కావేరి మండలి వద్దు
ప్రధానితో దేవెగౌడ
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : కేంద్ర ప్రభుత్వం కావేరి జల నిర్వహణా మండలిని ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతోందని వార్తలు వస్తున్న నేపథ్యంలో మాజీ ప్రధాని హెచ్డీ. దేవెగౌడ శుక్రవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీని కలుసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మండలిని ఏర్పాటు చేయవద్దని విన్నవించారు. మండలి ఏర్పాటైతే కర్ణాటక రైతుల ప్రయోజనాలకు గొడ్డలి పెట్టులా పరిణమిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
అంతకు ముందు ఆయన విలేకరులతో మాట్లాడుతూ కర్ణాటక ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందితే ప్రధానిని మంగళవారం కలుసుకోనున్న అఖిల పక్ష బృందంలో నిస్సంకోచంగా పాల్గొంటానని చెప్పారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు, కోర్టుల నడుమ ఈ వివాదం నలుగుతున్నందున దీనిపై తాను మరింత వివరంగా మాట్లాడలేనని అన్నారు.
కేబినెట్ నోట్ సిద్ధం కాలేదు
కావేరి జల నిర్వహణా మండలి ఏర్పాటుకు కేబినెట్ నోట్ సిద్ధమైందని వస్తున్న వార్తల్లో నిజం లేదని ఉడిపి-చిక్కమగళూరు ఎంపీ శోభా కరంద్లాజె తెలిపారు. ఢిల్లీలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ దీనిపై ఎలాంటి అపోహలకు తావు లేదని అన్నారు. రాష్ర్ట ప్రయోజనాలను కాపాడడంలో బీజేపీ ఎంపీలు వెనుకంజ వేయబోరని ఆమె స్పష్టం చేశారు.