మీ నిఘా సంగతేంటి?
* అమెరికాను ప్రశ్నించిన భారత్
న్యూఢిల్లీ: బీజేపీపై అమెరికా ప్రభుత్వం నిఘా పెట్టిందన్న కథనాలపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఈ విషయమై ఆ దేశానికి చెందిన ఉన్నతస్థాయి దౌత్యవేత్తని పిలిపించి నిరసన తెలిపింది. తమ సంస్థలు, పౌరుల విషయంలో పరిధిని ఉల్లంఘించి వ్యవహరించడం తీవ్ర అభ్యంతరకరమని పేర్కొంది. ఇలాంటివి పునరావృతం కానివ్వకుండా హామీ ఇవ్వాలంది. అయితే భారత్ పిలిపించిన అమెరికా దౌత్యాధికారి పేరును విదేశాంగ శాఖ వెల్లడించలేదు.
ప్రస్తుతం దేశంలో అమెరికా తాత్కాలిక రాయబారిగా క్యాథ్లీన్ స్టీఫెన్స్ ఉన్న సంగతి తెలిసిందే. బీజేపీ సహా పలు సంస్థలు, వ్యక్తులపై నిఘా పెట్టడానికి జాతీయ భద్రతా సంస్థ(ఎన్ఎస్ఏ)కు అమెరికా సర్కారు అనుమతినిచ్చినట్లు కొన్ని పత్రాలను వాషింగ్టన్ పోస్ట్ పత్రిక ఇటీవలే బయటపెట్టడంతో ఈ అంశం మరోసారి చర్చనీయాంశమైంది.