'దేవుడి వద్దకు వెళ్లినా వదలను'
ముంబయి: దేశంలో సంచలనం సృష్టించిన కీనన్, రూబెన్ హత్య కేసులో నలుగురు నిందితులను ముంబయి కోర్టు దోషులుగా తేల్చింది. వారికి జీవితకాలం కఠిన కారాగార శిక్షను విధించింది. ఈ సందర్భంగా కీనన్ తండ్రి వలేరియన్ సంతోష్ కొంత ఆనందం వ్యక్తం చేశారు. తనకు చాలా బాధకలిగినప్పటికీ చివరికి తానేం కోరుకున్నానో అదే శిక్ష విధించిందని చెప్పారు. ఇప్పటి నుంచి వారు ప్రతి క్షణం కీనన్- రూబెన్ గురించే అలోచిస్తారని చెప్పాడు.
అయితే, ఉన్నత న్యాయస్థానానికి వెళ్లడం వారి హక్కు అని, వారు దేవుడి వద్దకు వెళ్లినా సరే అక్కడికి కూడా వెళ్లి తనకు న్యాయం కావాలని నిలదీస్తానని అన్నారు. 2011 అక్టోబర్ 20న కీనన్, అతడి స్నేహితుడు ఫెర్నాండెజ్, స్నేహితురాళ్లతో కలసి అంబోలీ బార్ అండ్ కిచెన్ వద్ద డిన్నర్ కు వెళ్లారు.
డిన్నర్ పూర్తి చేసుకొని రెస్టారెంటు బయటమాట్లాడుకుంటుండగా కొందరు వ్యక్తులు అక్కడ ఓ మహిళతో చెడుగా ప్రవర్తించారు. ఈ సందర్భంగా ఈ స్నేహితులు ఇద్దరు కలిసి వారిని అడ్డుకొని ప్రయత్నం చేయగా వారు దారుణంగా కత్తులతో పొడిచి చంపేశారు. ఈ కేసుకు సంబంధించి 2012 అక్టోబర్లో హత్య ఆరోపణల కిందట జైలులో వేశారు. అప్పటి నుంచి ఈ కేసును విచారించిన కోర్టు నేడు తుది తీర్పును వెలువరించింది.