సంగీతానికి భావమే ప్రధానం
విశాఖ–కల్చరల్ : సంగీతంపై మధురమైన అనుభూతిని పొందగలిగే కోణంలో తొంగి చూస్తే అన్నీ ప్రక్రియల్లోను రసరమ్యమైన రాగాలతో కూడిన సంగీతమాధుర్యాన్ని పొందవచ్చని సంగీత గానగాంధర్వ పద్మభూషణ్ గ్రహీత డాక్టర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కొనియాడారు. శాంతా–వంతా ట్రస్ట్(హైదరాబాద్ నేతత్వంలో విశాఖ పౌరగ్రంథాలయంలో శుక్రవారం ప్రముఖ వ్యాఖ్యాత, రాంభట్ల నసింహశర్మ రచించిన‘కావ్య గాంధర్వం’అనే సాహిత్య సంగీత గ్రంథాన్ని శాంతా బయోటెక్స్ అధినేత పద్మభూషణ్ కేఈ వరప్రసాద్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ గ్రంథాన్ని బాలసుబ్రహ్మణ్యంకు అంకితం చేస్తూ తొలిప్రతిని ఆయనకు అందజేశారు. సాహితీ రత్నాకర డాక్టర్ డి.వి.సూర్యారావు అధ్యక్షతన నిర్వహించిన ఈ ఆవిష్కరణ సభకు బాలు ముఖ్యఅతిథిగా హాజరై మధురమైన సంగీత సరిగమలను గురించి వివరించారు. ప్రతి అక్షరంలోనూ భావాన్ని వ్యక్తపరిచే సంగీతాన్ని అందించాలని, అదికూడా సాహిత్యంతో కూడిన రాగయుక్తమైనదిగా ఉండాలని ఆకాంక్షించారు. సంగీతమంటే ఇష్టపడని ప్రాణి లేదన్నారు. శతసంగీతావధాని డాక్టర్ మీగడ రామలింగస్వామి కావ్య గ్రంథాన్ని తనదైన శైలిలో సవివరంగా సమీక్షించారు. సప్తస్వరాలను మీటే సంగీత సామ్రాజ్యాన్ని ఈ గ్రంథంలో రాయడం బాగుందని ప్రశంసించారు. సంగీతం, సాహిత్యమే కాకుండా, పద్యాలు, సంగీత ఉపనిషత్తులు, రాగాల పంక్తులు, తెలుగు భాష సంస్కతి వంటి ఉపశీర్షిలతో పరిశోధన గ్రంథంగా రాయడం అభిందననీయమన్నారు. వీటితోపాటు సంగీత విద్వాంసులైన మంగళంపల్లి బాలమురళీకష్ణ సంగీత విశిష్టతను ఈ గ్రంథంలో విశ్లేషించడం అభినందనీయమన్నారు. తొలుత రాంభట్ల బాలసుబ్రహ్మణ్య భారతీచరణ్ సభా నిర్వహణ కార్యక్రమాన్ని చేపట్టారు.
బాలు జన్మదిన వేడుకలు
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 70 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన జన్మదినవేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాంభట్ల పౌరగ్రంథాలయానికి 70 గ్రంథాలను ఉచితంగా అందజేశారు. రాంభట్ల స్వరకల్పనలో జన్మదిన గీతాన్ని గాయనీమణులు విన్పించారు. తర్వాత సెంటర్ ఫర్ పాలసీ స్టడీస్ డైరెక్టర్ ఎ. ప్రసన్నకుమార్ బాలుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జ్ఞాపికను అందజేశారు. తర్వాత నసింహశర్మ, రామలింగస్వామి, వరప్రసాద్‌రెడ్డిలు ఎస్పీ బాలును ఘనంగా సత్కరించారు. నగరంలోని అన్నీ కళలలో రాణిస్తూ విద్య, వైద్య, కళాత్మక రంగాల్లో మేధావులైన కొందరి ప్రముఖులకు కావ్య గాంధర్యం గ్రంథాన్ని ఎస్పీ బాలు ప్రజాస్పందన అధ్యక్షుడు సి.ఎస్.రావు, నాగార్జున యూనివర్శిటీ విశ్రాంతి ఉపకులపతి ఆచార్య. వి. బాలమోహన్‌దాస్, సినీ నటుడు వంకాయల సత్యనారాయణ తదితర ప్రముఖులకు అందజేశారు. పుస్తక ఆవిష్కరణ సభలో నగరానికి చెందిన సంగీత, సాహితీ ప్రియులు తదితరులు హాజరయ్యారు.