ఆ ఎమ్మెల్సీ పదవి వైఎస్సార్సీపీ భిక్ష: బీవై రామయ్య
కర్నూలు : వైఎస్సార్సీపీ వదిలేసిన భిక్ష ఎమ్మెల్సీ పదవి అని వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు బీవై రామయ్య అన్నారు. కర్నూలులో పార్టీకార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ..వైఎస్సార్సీపీ విసిరేసిన ఎమ్మెల్సీ కోసం కేఈ కుటుంభం దిగజారి వ్యవహరిస్తోందని విమర్శించారు. బీసీలంటే కేఈ కుటుంబం మాత్రమే అన్నట్టు ఇతర బీసీలకు అన్యాయం చేస్తోన్నారని ఆరోపించారు. రాష్ట్ర స్థాయి నుంచి పంచాయతీ స్థాయి వరకు ఏ పదవి అయినా ఆ కుటుంభం తర్వాతే అన్నట్టు వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. పార్టీ కోసం ప్రాణాలను, ఆస్తులను ఫణంగా పెట్టిన బీసీలకు కేఈ కృష్ణమూర్తి చేసింది ఏమిటని ప్రశ్నించారు.
కర్నూల్ జిల్లాలో బీసీలంటే కేఈ సోదరులేనా...? ఏ అర్హతతో కేఈ ప్రభాకర్‌ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేశారని ప్రశ్నించారు. జిల్లాలోని టీడీపీకి చెందిన బీసీలు అందరూ అసంతృప్తితో ఉన్నారని, టీడీపీ వెంట ఉన్న నాగేశ్వర యాదవ్, బట్టిన వెంకటరాముడు, బొజ్జమ్మ, గుడిసె కృష్ణమ్మ, తుగ్గలి నాగేంద్ర, బీటీ నాయుడు అర్హులు కారా? నాయి బ్రాహ్మణ, రజక ఇతర కులాల్లో అర్హులైన బీసీలే లేరా..? అని సూటిగా అడిగారు. పదవుల పందేరంలో ముందు వరుసలో ఎప్పుడూ కేఈ కుటుంబం ఉండటం సిగ్గు చేటన్నారు. పదవుల కోసం పార్టీని నమ్ముకున్న వారిపై బెదిరింపులకు దిగడం కేఈ కుటుంబానికి వెన్నతో పెట్టిన విద్య అని, ఇప్పటికైనా జిల్లాలోని బీసీ నాయకులందరూ ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
కళ్ల ముందే ప్రజా స్వామ్యాన్ని చంద్రబాబు అపహాస్యం చేస్తున్నా డెప్యూటీ సీఎం ధృతరాష్ట్రుడిలా మారాడని విమర్శించారు. సుదీర్ఘ అనుభవం ఉన్న కేఈ కృష్ణమూర్తి లాంటి వారు కూడా అహంకార పూరిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. తన తమ్ముడు నామినేషన్ వేసి గంటలు గడవకముందే ఎన్నిక ఏకపక్షమే, స్వతంత్ర అభ్యర్ధులు పోటీ నుంచి తప్పుకుంటారు.. అంటూ ఉప ముఖ్యమంత్రి స్థాయిలో బెదిరింపు ధోరణి లో మాట్లాడం పూర్తిగా ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు. వైఎస్సార్సీపీ పోటీలో ఉన్నా అత్యధిక మెజార్టీతో గెలిచేవాళ్లం అంటున్నారు..అది ఎలాగో ఆయనే చెప్పాలని అన్నారు.
ఇండిపెండెంట్లుగా పోటీ చేసిన వారిని బెదిరించే ధోరణిలో ఉపముఖ్యమంత్రి వ్యాఖ్యలు ఉండటం దురదృష్టకరమన్నారు.ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు అమాయకులు అనడం చూస్తుంటే.. తన తమ్ముడికి వ్యతిరేకంగా నామినేషన్ వేయకూడదు అన్న ధోరణి కనబడుతోందన్నారు. తప్పుడు సంతకాలతో అభ్యర్థులు నామినేషన్ వేశారని డెప్యూటీ సీఎం అనటం చూస్తుంటే.. అధికారుల పనితీరు పై అనుమానాలు వ్యక్తం చేసినట్టు కాదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా జిల్లాలో వెనుకబడిన బీసీలు ఉన్నారని కేఈ కుటుంబం గుర్తించాలన్నారు.