కఠారి ప్రవీణ్‌కు పోలీసు భద్రత
సీఎంసీ నుంచి సతీష్ డిశ్చార్జ్
మేయర్ సన్నిహితులపై పోలీసు దృష్టి
చిత్తూరు : చిత్తూరు మేయర్ దంపతుల హత్య నేపథ్యంలో వారి కుమారుడు కఠారి ప్రవీణ్‌కు పోలీసులు గట్టి భద్రత కల్పించారు. కార్పొరేటర్ కందాతో పాటు మోహన్‌కు నమ్మినబంటుగా ఉన్న ప్రసన్న, మేయర్ కుమారుడు ప్రవీణ్, మేయర్ తమ్ముళ్లు గోపి, కిషోర్‌ను సైతం హత్య చేయాలని వ్యూహరచన చేసినట్లు ఇప్పటికే పోలీసులకు లొంగిపోయిన దుండగులు అంగీకరించారు. దీంతో మేయర్ ఇంటి వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ప్రవీణ్‌కు పోలీసు భద్రత కల్పించారు. ఇక హత్య జరిగిన సమయంలో దుండగుల దాడిలో గాయపడిన సతీష్ శుక్రవారం వేలూరు సీఎంసీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఇతన్ని చిత్తూరు డీఎస్పీ లక్ష్మీనాయుడు విచారణ చేశారు. ఇతనికి సైతం పోలీసు భద్రతను కల్పించారు.
ఆ సన్నిహితులు ఎవరో..?
అనురాధ, మోహన్ల హత్యకు వారి వెంటే ఉన్న వ్యక్తుల సహకారం ఉండొచ్చని అనుమానిస్తున్నట్టు ఓ పోలీసు అధికారి పేర్కొన్నారు. వారి సహకారం లేనిదే అంత పక్కాగా మేయర్ దంపతుల పర్యటన వివరాలు తెలిసే అవకాశం లేదని, దుండగులు సైతం దర్జాగా మేయర్ చాంబర్లోకి వెళ్లడం వెనుక మేయర్ దంపతులకు సన్నిహితులైన వారే చింటూకు చేరవేసినట్లు ప్రాథమికంగా పోలీసులు భావిస్తున్నారు. ఫోన్ కాల్ జాబితా ఆధారంగా ఈ వివరాలు తేలనున్నాయి.