కనులపండువగా సాగిన ధర్మప్రచార రథయాత్ర
పగిడ్యాల(కర్నూలు జిల్లా): లోక క్షేమాన్ని కాంక్షిస్తూ శ్రీశైల భ్రమరాంబా మల్లికార్జున దేవస్థానం ఆధ్వర్యంలో బుధవారం మండల పరిధిలోని నెహ్రూనగర్ గ్రామంలో కొనసాగిన ధర్మప్రచార రథయాత్ర భక్తుల జనసందోహాం మధ్య కనులపండువగా సాగింది. సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభమైన రథయాత్రకు గ్రామంలోని ప్రజలు పాల్గొని భక్తిప్రపత్తులను ప్రదర్శించారు. గ్రామానికి చేరుకున్నా ధర్మప్రచార రథానికి సర్పంచ్ శేషమ్మ, సింగిల్‌విండో ఛైర్మన్ కట్టుబడి శ్రీనివాసులునాయుడు, ఎంపీటీసీలు రంగన్న, పద్మావతమ్మ, గ్రామపెద్దలు లోకానందరెడ్డి, మండ్ల సుధాకర్, సత్యమయ్యశెట్టిలు ఘన స్వాగతం పలికారు.
పడమర నెహ్రూనగర్ నుంచి తూర్పు నెహ్రూనగర్‌లోని ఎల్లంబావి, పీకే ప్రాగటూరు వరకు భక్తుల కేరింతల మద్య బాణా సంచా పేల్చుతూ మంగళ వాయిద్యాలు, భాజభజంత్రీలు, తప్పెట్లతో పెద్ద ఊరేగింపు నిర్వహించారు. అనంతరం స్థానిక శ్రీరాములు దేవాలయం వద్ద శ్రీ భ్రమరాంబామల్లికార్జున స్వామివార్ల కళ్యాణ మహోత్సవ వేడుకలను దేవస్థాన అర్చకులు వైభవోపేతంగా జరిపించారు. ఈ వేడుకలను తిలకించడానికి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివార్లకు నిశ్చయ తాంబులాదులను సమర్పించి భక్తిని చాటుకున్నారు.