున్నా. విద్యార్థుల మాటల్లో నిజం లేదు.